అన్నా....నీ గోడు వీళ్లు పట్టించుకుంటారా?

Update: 2018-03-26 16:30 GMT

అన్నా హజారే.... అవినీతి వ్యతిరేక పోరాట యోధుడైన ఈ సామాజిక కార్యకర్త పేరు పత్రిక, ప్రచార, ప్రసార మాధ్యమాలకు, మధ్యతరగతి ప్రజలకు అత్యంత సుపరిచితం. జన్ లోక్ పాల్ కోసం ఆమరణ దీక్ష ద్వారా మళ్లీ హజారే వార్తల్లోకి ఎక్కారు. నాలుగో రోజుకు అన్నాహజారే దీక్ష చేరుకుంది. ఢిల్లీలో రామ్ లీలా మైదానంలో ప్రారంభమైన అన్నా దీక్ష ఈసారి ఎంతవరకూ ప్రజలను ప్రభావితం చేయగలుగుతుంది? ప్రభుత్వం ఏమేరకు దిగి వస్తుంది? మీడియా ఎంతవరకూ మద్దతిస్తుంది? అంతిమంగా అన్నా దీక్ష సఫలమవుతుందా? అన్నవి ప్రస్తుతానికి ప్రశ్నలే. వీటికి సమాధానం లభించాలంటే మరికొద్ది రోజులు వేచి చూడక తప్పదు. గతంలో ఉన్నంత ఊపు, ప్రజాదరణ నిరాహారదీక్షకు లేదన్నది పత్రికావార్తల సారాంశం. మున్ముందు ఎలా ఉంటుందో చూడాలి మరి.

సామాన్య రైతుగా.....

మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ ప్రాంతంలోని రాలేగావ్ సిద్ధి గ్రామంలో జన్మించిన అన్నా స్వాతంత్ర్య సమరయోధుడు కాదు. రాజకీయ నాయకుడు కూడా కాదు. కేవలం ఒక సామాజిక కార్యకర్త. అవినీతి వ్యతిరేక పోరాట యోధుడు. పల్లెలు పచ్చగా ఉండాలని పరితపిస్తున్న సాధారణ రైతు. అంతిమంగా ఆయన వ్యవహారశైలి, ఆశలు, అంచనాలు, అభిప్రాయాలు మధ్యతరగతి ప్రజలకు దగ్గరగా ఉంటాయి. ఎనిమిది పదుల వయస్సులోనూ ఒక మంచి పనికోసం పోరాడటం అభినందనీయం. 1937 జూన్ 15న జన్మించిన అన్నా అవివాహితుడు. ఆయన పూర్తి పేరు కిసాన్ బాబూరామ్ హజారే. కొద్దికాలం సైన్యంలో పనిచేశారు. అనంతరం ఆయన దృష్టి సామాజిక అంశాలపైకి మళ్లింది. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, పాలనలో పారదర్శకత, అవినీతిపై పోరాటం....ఆయన ప్రాధాన్యాలుగా మారాయి. ఆ దిశగా కొంతవరకూ సఫలమయ్యారు కూడా. తాను పుట్టి పెరిగిన రాలేగావ్ సిద్ధి గ్రామాన్ని పాడి పంటలకు ప్రతీకగా తీర్చిదిద్దడంలో అవిరళ కృషి చేశారు. ఆయన సేవలను గుర్తించిన ప్రభుత్వం 1990లో పద్మశ్రీ, 1992లో పద్మభూషణ్ అవార్డులను ప్రకటించి గౌరవించింది. అన్నా నిజాయితీ, చిత్తశుద్ధిలకు ఈ అవార్డులే నిదర్శనం.

ఆనాడు అశేష స్పందన....

ఏడేళ్ల క్రితం 2011లో యూపీఏ హయాంలో జనలోక్ పాల్ కోసం అన్నా చేపట్టిన ఆమరణ దీక్షకు ప్రజల్లో అశేష స్పందన లభించింది. ప్రజలు ప్రవాహంలా తరలి వచ్చారు. వివిధ సామాజిక, స్వచ్ఛంద సంస్థలు, పార్టీలు ఆయనకు స్వచ్ఛందంగా మద్దతు ప్రకటించాయి. ప్రస్తుత ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ప్రస్తుత పుదుచ్చేరి లెఫ్ట్ నెంట్ గవర్నర్ కిరణ్ బేడీ నాటి అన్నా ఉద్యమంలో అత్యంత కీలక పాత్ర పోషించారు. అనంతర కాలంలో ఆయనతో విభేదించారు. కిరణ్ బేడీ బీజేపీలో చేరి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం మోడీ ప్రభుత్వం ఆమెకు పుదుచ్చేరి లెఫ్ట్ నెంట్ గవర్నర్ గా పునరావాసం కల్పించింది. నాటి అన్నా ఉద్యమానికి యూపీఏ ప్రభుత్వం కొంతవరకూ దిగివచ్చి జన లోక్ పాల్ బిల్లుకు హామీ ఇచ్చింది. ఆ దిశగా అడుగులు వేగవంతం కాలేదు.

