అప్పు తప్పులు..ముప్పులు

Update: 2018-03-22 15:30 GMT

అప్పులేని వాడే అధికసంపన్నుడు అన్నది పాత సామెతని కొట్టిపారేస్తున్నారు మన రాజకీయ నాయకులు. ఎంత అప్పుంటే అంత పరపతి ఉన్నట్టుగా గొప్పలు పోతున్నారు. ముఖ్యంగా ఎన్నికల ఏడాది ఎంత ఎక్కువ మొత్తం అప్పు తేగలమన్న అంశంపైనే దృష్టి సారిస్తున్నారు. సంక్షేమం, ఎన్నికలు కలగాపులగం చేసి అధికార పీఠం ఎక్కాలనేది పెద్దల యోచన. అందుకే తెలుగు రాష్ట్రాలు రెండూ అప్పుల వేటలో పడ్డాయి. ఇప్పటికే తలమీద భారంగా మారిన అప్పుల కుంపటి కాలుతున్నా, అబ్బబ్బే అదసలు పెద్ద వేడేం కాదంటున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తాము ఇంకా వేల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చి తీరతామని అసెంబ్లీ సాక్షిగా కుండబద్దలు కొట్టేశారు. కేంద్రప్రభుత్వం తీసుకుంటున్నరుణాలను ఉదాహరణగా పేర్కొంటూ తెలంగాణ రాష్ట్ర సంపన్నతకు రుణాలు చాలా అవసరమని తేల్చేశారు. అయితే ఆర్థికవేత్తల్లో దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వివిధ ఆర్థిక సంస్థల నుంచి , విదేశాల నుంచి దూసి తెస్తున్న రుణాల్లో ఎంతమేరకు పెట్టుబడి వ్యయంగా మౌలిక వసతుల అభివృద్ధికి ఉపయోగిస్తున్నారన్నదానిపైనే ప్రగతి ఆధారపడి ఉంటుంది. జనాకర్షక విధానాలపైనే ప్రధానంగా దృష్టి పెట్టే ప్రభుత్వాలు అప్పు చేసి పప్పు కూడు అన్నతరహాలో వ్యవహరించడంతో రాష్ట్రాలు రుణాల ఊబిలో కూరుకుపోతున్నాయి. వచ్చే తరంపైనా ఈ భారం పడబోతోంది. కీలకమైన ప్రాజెక్టులకు భవిష్యత్తులో అప్పులు తెచ్చుకునే సామర్థ్యాన్ని కోల్పోతున్నాయి. రుణపరపతి తగ్గిపోతోంది. అయితే వీటిని వేటినీ పెద్దగా పట్టించుకోని రాజకీయ కార్యనిర్వాహక వర్గాలు అనేక కొత్త మార్గాలు వెదుక్కొని దొడ్డిదారుల్లో మరీ సొమ్ములు సమకూర్చుకుంటున్నాయి. రుణ సంక్షోభం ముదిరే పరిస్థితులు ఎదురు చూస్తున్నాయి.

అప్పు తెచ్చే ముప్పు....

