అధికారానికి ...ఆదాబ్

Update: 2017-11-10 15:30 GMT

రాజకీయాల్లో ఏదీ యాదృచ్చికంగా జరగదు. ఒకవేళ అలా జరిగినట్లు కనిపిస్తే పక్కాగా అలా అనిపించేలా ప్లాన్ చేసినట్లే. ప్రతిసంఘటనకూ,పరిణామానికీ , కలయికకూ, వేర్పాటుకూ ఒక ప్రాతిపదిక, ఉద్దేశం ఉంటాయి. అందుకే ఏ సందర్భానికైనా పూర్వాపరాలు బేరీజు వేసుకోవాల్సి ఉంటుందంటారు అమెరికా మాజీ అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్ . తాజాగా తెలంగాణలో చోటు చేసుకుంటున్న పరిణామాలు రూజ్ వెల్ట్ మాటలనే గుర్తుకు తెస్తున్నాయి. 2014 వరకూ కాంగ్రెసు పార్టీతో అంటకాగిన ఎం.ఐ.ఎం. కి ఈ రోజున ఆ పార్టీ అంటరానిదై పోయింది. సర్వభ్రష్ట పాపిష్టిగా మారిపోయింది. కేంద్రప్రభుత్వానికి అన్నివిధాలా సహకరిస్తూ ఒకానొకదశలో ఎన్డీఏ లో చేరతారంటూ ప్రచారం సాగిన టీఆర్ఎస్ ఇప్పుడు ఆప్తబంధువై పోయింది. పరస్పర ప్రశంసలు, పొగడ్తలు, మెచ్చుకోళ్లతోపాటు 2019 ఎన్నికల్లో కలిసి నడుస్తామంటూ అసెంబ్లీ సాక్షిగా అనుబంధాన్ని చాటుకున్నారు. ఎక్కడ మైనారిటీల అంశమొచ్చినా ఓట్ల పరంగా ఎన్ క్యాష్ చేసుకుందామని చూసే కాంగ్రెసు పార్టీ, మైనారిటీ బుజ్జగింపును వ్యతిరేకిస్తూ మెజార్టీని మచ్చిక చేసుకోవాలని ఆశించే బీజేపీ తెల్లబోకతప్పలేదు. బహిరంగంగా ఇంతటి అన్యోన్యం టీఆర్ఎస్ , ఎంఐఎం ల మధ్య వెల్లివిరుస్తుందని వారూహించలేదు. కులపరమైన సమీకరణతో తెలంగాణలో కాంగ్రెసు బలపడుతోందన్న సంకేతాలున్నాయి. మతపరమైన సమీకరణతో కాంగ్రెసును దీటుగా ఎదుర్కోవాలన్న కేసీఆర్ వ్యూహంలో అంతర్భాగంగానే తాజా పరిణామాలను చూడాలంటున్నారు పరిశీలకులు.

మతం ... మనోభీష్టం....

యజ్ణయాగాదులు, బ్రాహ్మణ ఫురోహితులకు సన్మాన సత్కారాలు, పీఠాధిపతులకు సాష్టాంగ ప్రణామాలు..ఒకరకంగా చెప్పాలంటే బీజేపీ హిందూవాదులు సైతం అసూయపడేంతగా నియమనిష్టలు కనబరుస్తుంటారు తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు. కానీ ఇటీవలికాలంలో తీసుకున్న నిర్ణయాలు, తాజాగా అసెంబ్లీలో చేసిన ప్రసంగం, ముస్లిం రిజర్వేషన్లపై కేంద్రంతో పోరాటం చేసైనా సాధిస్తామన్న ప్రకటన చూస్తుంటే మైనారిటీ మంత్రులు, ఎమ్మెల్యేలు సైతం మెస్మరైజ్ అయిపోయారు. ఎంఐఎం శాసనసభా పక్ష నాయకుడు అక్బరుద్దీన్ ఓవైసీ అయితే కేసీఆర్ వంటి ముస్లిం జనోద్ధారకుడిని ఇంతవరకూ చూడలేదన్నట్లుగా ప్రశంసల జల్లు కురిపించారు. ముఖ్యమంత్రి పదవి ఆయనకు పూచికపుల్ల అంటూ మునగచెట్టెక్కించేశారు. నిజానికి మతం వ్యక్తిగతం. కానీ అధికార అందలం ఎక్కడానికి అదో అవకాశం. ప్రజలను సులభంగా సమీకరించడానికి, ప్రేరేపించడానికి మతాన్ని మించిన ఆయుధం ఉండదు. హైదరాబాదు పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో ఎంఐఎం తిరుగులేని ఆధిక్యాన్ని దశాబ్దాల తరబడి కొనసాగిస్తోందన్నా, యూపీలో బీజేపీ అధికారాన్ని చేజిక్కించుకోగలిగిందన్నా మత ప్రభావాన్ని తోసిపుచ్చలేం. తెలంగాణ వ్యాప్తంగా పూర్తిస్థాయిలో ఆ పరిస్థితులు లేవు. కానీ తాజాగా వాటిని కల్పించేందుకు వ్యూహాత్మకంగా నాయకులు పావులు కదుపుతున్నారు. భవిష్యత్తులో ఏం జరగబోతుందో రాజకీయ దార్శనికతతో అంచనా వేసే కేసీఆర్ ఈవిషయంలో ప్రత్యర్థులకంటే ఒక అడుగు ముందే ఉన్నారు.

కలవర పెట్టే దళిత్, రెడ్డి, కాంగ్రెసు కాంబినేషన్....

