అరవ రాజ్యంలో... పాదుకా పట్టాభిషేకమా?

Update: 2017-10-01 08:30 GMT

నిజమైన నాయకునికి, నీడలో బ్రతికే నేతకు మధ్య ఒకటే తేడా. తాను బ్రతికుండగానే తనంతటివాళ్లను తయారు చేసేవాడు నాయకుడు. భయపడుతూ, భయపెడుతూ సర్వం సహా తానొక్కడినే అన్నట్లుగా గుత్తాధిపత్యంతో చెలరేగిపోయేది షాడో లీడర్. ఒక పార్టీ సిద్ధాంతం, భావజాలం దీర్ఘకాలం మనుగడ సాగించాలంటే దేశానికి కావాల్సింది రియల్ లీడర్లు. తనతోపాటే పార్టీ పుట్టిని కూడా ముంచేసేవాళ్లు షాడోలు. అభద్రతలో జీవిస్తూ దానిని ఆధిపత్యంగా మలచుకుని వంగివంగి దండాలు పెట్టించుకుంటూ సాగించే పెత్తనం ప్రజాస్వామ్యానికి చాలా చేటు తెస్తుంది. భారతదేశం డెబ్బై సంవత్సరాలుగా ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థగా కొనసాగుతున్నప్పటికీ ఇంకా రాచరికపు ఆనవాళ్లు, ముఠానాయకత్వాల ముసుగులు తొలగిపోలేదు. ఇందుకు సామాజిక, చారిత్రక కారణాలు అనేకం దోహదం చేస్తున్నాయి. కానీ దాని ఫలితాలు మాత్రం ప్రజాస్వామ్యాన్ని పట్టి పీడిస్తున్నాయి.

తోలు బొమ్మ ప్రభుత్వమేనా?

దాదాపు సంవత్సరకాలంగా చూస్తున్నాం తమిళనాడులో ప్రభుత్వం ఉందో లేదో తెలియదు. ఏడు కోట్ల ప్రజల భవితవ్యం గాలిలో దీపంలా మారింది. ప్రస్తుతం దక్షిణభారత దేశంలోనే పెద్ద రాష్ట్రమైన తమిళనాడు సొంత గొంతుక వినిపించడంలోనూ, ఉత్తరాది ఆధిపత్యాన్ని నిరోధించడంలోనూ చాలకీలకమైన పాత్ర పోషిస్తూ వచ్చింది. ప్రాంతీయ భాషలు, ప్రత్యేకించి ద్రవిడ సంస్కృతులపై చిన్నచూపు లేకుండా ఉత్తరాది రాజకీయ నాయకత్వాన్ని నియంత్రించడంలో తమిళనాడు చూపిన చొరవ ప్రశంసార్హమైనది. పారిశ్రామికీకరణ, సంక్షేమ రంగాల్లో కూడా ప్రగతిశీల రాష్ట్రంగా నిలిచింది. జాతీయపార్టీలను ఎదిరించే నూతన శక్తుల ఏర్పాటుకు స్ఫూర్తిదాయకంగా నిలిచింది. అటువంటి రాష్ట్రంలో ఈరోజున ఏం జరుగుతోంది? తోలు బొమ్మ ప్రభుత్వం నడుస్తోంది. కేంద్రప్రభుత్వం చెప్పుచేతల్లో, కనుసన్నల్లో రోజులు లెక్కపెట్టుకుంటోంది. దీనికంతటికీ కారణం ప్రాబల్యశక్తిగా ఎదిగిన జయలలిత తన జీవిత కాలంలో తన తర్వాత ఎవరు పార్టీని,ప్రభుత్వాన్ని నడపాలనే విషయంలో స్పష్టత నివ్వలేకపోయారు. ఒక రకంగా ఇది వైఫల్యమే. నాయకత్వ విషయంలో తన తర్వాత స్థానం కాదు. కనీసం దరిదాపుల్లో కూడా ఎవ్వరూ లేకుండా ఏకచ్ఛత్రాధిపత్యంగా జయ పోషించిన పాత్ర అన్నాడీఎంకే ప్రభుత్వం పాలిట శాపంగా మారిపోయింది. ఎంజీఆర్ వంటి అగ్రనేతలు సైతం ద్వితీయ శ్రేణి నాయకులను ప్రోత్సహించేవారు. జయలలితను రాజ్యసభ సభ్యురాలిగా, పార్టీ ప్రచారకార్యదర్శిగా అవకాశం కల్పించడం వల్లనే ఆమె నిలదొక్కుకోగలిగారు. ఎందరో ఏకమై వ్యతిరేకించినా తన అస్తిత్వాన్ని నిలుపుకుని సొంత ముద్రతో జయ ప్రజల్లోకి వెళ్లి అధికారం చేపట్టగలిగారు.