ఎవరూ పట్టించుకోవడం లేదా?

ప్రస్తుత అన్నా ఉద్యమాన్ని మోడీ ప్రభుత్వం పట్టించుకున్నట్లు లేదు. అంతేకాక ఉద్యమాన్ని నీరుగార్చేందుకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రయత్నాలు చేస్తోంది. ఉద్యమానికి తరలివస్తున్న కార్యకర్తలను, అన్నా అభిమానులను అడ్డుకుంటోందన్న ఆరోపణలు వినపడుతున్నాయి. రైళ్లను ఆకస్మికంగా రద్దు చేయడం, బస్సులను సోదాలు చేయడం, ఆంక్షలతో ప్రజలను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఏడేళ్ల క్రితం తొలి ఉద్యమంలో మీడియా మద్దతుగా నిలిచింది. విస్తృత కవరేజీ, ప్రత్యేక ఇంటర్వ్యూలు, అవినీతి పోరాటాలు, లోక్ పాల్, లోకాయుక్త ఆవశ్యకత, అవినీతికి వ్యతిరేకంగా ప్రజలను చైతన్యపర్చడంలో కీలక పాత్ర పోషించింది. ఇప్పుడు మోడీ ప్రభుత్వం మీడియాను మేనేజ్ చేసిందన్న ఆరోపణలు బలంగా విన్పిస్తున్నాయి. 2011 నాటాి అన్నా దీక్షకు బహిరంగ మద్దతును ప్రకటించిన బీజేపీ ఇప్పుడు పూర్తిగా మౌనం వహించడం గమనార్హం. ఇప్పుుడు అన్నా పక్కన చెప్పుకోదగ్గ ప్రముఖులు లేరు.

ఏ పాలకుడు కోరుకుంటాడు?

ఇక లోక్ పాల్ విషయానికొస్తే అదో పెద్ద ప్రహసనం. స్వాతంత్ర్యం వచ్చి ఏడు దశాబ్దాలు గడిచినా లోక్ పాల్ దిశగా పాలకులు అడుగులు వేయలేకపోయారు. తన పనితీరును పరిశీలించే, నిలదీసే వ్యవస్థను ఏ పాలకుడూ కోరుకోడు. ఇందుకు ఏ ప్రధాని సుముఖంగా ఉండరు. అలా చేయాలంటే ఎంతో ధైర్యం ఉండాలి. ప్రజాస్వామ్య వాదిగా పేరుగాంచిన తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ కూడా లోక్ పాల్ నియామకంలో మీనమేషాలు లెక్కపెట్టారు. ఫక్తు రాజకీయ నాయకుడైన ప్రస్తుత ప్రధాని నుంచి అటువంటి నిర్ణయాన్ని ఆశించడం అత్యాశ అవుతుంది. ఏ ప్రధాని అయినా ఇదే తరహాలో ఉంటారన్నది చేదు నిజం.

లోక్ పాల్ నియామకంలో.....

2013 నాటి లోక్ పాల్ చట్టంలోని లొసుగులను ఆధారంగా చేసుకుని ప్రస్తుత నియామకంలో తాత్సారం చేస్తోంది. చట్ట ప్రకారం నియామక సంఘంలో ప్రధానితో పాటు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, లోక్ సభ స్పీకర్, ప్రముఖ న్యాయవేత్త, లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు సభ్యులుగా ఉండాలి. లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు లేనందున నియామకంలో ప్రతిష్టంభన ఏర్పడుతుందని మోడీ సర్కార్ సుప్రీంకోర్టుకు నివేదించగా అతి పెద్ద పార్టీ నాయకుడిని ఆహ్వానించాలని న్యాయస్థానం సూచించింది. కామన్ కాజ్ అనే స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ వాదనల సందర్భంగా ఈ విషయాన్ని సూచించింది. ఏప్రిల్ మొదటి వారంలో మళ్లీ కేసు విచారణకు రానుంది. చట్టంలోని లొసుగులను పక్కన పెడితే లోక్ పాల్ నియామకంలో సర్కార్ కు చిత్తశుద్ధి లేదన్నది చేదు నిజం. ఈ నేపథ్యంలో అన్నా హజారే ఆమరణ దీక్ష ఏ మేరకు ప్రభుత్వాన్ని కదిలిస్తుందన్నది ప్రశ్నార్థకమే...!!

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News