అను‘బంధ’ రాజకీయం....!

Update: 2018-02-11 16:30 GMT

తెలంగాణలో అనుబంధ రాజకీయాల హవా మొదలైంది. తమ సొంతబలానికి తోడు ప్రత్యర్థులను చిత్తు చేసేందుకు వ్యూహాత్మక ఎత్తుగడల్లో భాగంగా కొన్నివిచిత్ర కూటములు, రాజకీయ పార్టీలు పురుడు పోసుకునేందుకు ప్రధానరాజకీయపార్టీలు అంగ,అర్థబలాలు సమకూరుస్తున్నాయి. భవిష్యత్తులో ఇవి మిత్రపక్షాలుగానో, లేదా సంకీర్ణంలో భాగస్వాములుగానో చేరతారనే ఆశాభావంతో వీటికి అండదండలందిస్తున్నాయి. ప్రత్యర్థి ఓట్ల చీలికే ప్రధాన లక్ష్యంగా వీటికి ప్రోత్సాహం లభిస్తోంది. అధికార పక్షమైన తెలంగాణ రాష్ట్రసమితి, ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెసు పార్టీ ఈరకమైన ఎత్తుగడలతో అనుబంధ రాజకీయ వ్యూహాలు పన్నుతున్నాయి.2014 ఎన్నికల్లో తెలంగాణలో కీలకపార్టీగా పోటీకి తలపడ్డ తెలుగుదేశం అస్తిత్వం నామమాత్రమైపోయింది. బీజేపీ కూడా పుంజుకునే సూచనలు లేవు. టీడీపీతో కలిసి పోటీచేసే అవకాశాలు లేవని స్పష్టమైన నేపథ్యంలో బీజేపీ పోరాటం కూడా ఉనికికోసమే అన్నట్లుగా ఉండబోతోంది. ఇక తెలంగాణలో వైఎస్సార్సీపీ అభ్యర్థులు పోటీచేయడమే గొప్ప. దీంతో టీఆర్ఎస్, కాంగ్రెసు పార్టీలే ప్రధానప్రత్యర్థులుగా పోటీకి నిలిచే రాజకీయ వాతావరణం ఏర్పడింది. సామాజిక సమీకరణలు, కులాలు, వర్గాల వారీగా ఓట్ల పొందికను అంచనా వేసుకుంటున్న ఆయా పార్టీలు ఎదుటి పార్టీ ఓట్ల బ్యాంకుకు చిల్లు పెట్టేందుకు చిన్నాచితక పార్టీల సమూహాన్ని వాడుకోవాలని చూస్తున్నాయి.

కాంగ్రెసు..కో‘దండం’......

తెలంగాణ రాష్ట్రసాధన మలి దశ ఉద్యమ చివరి ఘట్టాల్లో కీలకపాత్ర పోషించింది పొలిటికల్ జేఏసీ. 2001 నుంచి ఉద్యమాన్ని తన భుజస్కంధాలపై మోస్తూ వస్తున్న తెలంగాణ రాష్ట్రసమితి నాయకత్వం రాష్ట్రసాధనకు తన బలం సరిపోదని గ్రహించింది. తెలంగాణ లోని రాజకీయ పార్టీలు, సామాజిక వర్గాలు కలిసి నడిస్తేనే కేంద్రం పై ఒత్తిడి తేవడం సాధ్యమవుతుందని గుర్తించింది. టీఆర్ఎస్ నాయకత్వంలో పనిచేయడానికి ఇతర రాజకీయ పార్టీలు, పౌరవేదికలు సిద్ధంగా లేవు. ఈనేపధ్యంలో పొలిటికల్ జేఏసీ ఏర్పాటైంది. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెసు, పౌరవేదికలు, ప్రజాసంఘాలు, ఉద్యోగసంఘాలు అన్నీ జేఏసీ గొడుగు కింద పనిచేశాయి. దీనికి అధ్యక్షునిగా కోదండరామ్ కీలకంగా వ్యవహరించారు. అనేక రూపాల్లో ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు. రాష్ట్రం ఏర్పాటయ్యాక టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. సామాజిక వర్గాలు, పార్టీలతో విస్త్రుత అనుబంధం ఉన్న కోదండరామ్ ను తెలంగాణ ప్రభుత్వం , టీఆర్ఎస్ పార్టీ క్రమేపీ దూరంగా పెట్టడం ప్రారంభించాయి. పొలిటికల్ జేఏసీ ప్రాధాన్యాన్ని గుర్తించడానికి నిరాకరించి, అందులో చీలికలకు మద్దతిచ్చి నిస్తేజం చేయాలని చూశారు. ప్రభుత్వంపై వాచ్ డాగ్ మాదిరిగా జేఏసీని రూపుదిద్దాలని ప్రయత్నించిన కోదండరామ్ కు టీఆర్ఎస్ అడుగడుగునా అడ్డుతగిలింది. అతనికి కనీసగుర్తింపు కూడా ఇవ్వలేదు.దీంతో కొంతకాలం వేచిచూసిన కోదండరామ్ తిరిగి ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వంపై ప్రజల వైఖరిని అంచనా వేశారు. నిరుద్యోగులు, రైతులు, పేద,మధ్యతరగతి వర్గాల్లో అసంతృప్తి నెలకొంటున్నవిషయాన్ని గ్రహించి జేఏసీని ప్రత్యేక రాజకీయపార్టీగా మారిస్తే ప్రయోజనం ఉంటుందని తలపోశారు. కాంగ్రెసు పార్టీ నుంచి దీనికి సంపూర్ణ మద్దతు లభిస్తున్నట్లుగా రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. టీఆర్ఎస్ తో విభేదించే వర్గాలన్నీ కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వడం లేదు. కోదండరామ్ కు ఉన్న క్రెడిబిలిటీ రీత్యా ఆయన ఒక పార్టీ స్థాపిస్తే సామాజిక వర్గాలకు అతీతంగా విద్యా,మేధావి వర్గాలు ఆయన చుట్టూ ర్యాలీ అయ్యేఅవకాశాలుంటాయి. ఈ పార్టీ చేసే ప్రచారం టీఆర్ఎస్ విశ్వసనీయతను దెబ్బతీస్తుంది. ఇచ్చిన హామీల ఉల్లంఘనను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడానికి దోహదపడుతుంది. కోదండరామ్ కాంగ్రెసుతో నేరుగా కలవడం వల్ల లభించే రాజకీయప్రయోజనం కంటే ఆయన జేఏసీ తరఫున పార్టీ పెట్టడమే ప్రయోజనదాయకమనేది ఒక అంచనా. అవసరమైతే ఎన్నికల తరుణం ఆసన్నమైన సమయంలో ఈపార్టీతో కాంగ్రెసు అవగాహనకు రావచ్చంటున్నారు. ఈనేపథ్యంలోనే కాంగ్రెసు పార్టీ నాయకత్వం కోదండరామ్ పార్టీకి అవసరమైన సహాయసహకారాలు లోపాయికారీగా అందించడానికి సిద్దంగా ఉన్నట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.

