ఆ విజయాలన్నీ ఉత్తుత్తిదేనా?

Update: 2018-03-11 16:30 GMT

మొన్న జరిగిన మూడు ఈశాన్య రాష్ట్రాల ఎన్నికల్లో తమ పార్టీ ఘన విజయం సాధించిందన్నది కమలనాధుల ఉవాచ. ఈ ఎన్నికలతో మొత్తం ఈశాన్య రాష్ట్రాల్లో పార్టీ పాగా వేసిందన్నది కాషాయ పార్టీ విజయ గర్వంతో చెబుతోంది. త్రిపుర, నాగాలాండ్, మేఘాలయల్లో తమ పార్టీ ప్రభుత్వాలు ఏర్పడ్డాయన్నది వారి మాట. ఇందుకు తగ్గట్టుగానే వారు సంబరాలు చేసుకున్నారు. మిఠాయిలు పంచుకున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే తమది ఇప్పుడు నిజమైన భారతీయ జనతా పార్టీ అన్నది వారి భావన. అటు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా, ఇటు కోల్ కత్తా నుంచి కోహిమా దాకా తమ హవా నడుస్తుందన్నది వారి అంచనా. దీంతో ఇక తమకు ఎదురులేదని కమలనాధులు ఆత్మ విశ్వాసంతో చెబుతున్నారు. కార్యకర్తల నుంచి సీనియర్ నాయకుల దాకా అందరిదీ అదే అభిప్రాయం.

భ్రమల్లో ఉన్నారా?

నిజంగా ఇది వాస్తవమేనా..? లేక కమలనాధులు కలలు కంటున్నారా? ఒక్కసారి వాస్తవాలను లోతుగా పరిశీలిస్తే... కాషాయదళం ఒకింత భ్రమల్లో ఉందన్న అనుమానం కలగక మానదు. త్రిపుర, నాగాలాండ్, మేఘాలయ ఎన్నికల ఫలితాలను లోతుగా విశ్లేషిస్తే ఈ వాస్తవం బోధపడుతుంది. ముందుగా త్రిపుర గణాంకాలను పరిశీలిస్తే మొత్తం 60 స్థానాలకు గాను అది సొంతంగా 35 స్థానాలను సాధించి అగ్రస్థానంలో నిలిచింది. బీజేపీ మిత్రపక్షం ఐపీటీఎఎఫ్ 8, సీపీఎం 16 స్థానాలను సాధించాయి. కానీ బీజేపీ ఓట్ల శాతం 43 కాగా, సీపీఎం ఓట్ల శాతం 42.7 మాత్రమే. అంటే రెండు పార్టీల మధ్య ఓట్ల శాతం వ్యత్యాసం 0.3 శాతం కావడం గమనార్హం. 0.3 శాతం ఓట్ల తేడాతో పార్టీల జాతకాలు పూర్తిగా తారుమారయ్యాయి. కేవలం 2 వేల ఓట్ల తేడాతో సీపీఎం దాదాపు 20 స్థానాలను పోగొట్టుకున్నట్లు రాజకీయ విశ్లేషకుల అంచనా. ఐపీఎఫ్టీ కి 7.5 శాతం ఓట్లు సాధించి 8 సీట్లను కైవసం చేసుకుంది. ఇక్కడ రెండు విషయాలు సుస్పష్టం. ఐపీఎఫ్టీతో పొత్తు లేకుంటే బీజేపీ పరిస్థితి మరో రకంగా ఉండేది. అదే సమయంలో సీపీఎం, కాంగ్రెస్ పొత్తు పెట్టుకుని ఉన్నట్లయితే ఫలితాలు మరో రకంగా ఉండేవి. తాను సాధించిన ఓట్లను సీట్లుగా మార్చుకోవడంలో సీపీఎం వైఫల్యం కనపడుతోంది. ఈ విషయంలో చాకచక్యంగా వ్యవహరించినట్లయితే పార్టీ అధికారాన్ని కాపాడుకుని ఉండేది. ఈ విశ్లేషణలను అర్థఈం చేసుకున్నట్లయితే బీజేపీ మరీ అంత అత్యుత్సాహం ప్రదర్శించాల్సిన అవసరం ఉండదు. ఏదైనా ఎన్నికల రాజకీయంలో ఓట్ల కన్నా సీట్లదే ప్రాధాన్యం కాబట్టి సీపీఎం ఓటమిని, బీజేపీ విజయాన్ని అంగీకరించక తప్పని అనివార్య పరిస్థితి నెలకొంది. ప్రజాస్వామ్య వైచిత్రికి ఇంతకు మించిన నిదర్శనం మరొకటి ఉండదు.

మేఘాలయలో విచిత్ర పరిస్థితి....

ఇక నిన్నమొన్నటి దాకా కాంగ్రెస్ పాలిత రాష్ట్రమైన మేఘాలయలో కూడా విచిత్ర పరిస్థితి. మొన్నటి ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ 21 సీట్లు, 28.5 శాతం ఓట్లతో అగ్రభాగాన నిలిచింది. 19 సీట్లు, 20.6 శాతం ఓట్లతో నేషనల్ పీపుల్స్ ఫ్రంట్ ద్వితీయస్థానంలో ఉంది. లోక్ సభ మాజీ స్పీకర్ పీఏ సంగ్మా కుమారుడు కాన్రడ్ సంగ్మా ఈ పార్టీ సారధి. ఈ పార్టీ ఎన్డీఏలో భాగస్వామి. కానీ ఎన్నికలకు ముందు బీజేపీతో పొత్తును కాదనుకుని ఒంటరిగా పోటీ చేసింది. బీజేపీ 9.6 శాతం ఓట్లతో కేవలం రెండే రెండు సీట్లను సాధించడం గమనార్హం. రాష్ట్రంలో అతి తక్కువ స్థానాలను సాధించిన పార్టీ బీజేపీనే కావడం గమనార్హం. బీజేపీ, ఇతర చిన్నా చితకా పార్టీల మద్దతును కూడగట్టి కాన్రడ్ సంగ్మా ముఖ్యమంత్రి పదవిని అందుకున్నారు. ఇందుకు బీజేపీ పూర్తిగా సహకరించిన మాట వాస్తవం. లండన్ విశ్వవిద్యాలయం నుంచి ఎంబీఏ పట్టభద్రుడైన కన్రడ్ సంగ్మాను ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టేందుకు గవర్నర్ గంగాప్రసాద్ ద్వారా కమలం పార్టీ గట్టిగా కృషి చేసింది.

నాగాలోనూ అంతే....

ఇక నాగాలాండ్ పరిస్థితి కూడా పూర్తి భిన్నం. నిన్న మొన్నటి దాకా అధికారాన్ని నెరిపిన నాగా పీపుల్స్ ఫ్రంట్ లో బీజేపీ భాగస్వామి. కేంద్రంలోని ఎన్డీఏలోకూడా ఇది భాగస్వామి. క్రైస్తవుల ఆధిక్యత గల రాష్ట్రంలో బీజేపీతో పొత్తు పెట్టుకుంటే రాజకీయంగా నష్టమని గ్రహించిన నాగా పీపుల్స్ ఫ‌్రంట్ ఎన్నికలకు ముందు బీజేపీకి దూరమయింది. అదే సమయంలో ఎన్డీఏకు దూరం కాలేదు. దీంతో బీజేపీ చేసేదేమీ లేక నిఫియురియో నేతృత్వంలోని నాగాలాండ్ ప్రొగ్రసివ్ డెమొక్రటిక్ పార్టీతో కలసి వెళ్లింది. ఇక్కడ కూడా అధికార నాగా పీపుల్స్ ఫ్రంట్ కు 39.1 శాతం ఓట్లు, 27సీట్లతో అగ్రభాగాన నిలిచింది. బీజేపీతో పొత్తు పెట్టుకున్న ఎన్.డి.పి.పికి కేవలం 25.5 శాతం ఓట్లతో 16 సీట్లను మాత్రమే సాధించింది. బీజేపీ 14.4 శాతం ఓట్లతో 11 సీట్లతో తృతీయ స్థానంలో నిలిచింది. చివరికి బీజేపీతో పాటు ఇతర చిన్నా చితకా పార్టీల మద్దతుతో నిఫియు రియో ముఖ్యమంత్రి పదవిని అందుకున్నారు. ఈ ప్రక్రియలో బీజేపీ సహకరించిన మాట వాస్తవం. కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జయప్రకాశ్ నడ్డా తదితర బీజేపీ నాయకులు కోహిమాలోనే మకాం వేసి మద్దతు కూడగట్టడంలో సఫలమయ్యారు. పూర్వాశ్రమంలో బీజేపీ నాయకుడైన గవర్నర్ పీబీ ఆచార్య కూడా తనవంతుగా సహకరించారు. నిఫియో రియో నాగా పీపుల్స్ ఫ్రంట్ నుంచి బయటకు వచ్చి స్వతంత్రంగా పార్టీ పెట్టుకున్నారు. మొదట్లో ఆయనతో ఎన్నికల పొత్తు పెట్టుకునేందుకు బీజేపీ అంతగా సుముఖత చూపలేదు. నాగా పీపుల్స్ ఫ్రంట్ పొత్తుకు అయిష్టత వ్యక్తం చేయడంతో కమలనాధులు అనివార్యంగా రియో ఆధ్వర్యంలోని ఎన్.డి.పి.పి. తో పొత్తు పెట్టుకున్నారు. ఈ వాస్తవాలు, విశ్లేషణలను గమనించినట్లయితే బీజేపీ విజయం సత్యదూరమని చెప్పక తప్పదు. అదేవిధంగా త్రిపురలో విజయం సీట్ల రాజకీయంలో భాగమని అర్థం చేసుకుంటారు. అంతే తప్ప కమలనాధులు పూర్తిగా ప్రజల మనసులను గెలుచుకున్నారని చెప్పడం కష్టమైనపనే.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News