అవిశ్వాసమే ప్రజా విశ్వాసమా ?

Update: 2018-03-14 15:30 GMT

చంద్రబాబు నాయుడి పరిస్థితి ముందు నుయ్యి వెనక గొయ్యి చందంగా మారుతోంది. ఒకవైపు వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ దూకుడు పెంచింది. బీజేపీపై అవిశ్వాసానికి తాను సిద్ధమంటూ టీడీపీకి సవాల్ విసురుతోంది. మంత్రివర్గం నుంచి తప్పుకోవడం కాదు, ఎన్డీఏ నుంచి బయటికి రండి అంటూ బరిలోకి లాగుతోంది. రాజకీయ అనివార్యతలు ఒకవైపు రేసులోకి దిగాలని సంకేతాలు ఇస్తున్నాయి. అధికారిక సంకెళ్లు అడ్డుకుంటున్నాయి. నాలుగైదు జిల్లాల్లో తీవ్ర ప్రభావం చూపగల పవన్ కల్యాణ్ రాజకీయం అంతుపట్టడం లేదు. ఏతావాతా ఎలా ముందుకెళ్లాలనే విషయంలో టీడీపీ సందిగ్ధ పరిస్థితిని ఎదుర్కొంటోంది. గతంలో తెలంగాణ ఏర్పాటు విషయంలో ఇటువంటి పరిస్థితినే టీడీపీ ఎదుర్కొంది. రెండు కళ్ల సిద్దాంతం తో అప్పట్లో నెట్టుకొచ్చారు. ఇప్పుడు ఏపీ ప్రజలను సంతృప్తి పరచాలి. అదే సమయంలో కేంద్రానికి దూరం కాకూడదు. ప్రజల్లో ఓటు బ్యాంకు దెబ్బతినకూడదు. రాష్ట్రంలో సకల సమస్యలకు కారణం కమలం పార్టీనే అన్న భావన ప్రజల్లోకి వెళ్లాలి. ఇదే వ్యూహంతో చంద్రబాబు యోచన చేస్తున్నారు. కానీ తాను అనుకున్నట్లుగా రాజకీయం తన నియంత్రణలోకి వస్తుందని చెప్పలేని స్థితి ఏర్పడుతోంది. బీజేపీతో, కేంద్రంతో తాడోపేడో తేల్చుకుంటే తప్ప ప్రజలు శాంతించే సూచనలూ కానరావడం లేదు. ఇదే ఇప్పుడు చంద్రబాబుకు శిరోభారంగా , రాజకీయ వేదనగా పరిణమించింది.

అవిశ్వాసం వర్సస్ ప్రజా విశ్వాసం...

వైసీపీకి చాలా వెసులుబాటులున్నాయి. తాను కేంద్రంలో భాగస్వామి కాదు. రాష్ట్రంలోనూ అధికారంలో లేదు. ఎన్డీఏ తో పొత్తులేదు. బీజేపీకి రుణపడి లేదు. ఇవన్నీ విపక్షంగా ఏరకమైన నిర్ణయమైనా తీసుకునేందుకు సహకరిస్తున్నాయి. ప్రత్యేక హోదా, రైల్వే జోన్ సహా అనేక అంశాల్లో కేంద్రం ఏపీకి అన్యాయం చేస్తోందన్న ప్రచారం , సెంటిమెంటు ప్రజల్లో బాగా బలపడింది. రాజకీయ అవసరాల దృష్ట్యా తెలుగుదేశం పార్టీ, రాష్ట్రప్రభుత్వం వీటిని విస్తృతంగా ప్రచారంలోకి తెచ్చాయి. వాటినే ఓట్లుగా మార్చుకునే పనిలో నిమగ్నమైంది వైసీపీ. కేంద్రం సహకరించనప్పుడు కేవలం మంత్రి పదవులే వదులుకోవడం కాదు, ఎన్డీఏ నుంచే బయటికి రావాలంటూ డిమాండు చేస్తోంది. లేకపోతే గూడుపుఠాణి, టీడీపీ కుట్ర అంటోంది . పైపెచ్చు తాము కేంద్రంపై అవిశ్వాసం పెడతామని చెబుతోంది. ఇందుకు సహకరించాలని టీడీపీని కూడా కోరుతోంది. ఇందులో పక్కా వ్యూహమే దాగి ఉంది. బీజేపీతో పాటు టీడీపీని కూడా ప్రజల ముందు దోషిగా నిలబెట్టాలనే యోచనతోనే వైసీపీ తన బలానికి మించి ప్రయత్నం చేస్తోంది. ఇది నూటికి నూరుపాళ్లు రాజకీయమే. కేంద్రంపై అవిశ్వాసం పెట్టడం వల్ల బీజేపీకి వచ్చే నష్టం ఏమీలేదు. వైసీపీకి పోయిందీ లేదు. నిజానికి చర్చకు వస్తుందోలేదో కూడా తెలియదు. ఈ పరిస్థితుల్లో టీడీపీ ఈఅవిశ్వాసానికి మద్దతు ఇవ్వకపోతే టీడీపీకి రాష్ట్రప్రయోజనాలు పట్టడం లేదన్న విషయాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని వైసీపీ వ్యూహం సిద్దం చేస్తోంది. తద్వారా ప్రజావిశ్వాసాన్ని చూరగొనవచ్చనేది అంచనా.