దేశ స్థూల జాతీయోత్పత్తి 167 లక్షల కోట్ల రూపాయల వరకూ ఉంది. తలసరి ఆదాయం లక్షా పదివేల రూపాయల పైచిలుకు కనిపిస్తోంది. అయితే కేంద్రం వివిధ సంస్థల నుంచి చేసిన అప్పు 82 లక్షల కోట్ల రూపాయలకు చేరింది. స్థూల జాతీయోత్పత్తిలో ఈ వాటా 49 శాతం దాటిపోయింది. మన దేశం ఏటా సేవలు, ఉత్పత్తులు, పరిశ్రమలు, వ్యాపార,వాణిజ్యాల ద్వారా ఆర్జించే మొత్తంలో సగం చెల్లిస్తే తప్ప మనం అప్పుల ఊబి నుంచి బయటపడలేం. అయితే అసలు చెల్లించకుండా వాయిదాలు, వడ్డీలే కడుతూ ఉంటాం. తెస్తున్న అప్పులకు, చెల్లిస్తున్న మొత్తాలకు మధ్య అంతరం కనిపిస్తోంది. వచ్చే ఏడాది 8.5 లక్షల కోట్ల మేరకు రుణాలు సమీకరించేందుకు కేంద్రప్రభుత్వం ప్రయత్నిస్తోంది. బడ్జెట్ లో మూడో వంతు మొత్తానికి సరిపడా అప్పులన్నమాట. మామూలు సగటు కుటుంబికుడు ఎవరైనా తన ఆదాయంలో మూడోవంతు అప్పు తెచ్చి కుటుంబాన్ని నడపాలంటే గంగవెర్రులెత్తిపోతాడు. కానీ ప్రభుత్వాలకు ఇదేమీ పట్టడం లేదు. దేశ సహజ, మానవవనరులే పూచీకత్తుగా అప్పులమీద అప్పులు తెచ్చేస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలు సైతం ఈ విషయంలో పోటాపోటీ పడుతున్నాయి. కేంద్రప్రభుత్వం దేశ ప్రజలపై రుద్దిన రుణ భారం ఒక్కో వ్యక్తిపై 60 వేల రూపాయల పైచిలుకు కు చేరింది. ఆంధ్రప్రదేశ్ చేసిన అప్పులు 2.25 లక్షల కోట్లు రూపాయలు ఉన్నాయి. సగటున ఏపీలో వ్యక్తిపై రాష్ట్రసర్కారు చేసిన రుణభారం 55 వేల రూపాయల వరకూ చేరుతుంది. అంటే ఏపీలో నివసించే పౌరుడు తనకు తెలియకుండానే లక్షా పదిహేనువేల రూపాయల తలసరి సర్కారీ అప్పుతో కొనసాగుతున్నాడు.

తెలంగాణ తెలివితేటలు....

దేశంలో రాష్ట్రప్రభుత్వాలు రుణాల విషయంలో కట్టుతప్పుతున్న విషయాన్ని గ్రహించి కేంద్రం ఎఫ్ఆర్బీఎం చట్టాన్ని తీసుకువచ్చింది. ద్రవ్యబాధ్యత నిర్వహణ కు ఉపకరించే ఈ చట్టంలో అనేక నిబంధనలు రాష్ట్రపభుత్వాల రుణోత్సాహానికి కళ్లెం వేశాయి. అప్పుల పరిమితి రాష్ట్ర స్థూలఉత్పత్తిలో 25 శాతానికి మించకూడదని నిషేధం విధించారు. అంతేకాకుండా వార్షిక స్థూల ఉత్పత్తిలో 3 శాతం మించకుండానే ఆ ఏడాది అప్పులు చేయాలని సూచించారు. ఆదాయం మెరుగుగా, వృద్ధి రేటు ఎక్కువగా ఉన్న రాష్ట్రాలకు మాత్రం మరో అరశాతం అప్పును పెంచుకునేందుకు మినహాయింపునిచ్చారు. ఆదాయవనరుల విషయంలో తెలంగాణ ఉన్నతస్థితిలోనే ఉంది. అదే విధంగా అప్పుల విషయంలోనూ భారీగానే చేస్తోంది. ఎఫ్ఆర్ బీఎం చట్టం విధించిన షరతులు ఆటంకం కాకుండా తెలంగాణ సర్కారు వినూత్న విధానాలు అమలు చేస్తోంది. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, హౌసింగ్ ఇన్ఫ్రాస్ట్క్చర్ కార్పొరేషన్ వంటి పేర్లతో ద్రవ్యబాధ్యత,నిర్వహణ చట్ట పరిధిలోకి రాకుండా కొత్త రూటు కనిపెట్టింది. అరవై వేలకోట్ల రూపాయలను ఈ తీరున సమీకరించినట్లు తెలుస్తోంది. అధికారికంగా ప్రభుత్వ అప్పు లక్షా యాభైవేల కోట్ల రూపాయలే కనిపిస్తున్నప్పటికీ మరో అరవై వేల కోట్ల రూపాయలు కూడా ప్రభుత్వ సంస్థలే చెల్లించాలి కానీ అది కేంద్రం వద్ద రికార్డు కాదు. బడ్జెట్ లో కనిపించదు. ఇది వ్యూహాత్మకమే అయినప్పటికీ రానున్న రోజుల్లో సమస్యాత్మకంగా మారుతుంది. ఆయా కార్పొరేషన్లు తిరిగి చెల్లించలేకపోతే ప్రభుత్వంపైనే భారం పడుతుంది. తెలంగాణ కంటే ఆంధ్రప్రదేశ్ నిధుల సమస్యను ఎక్కువగా ఎదుర్కొంటోంది. టీఎస్ రూటును అధ్యయనం చేస్తూ కొత్త అప్పులపై దృష్టి సారిస్తోంది.