టీఆర్ఎస్ కు ‘బహు’జనం...

కాంగ్రెసు ఎత్తుగడలకు ప్రతిగా తెలంగాణ రాష్ట్రసమితి మరో ప్రత్యామ్నాయ వ్యూహం సిద్ధం చేసిందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. వామపక్షాల్లో బలమైన పార్టీగా ఉన్న సీపీఎం నేతృత్వంలో 28 చిన్నాచితక పార్టీలతో ఏర్పాటైన బహుజన లెఫ్ట్ ఫ్రంట్ పోటీ అధికారపక్షానికి సహకరిస్తుందంటున్నారు. కాంగ్రెసు పార్టీ ప్రధానంగా దళిత నియోజకవర్గాలపై దృష్టిపెడుతోంది. రెడ్డి కమ్యూనిటీ బలంగా ఉన్న నియోజకవర్గాలు ఎలాగూ తమవేనన్నధీమాలో ఉంది. ఇప్పుడు కొత్తగా రంగంలోకి వచ్చిన బహుజనలెఫ్ట్ ఫ్రంట్ కాంగ్రెసు దళిత ఓటు బ్యాంకుకు గండి కొడుతుందని టీఆర్ఎస్ భావిస్తోంది. అధికారపక్షానికి వ్యతిరేకంగా ఉన్న ఓట్లు చీలిపోవడం వల్ల కాంగ్రెసును నిలువరించవచ్చని, సులభంగా టీఆర్ఎస్ విజయం సాధ్యమవుతుందని కేసీఆర్ యోచిస్తున్నారనేది పార్టీ వర్గాల సమాచారం. ఈ ఫ్రంట్ లో ప్రధానపక్షం సీపీఎం మాత్రమే. ఆ పార్టీ బలంగా ఉన్న ఖమ్మం, నల్గొండల్లోని కొన్ని నియోజకవర్గాల్లో అనధికార అవగాహన మేరకు టీఆర్ఎస్ బలమైన అభ్యర్థులను పోటీకి పెట్టదు. పెద్దగా ప్రచారం కూడా నిర్వహించదు. తద్వారా సీపీఎం అభ్యర్థులు గెలిచేందుకు అవకాశం కల్పిస్తుంది. బహుజన లెఫ్ట్ ఫ్రంట్ రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెసు కు అనుకూలంగా ఉన్న దళిత, బలహీన వర్గాల ఓట్లు చీల్చాలి. బదులుగా సీపీఎం కి చెందిన ఏడుగురు అభ్యర్థులు అసెంబ్లీకి ఎన్నికయ్యేందుకు టీఆర్ఎస్ సహకరిస్తుందనేది ఒక ఎత్తుగడగా రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. ఖమ్మంలో నాలుగు స్థానాలు, నల్గొండలో మూడుస్థానాల్లో ఈమేరకు అనధికార ఒప్పందం అమలయ్యే అవకాశం ఉందంటున్నారు. ఎటూ ఖమ్మం, నల్గొండల్లో టీఆర్ఎస్ బలంగా లేదు. సీపీఎం కు ఆమాత్రం అవకాశం ఇవ్వడం వల్ల తమకు రాజకీయంగా వచ్చే నష్టమేమీలేదని ఆపార్టీ అగ్రనాయకత్వం యోచనగా రాజకీయపరిశీలకులు పేర్కొంటున్నారు. మొత్తమ్మీద ఈ అను‘బంధ’ రాజకీయాలు ఎటు దారితీస్తాయోననే ఉత్కంఠ సర్వత్రావ్యక్తమవుతోంది. ఒక్కోసారి ఏకుమేకై ప్రధానపార్టీలకు చుక్కలు చూపించే అవకాశం కూడా ఉంది. రాజకీయాల్లో ఏదైనా జరగవచ్చు. మిత్రుడు అనుకున్నవాడే చివరికి శత్రువుగా మారి గెలుపు అవకాశాలను దెబ్బతీసే ప్రమాదమూ ఉంది.

 

-ఎడిటోరియల్ డెస్క్.

Similar News