రాజకీయ అనివార్యత....

దశలవారీ పోరాటం అంటున్న చంద్రబాబు నాయుడి మాటలు ప్రజల్లో పెద్దగా సానుకూలతను సంపాదించి పెట్టలేకపోతున్నాయి. కేంద్రం సహకరించకపోతే నిధులు నీరుగారిపోయే ప్రమాదం ఉంది. ప్రాజెక్టుల అనుమతులు పడకేస్తాయి. అటు ఇటు కాని సంకటస్థితి. ప్రతిపక్షం తీసుకున్నంత సులభంగా అధికార పక్షం వ్యవహరించలేదు. ఇంకా ఏడాది కాలంపాటు కేంద్రంతో కలిసి నడవకపోతే ఆర్థికంగా నష్టపోవడంతోపాటు దాని ప్రభావం రాజకీయంగా పడుతుందేమోనన్నఆందోళనలో ఉన్నారు చంద్రబాబు. నాలుగేళ్ల పాటు కేంద్రాన్ని వెనకేసుకురావడం, ఆరునెలల్లోపే విభజన చట్టానికి సంబంధించిన విషయంలో నిర్దుష్టమైన చర్యలు తీసుకోవాలని చట్టంలోనే ఉన్నప్పటికీ పట్టించుకోకపోవడం ఇప్పుడు టీడీపీకి శాపంగా మారుతున్నాయి. ఆకాశానికి నిచ్చెన వేస్తూ అమరావతిపై కన్న కలలు ప్రతిబంధకాలుగా మారుతున్నాయి. హైదరాబాదు తరహాలోనే అభివృద్ధిని అమరావతిలోనే కేంద్రీకృతం చేస్తున్నారన్న భావన అటు ఉత్తరాంధ్ర, ఇటు రాయలసీమ జిల్లాల్లో బలంగా ఏర్పడింది. ఇది రాజకీయంగా చంద్రబాబుకు నష్టదాయకమే. పైపెచ్చు తాత్కాలిక నిర్మాణాలు తప్ప అమరావతిలోనూ అద్భుతాలు కనిపించడం లేదు. అందువల్ల కృష్ణ, గుంటూరు జిల్లాల్లో కూడా తెలుగుదేశం పార్టీకి పెద్దగా కలిసొచ్చే అవకాశాలేమీ లేవనే అభిప్రాయం వినవస్తోంది. రాజధాని విషయంలో టీడీపీ తీసుకు వచ్చిన హైప్ డిజైన్ల దగ్గరే ఆగిపోయింది. ఈ లోపాన్ని కడిగేసుకోవాలంటే కచ్చితంగా బీజేపీ నుంచి దూరం కావాలి. మరో ఏడాది పాటు కష్టనష్టాలకు సిద్దం కావాలి. తాము ఎన్డీఏ లోనే కొనసాగుతూ కేంద్రాన్ని వ్యతిరేకిస్తున్నామంటే ప్రజలు విశ్వసించరు. ఈ రాజకీయ అనివార్యత చంద్రబాబుకు నిజమైన పరీక్ష పెడుతోంది.