తెలంగాణలో రాజ్యధికారం కోల్పోయిన రెడ్డి సామాజిక వర్గం కుతకుతలాడిపోతోంది. నూటికి 80 శాతం ఈ సామాజిక వర్గానికి చెందిన వారు కాంగ్రెసు పార్టీని అధికారంలోకి తేవాల్సిందే అని కంకణం కట్టుకున్నారు. ఈ వర్గానికి చెందిన పెద్ద నాయకులు కూడా ఆ పార్టీతోనే కలిసి నడుస్తున్నారు. తెలుగుదేశం పార్టీ దెబ్బతిన్నతర్వాత బీసీలు ఎటుపోవాలో తెలియక కూడలిలో కొ్ట్టుమిట్టాడుతున్నారు. కమ్యూనిస్టులు, పౌరసంఘాలు, ప్రజాసంఘాలు, జేఏసీల వంటి వేదికలు క్షేత్రస్థాయిలో జిల్లాల్లో బాగా తిరుగుతున్నాయి. దళితులకు అన్యాయం జరుగుతోందన్న భావనను విస్త్రుతంగా ఆయా వర్గాల్లో ప్రచారం చేయగలుగుతున్నారు. ప్రచారం చేస్తున్న పక్షాలకు ఓట్లను కురిపించకపోవచ్చు. అధికారపార్టీని ఓడించేందుకుగాను పోటీగా ఉన్న కాంగ్రెసు వైపు దళిత వర్గాలు ఆకర్షితులు కావడానికి ఈ ప్రచారం బాగా దోహదం చేస్తోంది. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు బాగానే అమలవుతున్నా, దళితులకు మూడెకరాల భూమి, డబుల్ బెడ్ రూం ఇళ్లవంటివి అమలు కావడం లేదన్న విషయం బలంగానే ఆయా వర్గాల్లోకి వెళుతోంది. మూడెకరాల పంపిణీ ఎన్నికల హామీని అమలు చేయడం ప్రబుత్వానికి దాదాపు అసాధ్యంగా మారింది. ఈ అసంతృప్తిని తనకు ఓటు బ్యాంకుగా మలచుకునేందుకు కాంగ్రెసు పథక రచన చేస్తోంది. మల్లుభట్టివిక్రమార్క, దామోదర రాజనరసింహ, మల్లు రవి, అద్దంకి దయాకర్, సంపత్ వంటి దళిత నేతలు కాంగ్రెసు బాణిని బాగానే వినిపిస్తున్నారు. కాంగ్రెసు ఎస్సీ సెల్ ఛైర్మన్ కొప్పుల రాజు వీరికి అవసరమైన మార్గదర్శకత్వం వహిస్తున్నారు. తెలంగాణలో అధిక సంఖ్యలో ఉన్న మాదిగలకు ఎస్సీ రిజర్వేషన్ల విభజన కూడా దాదాపు అసాధ్యంగానే ఉంది. ఈ ప్రబావం కూడా టీఆర్ఎస్ పైనే పడుతుంది. కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ ప్రతిపక్షంలో ఉన్నందున మాదిగల విషయంలో కూడా కాంగ్రెసు లబ్ధి పొందేందుకు వీలు ఏర్పడుతోంది. సామాజిక, ఆర్థిక ప్రాబల్యం కలిగిన రెడ్డి వర్గానికి దళితుల చేదోడు లభిస్తే కాంగ్రెసు పార్టీకి రాష్ట్రంలోని 45 నియోజకవర్గాల్లో స్పష్టమైన ఆధిక్యం లభిస్తుందనేది అంచనా.

మైనారిటీ ..మా ఓటు....

కాంగ్రెసు అంచనాలను పసిగట్టే కేసీఆర్ రాష్ట్రంలో 12 శాతం మేరకు ఉన్న మైనారిటీ ఓటింగును గంపగుత్తగా ఆకట్టుకోవాలనే ప్రయత్నంలో పడ్డారు. ముస్లింలకు సంబంధించి ఎంఐఎం ఆసక్తులు కూడా హైదరాబాదుకే పరిమితమై ఉన్నాయి. తెలంగాణలోని ఇతర ప్రాంతాల్లో దాదాపు 30 నియోజకవర్గాల్లో ముస్లిం ఓట్లు 5 నుంచి 10 వేల వరకూ ఉన్నట్లు అంచనా. టీఆర్ఎస్ కు ఉన్న ఆదరణకు ముస్లిం ఓట్లు కూడా తోడైతే గెలుపు నల్లేరుపై బండినడకే అనేది కేసీఆర్ యోచన. ఇలా బలాబలాల సంతులనం కోసమే కేసీఆర్ ముస్లిం రిజర్వేషన్లు, గురుకులాలు, సివిల్స్ కు ప్రత్యేక శిక్షణ, రెండో అధికార భాషగా ఉర్దూ వంటి అంశాలతో ఆకట్టుకునే పనిలో పడ్డారు. ప్రభుత్వానికి వినతులు అందచేయడానికి ఉర్దూ అనువాదకులను నియమిస్తున్నారు. పాఠశాలల్లో ఉర్దూ టీచర్ల నియామకానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. పెళ్లి, పండగ, పవిత్ర యాత్ర వంటి అన్నివిషయాల్లోనూ ఆర్థికంగా ప్రభుత్వ పరమైన అండను అందచేస్తున్నారు. మరిన్ని కొత్త పథకాలనూ రూపకల్పన చేస్తున్నారు. ఈ విషయంలో అధికారపక్షానికి ఎంఐఎం పక్కవాద్యంగా మారింది. ముస్లిం మైనారిటీ పార్టీగా ఉన్న ఎంