అమెరికాకు అంత టెంపరితనమేల?

Update: 2017-10-14 18:29 GMT

ప్రపంచంలో తమదే అసలైన సిసలైన సంపూర్ణ ప్రజాస్వామ్య దేశమని అగ్రరాజ్యం అమెరికా అదేపనిగా అరిగిపోయిన రికార్డువిన్పిస్తుంటోంది. దేశీయంగా ఎలా ఉన్నప్పటికీ అంతర్జాతీయంగా మాత్రం అత్యంత అనాగరికంగా, అప్రజాస్వామికంగా వ్యవహరించడం దానికి అలవాటు. ఇరుగుపొరుగు దేశాలు, మిత్రదేశాలు... ఏవైనప్పటికీ తన ప్రయోజనాలనే ప్రాధాన్యంగా పనిచేస్తోంది. ప్రపంచ విస్తృత ప్రయోజనాలను పక్కన పెడుతుంది. తనకోసం, తనకు నమ్మినబంటటైన ఇజ్రాయిల్ వంటి దేశాల కోసం మొండిగా వెళ్లడం దీనికి కొత్తేమీ కాదు. అంతర్జాతీయ సంస్థల పట్ల అగౌరవంగా వ్యవహరించడం, వాటికి, వాటి నిర్ణయాలకు పూచిక పుల్లపాటి విలువ కూడా ఇవ్వకపోవడం అందరికీ తెలిసిన విషయమే. స్వప్రయోజనాలే తప్ప దానికి ప్రపంచ ప్రయోజనాలు ఏమాత్రం పట్టవు. తాజాగా యునెస్కో పట్ల ‘పెద్దన్న’ తీరు ఇందుకు నిలువెత్తు నిదర్శనం. ఐక్యరాజ్యసమితి, భద్రతామండలి వంటి సంస్థల పట్ల కూడా ఇందుకు భిన్నంగా వ్యవహరించలేదు. ఐక్యరాజ్యసమితి విద్య, శాస్త్ర, సాంస్కృతిక సంస్థ (యునెస్కో)పై తాజాగా అమెరికా ఆగ్రహించింది. ఇజ్రాయిల్ పట్ల అది అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా ఏకంగా యునెస్కో నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించి అంతర్జాతీయ సమాజాన్ని ఆశ్చర్యానికి గురి చేసింది. యునెస్కో ఆషామాషీ సంస్థ ఏమీ కాదు. రెండో ప్రపంచ యుద్ధం అనంతరం 1946 నవంబరు 16న ఆవిర్భవించిన ఈ సంస్థ ఫ్రాన్స్ రాజధాని పారిస్ కేంద్రంగా పనిచేస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా వారసత్వ కట్టడాలు, ప్రదేశాల పరిరక్షణ, అంతర్జాతీయ శాంతికి తన వంతు దోహదపడటం, విద్య, శాస్త్ర, సాంకేతిక కార్యకలాపాల ద్వారా దారిద్ర్య నిర్మూలనకు కృషి చేయడం లక్ష్యంగా పనిచేస్తున్న యునెస్కో లో 194 దేశాలు శాశ్వత సభ్యత్వం కలిగి ఉన్నాయి. మరో ఎనిమిది దేశాలు దీనికి అనుబంధంగా పనిచేస్తున్నాయి. 170 దేశాలకు చెందిన రెండు వేల మంది సిబ్బంది యునెస్కోలో పనిచేస్తున్నారు.

ఈ నాటి ఆగ్రహం కాదు....

యునెస్కో పై అమెరికా ఆగ్రహం ఈనాటిది కాదు. 2011లోనే దీనికి పునాది పడింది. యునెస్కోలో పాలస్తీనాను చేర్చుకోవడం పెద్దన్నకు ససేమిరా ఇష్టం లేదు. 173 దేశాలు మద్దతు ఇస్తున్నప్పటికీ వాషింగ్టన్ జీర్ణించుకోలేదు. పశ్చిమాసియాలో పాలస్తీనా, ఇజ్రాయిల్ మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనేంత వైరం ఉంది. తన అనుంగు మిత్రుడైన ఇజ్రాయిల్ కు మద్దతుగా నిలిచినప్పటికీ ఫలితం లేకపోవడంతో ఆగ్రహంగా ఉంది. పాలస్తీనాలోని హెబ్రాన్ నగరా్ని ప్రపంచ వారసత్వ నగరంగా గుర్తించడం అమెరికా పుండు మీద కారం రాసినట్లయింది. అప్పటి నుంచి యునెస్కో కార్యకలాపాల్లో అన్యమనస్కంగానే పాల్గొంటోంది. 2011లోనే యునెస్కోకు అందజేస్తున్న నిధుల్లో కోత పెట్టడం ప్రారంభించింది. ప్రస్తుత యునెస్కో డైరెక్టర్ జనరల్ ఇరానా బొకావో స్థానంలో నూతన సారధి ఎన్నిక ప్రక్రియ జరిగింది. నూతన డైరెక్టర్ జనరల్ గా ఫ్రాన్స్ కు చెందిన ఆద్రే ఆజౌలే ఎన్నికయ్యారు. ఈ పదవికి ఖతార్ విదేశాంగ మంత్రి హమద్ బిన్ అబ్దుల్ జీజ్ అల్ ఖవారీ పోటీ పడ్డారు. ఈయన పట్ల అమెరికా, ఇజ్రాయిల్ కు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. చివరికి అమెరికా మాటే నెగ్గింది. ఫ్రాన్స్ కు చెందిన ఆద్రే అజౌలే ఎన్నికయ్యారు. ఖవారీకి కేవలం రెండు ఓట్లు రాగా, ఆద్రేకు 28 ఓట్లు రావడం వెనక అమెరికా ప్రభావం ఉందని చెప్పక తప్పదు.