స్పెషల్ పర్పస్ స్థానంలో స్టేటస్ ...

కప్పదాట్లు, తడబాట్లు టీడీపీని సామాజిక మాధ్యమాల్లో అపహాస్యం పాలు చేస్తున్నాయి. ప్రత్యేక హోదా వల్ల రాష్ట్రానికి ఒరిగేదేమీ లేదంటూ గతంలో అనేక సందర్భాల్లో చంద్రబాబు నాయుడు చేసిన ప్రకటన వైరల్ గా తిరుగుతోంది. ప్రత్యేక హోదా కావాల్సిందే నంటూ తాజాగా చేస్తున్న విరుద్ద ప్రకటనలను పోలుస్తూ వైసీపీతో పాటు సోషల్ జర్నలిస్టులూ ఎద్దేవా చేస్తున్నారు. ప్రత్యేక హోదాకు బదులుగా ప్రత్యేక సహాయక పథకానికి రాష్ట్ర్రప్రభుత్వం ఏడాదిన్నర క్రితమే అంగీకరించింది. ఇందులో ప్రధానాంశం విదేశీ రుణ సహాయంతో చేపట్టే ప్రాజెక్టుల నిధులను కేంద్రం తిరిగి చెల్లింపులు చేస్తుంది. అయితే విదేశీ ప్రాజెక్టులను రాబట్టుకోవడం లో జాప్యం చోటు చేసుకుంటోంది. దీనికి బదులుగా నాబార్డు వంటి సంస్థల ద్వారా సుమారు 16 వేల కోట్ల రూపాయలు ఈ ప్రాజెక్టుల పద్దులో ఇవ్వాలని రాష్ట్రం కోరింది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మధ్య జనవరి నెలలో చోటు చేసుకున్న సంభాషణ సారాంశం ఇది. ఇలా చేస్తే రుణాల పద్దు పెరిగిపోతుంది. ఎఫ్ఆర్బీఎం చట్టం ప్రకారం ఏపీకి రుణపరిమితి ఉంది. దీని ప్రకారం ఇప్పటికే అప్పులు తెచ్చేసుకుసుంది. తాజాగా నాబార్డు వంటి స్వదేశీ సంస్థల నుంచి రుణం పొందడం సాధ్యం కాదు. అందుకే స్పెషల్ పర్పస్ వెహికల్ ను ఏర్పాటు చేసి ఎఫ్ఆర్ బీఎం పరిధిలోకి రాకుండా అప్పు తీసుకోమని కేంద్రప్రభుత్వం సలహా ఇచ్చింది. దీనిపై సత్వరం చర్యలు తీసుకోవడం మాని ప్రభుత్వం, అధికారులు నిర్లక్ష్యం వహించారు. ఈ విషయాన్ని ఉద్దేశపూర్వకంగానే బహిరంగ ప్రచారంలోకి రాకుండా చూసుకున్నారు. తాజాగా మొత్తం తతంగమంతా పెండింగులో పెట్టి ప్రత్యేక హోదా పల్లవి అందుకున్నారు. రాష్ట్రానికి 16 వేల కోట్ల మొత్తం కురిపించే స్పెషల్ పర్పస్ వెహికల్ కంటే ఓట్ల వర్షం కురిపిస్తుందని భావిస్తున్న స్పెషల్ స్టేటస్ నినాదమే టీడీపీకి ఇప్పుడు ఆకర్షణీయంగా వినిపిస్తోంది. ఏదేమైనా టీడీపీ పొలిటికల్ పిక్చర్ క్లియర్ అయ్యేందుకు మరికొంత వ్యవధి తీసుకునే అవకాశం కనిపిస్తుంది.

 

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News