ఆంధ్రాలో అప్పు చేసి పప్పుకూడు...

ఏపీలో మౌలికవసతులపై వెచ్చించే పెట్టుబడి వ్యయం పూర్తిగా క్షీణించింది. అభివృద్ధి మెరుగైన స్థితిలో కనిపించాలంటే మూడింట రెండువంతులు జీతాలు, ఖర్చులు, రుణచెల్లింపులకు వినియోగిస్తే మరోవంతు కచ్చితంగా మౌలికవసతులపై పెట్టాలి. లక్షన్నర కోట్ల రూపాయల బడ్జెట్ ఉంటే కనీసం 50 వేల కోట్లు పెట్టుబడి వ్యయంగా చూపాలి. కానీ ఏపీలో లక్షా తొంభైవేల కోట్ల బడ్జెట్ లో 25 వేల కోట్ల రూపాయలు కూడా పెట్టుబడిగా కనిపించక పోవడం దురదృష్టకరం. అంటే మొత్తం బడ్జెట్ లో తొంభైశాతం పైగా ఖర్చులకే పోతోంది. నాబార్డు వంటి సంస్థల ద్వారా రుణం తీసుకుంటే ఎఫ్ఆర్బీఎం చట్ట పరిధిలోకి వస్తుందని ప్రత్యేక ప్రయోజక వాహకం ఏర్పాటు చేసుకుని అప్పు తీసుకోమని కేంద్రం సూచించింది. ఏపీ తన రుణపరిమితిని ఇప్పటికే దాటిపోయింది. ఆర్థిక సంవత్సరం మొదటి మాసం జీతాలకే కటకటలాడాల్సిన పరిస్థితి నెలకొంది. ఒకవైపు అప్పులు పేరుకుపోతూ అస్తవ్యస్తమవుతుంటే మరోవైపు పప్పన్నం తిందామంటోంది రాష్ట్రప్రభుత్వం. సాంస్కృతిక వేడుకలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు వందల కోట్ల రూపాయలు వెచ్చిస్తోంది. చంద్రన్నకానుక, రంజాన్ తోఫా వంటి పేరుతో పప్పు బెల్లాలు పంచిపెడుతోంది. ఇటువంటి చిన్నాచితక పథకాలకు చేస్తున్న ఖర్చులో 50 శాతం మేరకు దుర్వినియోగం జరుగుతోందని ప్రభుత్వ వర్గాలే పేర్కొంటున్నాయి. కానీ ప్రచారంలో భాగంగా వీటిని మాత్రం భారీగానే నిర్వహిస్తున్నారు. ఇదంతా తడిసిమోపెడవుతోంది. రుణాంధ్ర పేరు స్థిరపడిపోయే ప్రమాదం కనిపిస్తోంది. పశ్చిమబెంగాల్ తరహాలోనే ఏటా 40 వేల కోట్ల పైచిలుకు వార్షికంగా అప్పులకు వాయిదాలు చెల్లించుకోవాల్సిన పరిస్థితి. రానున్న కాలంలో ఇదే దుస్థితి ఏపీకి కూడా తప్పకపోవచ్చని ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు.

 

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News