నిధుల వ్యయాన్ని తగ్గించుకోవడానికే....

అమెరికా నిర్ణయానికి మరో కారణం కూడా లేకపోలేదు. ఇప్పటికే అంతర్జాతీయ సంస్థలకు ఉదారంగా నిధులు ఇస్తున్నామని, వీటిల్లో కోత పెట్టాలని పెద్దన్న భావిస్తోంది. యునెస్కో నిర్ణయాన్ని సాకుగా చూపి ఆ ప్రక్రియను చేపట్టింది. ఐక్యరాజ్యసమితి సాధారణ బడ్జెట్ కు 22 శాతం నిధులను అందజేస్తుంది. ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షక దళాల కింద 28 శాతం నిధులను వెచ్చిస్తుంది. యునెస్కోకు ఏటా 8 కోట్ల డాలర్లను సమకూరుస్తుంది. 2011 నుంచి దీనికి కోత పెడుతుండటంతో అమెరికా చెల్లించాల్సిన బకాయీలు సుమారు యాభై కోట్ల డాలర్లకు పెరిగినట్లు అంచనా. ఈ భారాన్ని తగ్గించుకునేందుకునే ఉద్దేశ్యంతోనే ఇజ్రాయిల్ అంశాన్ని తెరపైకి తెచ్చిందన్న అభిప్రాయం దౌత్య వర్గాల్లో వ్యక్తమవుతోంది.

ఇది కొత్తేమీ కాదు.....

యునెస్కో నుంచి వైదొలగడం, మళ్లీ చేరడం వాషింగ్టన్ కు కొత్తేమీ కాదు. 1984లో రోనాల్డ్ రీగన్ హయాంలో ఒకసారి వైదొలిగింది. అప్పట్లో సోవియట్ యూనియన్ (ప్రస్తుత రష్యా), అమెరికా మధ్య ప్రచ్ఛన్న యుద్ధం నడుస్తుండేది. సోవియట్ యూనియన్ పట్ల మొగ్గు చూపుతుందంటూ యునెస్కోకు అమెరికా దూరంగా జరిగింది. మళ్లీ 2002 లో జార్జి బుష్ హయాంలో తిరిగి యునెస్కోలోకి ప్రవేశించింది. యునెస్కో ఆవిర్భావంలో కీలకపాత్ర పోషించిన అమెరికా ఇప్పుడు దాని నుంచి దూరంగా జరగడం తొందరపాటు చర్యగా చెప్పవచ్చు. వైదొలగాలన్న నిర్ణయం వచ్చే ఏడాది డిసెంబర్ 31వ తేదీ నుంచి అమల్లోకి వస్తుంది. అప్పటి దాకా పూర్తిస్థాయి సభ్యత్వ దేశంగా కొనసాగుతుంది.

సంస్కరణల కోసమేనట.....

తమ నిర్ణయం సంస్థలో సంస్కరణల ఆవశ్యకతను సూచిస్తోందని అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి హీతర్ నూవర్డ్ ప్రకటనను తోసిపుచ్చలేం. ఆ ప్రాతిపాదికన చేస్తే ఐక్యరాజ్య సమితి భద్రతామండలి వంటి సంస్థల్లో కూడా సంస్కరణల కోసం అంతర్జాతీయ సమాజం పట్టుబడుతోంది. భారత్, జర్మనీ, జపాన్ వంటి దేశాలు మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం ప్రయత్నిస్తున్నాయి. ఈ విషయంలో మాటలకే పెద్దన్న పరిమితమవుతోంది. యునెస్కోలో సంస్కరణలకు ప్రజాస్వామ్య బద్ధంగా ప్రయత్నించాలి తప్ప ఏకపక్ష నిర్ణయాలతో కాదన్న సంగతి అమెరికాకు తెలియని విషయం ఏమీకాదు.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News