మాయావతి కూడా అంతేకదా?

బహుజనసమాజ్ లో మాయావతి ఎదిగేందుకు వ్యవస్థాపకుడు కాన్షీరాం స్థాపించిన తగిన ప్రాధాన్యం ఇచ్చారు. ఆ తర్వాత కాలంలో మాయావతి ముఖ్యమంత్రి కాగలిగారు. కాన్షీరాం కూడా నియంతృత్వంతో తానే పార్టీగా వ్యవహరించి ఉంటే బహుజనసమాజ్ అతనితోపాటే అంతరించిపోయేది. అగ్రనాయకులు తమ తర్వాత తరం బాధ్యులను ప్రోత్సహించాలి. లేకపోతే ఆయా పార్టీల్లో నాయకుడు అంతరించిన తర్వాత శూన్యత ఏర్పడుతుంది. ఒకవేళ అదే పార్టీ అధికారంలో ఉంటే కోట్లాది ప్రజల జీవనంపైనా, రాజకీయ స్థిరత్వంపైనా కూడా ప్రభావం పడుతుంది. ప్రాంతీయపార్టీల్లో కొడుకులు, కూతుళ్లు వారసులుగా ఉన్న రాష్ట్రాల్లో ఈ సమస్య పెద్దగా కనిపించడం లేదు. ఆయా నాయకులు ప్రత్యక్షంగా, పరోక్షంగా వారసులకు తాము ఉండగానే పగ్గాలు అప్పగించేస్తున్నారు. వారసులు లేని పార్టీల్లో తర్వాత తరం నేత ఎవరు? అన్నప్రశ్న తలెత్తుతోంది. వివిధ రాష్ట్రాల్లో కీలకంగా ఉన్న పార్టీలకు నేత్రుత్వం వహిస్తున్న నవీన్ పట్నాయక్, నితీశ్ కుమార్, మమతా బెనర్జీ, మాయావతి వంటివారికి ఆయా పార్టీల్లో సమ ఉజ్జీలు కనిపించడం లేదు.

నితీష్ ఆవేదన అదే....

నితీశ్ కుమార్ ఇటీవలే దీనికి సంబంధించి ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవైపు జాతీయ పార్టీ బీజేపీ అన్ని రాష్ట్రాలను రాజకీయంగా కబళించి వేస్తూ సమాఖ్య కు బదులు పొలిటికల్ పోలరైజేషన్ దిశలో దేశాన్ని నడుపుతోంది. ఇటువంటి స్థితిలో బీజేపీ హవా కు కొంతలో కొంత అడ్డుకట్ట వేయగలిగిన పక్షాలు భవిష్యత్తును కోల్పోవడం చాలా ప్రమాదకర సంకేతం. భారత్ తన భిన్నత్వాన్ని మరిచిపోయి ఏకధృవ ప్రపంచంగా మిగిలిపోతుంది. శ్రీరాముడు వనవాసానికి వెళుతుంటే భరతుడు సింహాసనం అధిష్టించడానికి ఇష్టపడలేదు. రామునికి ప్రతీకగా ఆయన పాదుకలను సింహాసనంపై పెట్టి పరిపాలన సాగించాడని చెబుతుంటారు. తాజాగా జయలలితను కూడా అన్నాడిఎంకే శాశ్వత ప్రధాన కార్యదర్శిని చేసిందా పార్టీ. గతంలో ఆమె ఛాయాచిత్రాన్ని కుర్చీలో ఉంచి పరిపాలన సాగించాడు పన్నీరు సెల్వం. ఇటువంటి వింత ధోరణులు ఆయా నాయకులపై భక్తి భావాన్ని చాటి చెప్పవు. నాయకత్వ లేమికే అద్దం పడతాయి. ఆధునిక ప్రజాస్వామ్యంలో ఈ పాదుకాపట్టాభిషేకాలు చెల్లుబాటు కావు. ప్రత్యామ్నాయ నాయకత్వం తప్పనిసరి. లేకుంటే తమిళనాడు తంతు మిగిలిన రాష్ట్రాల్లోనూ పునరావృతమయ్యే ప్రమాదం ఉంది. నాయకులు ఇప్పటికైనా మేలుకోకుంటే తమ పార్టీలకు, భారత ప్రజాస్వామ్యానికి కీడు చేసినవారవుతారు.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News