అమెరికా ప‌ని అయిపోయిందా... ?

Update: 2017-11-13 17:30 GMT

ప్ర‌పంచానికి పెద్ద‌న్న‌గా ఉన్న అమెరికా ప‌ని అయిపోయిందా? అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికాను భ్ర‌ష్టు ప‌ట్టించాడా? అంటే ఔన‌నే అంటున్నారు ప్ర‌పంచ‌మేథావి, వాణిజ్య వ‌ర్గాలు. నిజానికి నిన్న మొన్న‌టి వ‌ర‌కు అమెరికా ప‌వ‌ర్ ను ప్రపంచ దేశాలు గుర్తించాయి. అమెరికా ఎంత చెబితే అంత అన్న‌ట్టుగా కూడా ప‌రిస్థితులు సాగాయి. అయితే, అనూహ్యంగా ఆ ప్లేస్‌ను ఇప్పుడు చైనా ఆక్ర‌మించింది. ముఖ్యంగా ఆర్థిక రంగంలో ఇప్పుడు అమెరికా తీవ్రంగా వెనుక‌బ‌డింద‌నే క‌థ‌నాలు వెల్లువ‌డుతున్నాయి. ప్రపంచ ఆర్థిక రంగంలో చైనా ప‌రుగులు తీస్తోంది. కంపెనీల‌ను సైతం పరుగులు పెట్టిస్తోంది. ట్రంప్ అధికారంలోకి వ‌చ్చాక‌, రాక‌ముందు అన్న‌ట్టుగా అమెరికా ఆర్థిక వ్య‌వ‌స్థ మారిపోయింది.

డాలర్ ను చూసుకునేనా?

అమెరికాలో ఉద్యోగాలు అమెరికా వారికే అన్న‌ట్టుగా ట్రంప్ దేశ ప‌రిస్థితిని మార్చేశారు. వీసాలో నిబంధ‌న‌ల‌ను క‌ఠిన త‌రం చేశారు. దీంతో అనేక కంపెనీల్లో లావాదేవీలు స‌న్న‌గిల్లాయి. మ‌రోప‌క్క‌, చైనా ద్వారాలు బార్లా తెరిచింది. ఫ‌లితంగా ఆర్థిక వ్య‌వ‌స్థ భారీ ఎత్తున పుంజుకుంది. చైనాలో ప‌రిస్థితి అమెరికాతో పోలిస్తే చాలా భిన్నంగా ఉంటుంది. ఇక్క‌డ ఉద్యోగాలు కల్పించే కంపెనీలు నష్టపోతే కమ్యూనిస్టు సర్కార్ ఆదుకుంటుంది. 2029 నాటికి అమెరికా జీడీపీని చైనా జీడీపీ దాటేస్తుందని అంచనా. గ్లోబల్ కరెన్సీగా డాలర్ చెల్లుబాటు కూడా ఇంకా ఎంతోకాలం ఉండదు. ఇప్ప‌టి వ‌ర‌కు గ్లోబ‌ల్ క‌రెన్సీగా ఉన్న డాల‌ర్ వ‌ల్లే అమెరికా ఆధిప‌త్యం చాటుకుంటూ వ‌స్తోంది. ఈ చెల్లుబాటు పోతే అమెరికా శ‌ర‌వేగంగా ప‌త‌న‌మ‌వుతుంద‌ని ప్ర‌పంచ‌వాణిజ్య వ‌ర్గాలు కూడా అంచ‌నా వేస్తున్నాయి. అగ్రరాజ్యంలో చైనా పెట్టుబడులు పెరిగాయి. రియల్‌ఎస్టేట్‌లో వేలకోట్ల డాలర్ల పెట్టుబడితో పాటు.. అమెరికాలో చదువుకునేందుకు చైనా త‌మ పౌరుల‌ను అక్క‌డ‌కు పంపిస్తోంది.

అగ్రరాజ్యం ప్రభావం క్రమేపీ.....

దీంతో అగ్రరాజ్యం ప్రభావం క్రమంగా తగ్గుతోంది. ఖర్చులు పెరగడంతో వివిధ దేశాల్లోని సైనిక స్థావరాలను అమెరికా తగ్గించుకుంటోంది. చైనా మాత్రం సైనిక శక్తిని పెంచుకుంటోంది. చైనాలో యాంత్రికీకరణ వేగంగా జరుగుతోంది. 2008 ఆర్థిక సంక్షోభం నుంచి కంపెనీలకు బెయిలవుట్ ప్రకటించింది. ఈ నేప‌థ్యంలో ఇటీవ‌ల ఉత్త‌ర కొరియా అధ్య‌క్షుడు కిమ్ అమెరికా పై తీవ్ర స్థాయిలో ఆరోప‌ణ‌లు చేయ‌డ‌మే కాకుండా అమెరికా ల‌క్ష్యంగా క్షిప‌ణి ప‌రీక్ష‌లు సైతం నిర్వ‌హించాడు. అయినా కూడా అమెరికా ఉత్త‌ర కొరియాను ఏమీ చేయ‌లేక‌పోయింది. పైగా చైనాను బ్ర‌తిమాలుకోవాల్సి వ‌చ్చింది. ఈ విషయంలో కిమ్‌ను నిలువ‌రించాల‌ని అమెరికా చైనాపై ఒత్తిడి చేసినా చైనా లైట్ తీస్కొంది.

ట్రంప్ వాల్యూ పడిపోయింది....

అదేవిధంగా ద‌క్షిణా చైనా స‌ముద్రంపై చైనా ఆధిక్య‌త‌ను ప్ర‌ద‌ర్శిస్తోంది. అంత‌ర్జాతీయ చ‌ట్టాల‌ను సైతం లెక్క‌చేయ‌డం లేదు. ఇక‌, అమెరికా విష‌యానికి వ‌స్తే.. త‌మ‌కు అనుకూలంగా ఉన్న దేశంతో ఒక‌లాగా, మ‌రో దేశంలో మ‌రోలాగా వ్య‌వ‌హిస్తోంది. కొన్ని నిర్ణ‌యాల్లో అమెరికా అవ‌లంబిస్తున్న విధానాల‌పై ప్ర‌పంచ దేశాల నుంచి తీవ్ర వ్య‌తిరేక‌త వ‌స్తోంది. ప‌ర్యావ‌ర‌ణ అనుకూల నిర్ణ‌యాల‌ను అమ‌లు ప‌ర‌చ‌డంలో ట్రంప్ వెనుక‌బ‌డి పోవ‌డమే కాకుండా అంత‌ర్జాయ ప‌ర్యావ‌ర‌ణ ఒప్పందం నుంచి వెన‌క్కి త‌గ్గారు. అదేవిధంగా గ‌త అధ్య‌క్షుడు ఒబామా తీసుకువ‌చ్చిన హెల్త్ కేర్‌ను తుంగ‌లో తొక్కారు. ఫ‌లితంగా అమెరికాలోనే ట్రంప్ వాల్యూ ప‌డిపోయింది. ఇలా ఎలా చూసినా.. అమెరికా అన్ని విధాలా తీవ్రంగా దెబ్బతింది. ఇదే స‌మ‌యంలో చైనా పుంజుకుంటోంది. ఇదే కొన‌సాగితే.. రానున్న భ‌విష్య‌త్తులో అమెరికా తీవ్రంగా దెబ్బ‌తిన‌డం ఖాయంగా క‌నిపిస్తుండ‌గా, చైనా మాత్రం సూప‌ర్ ప‌వ‌ర్‌గా దూసుకుపోతోంది.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News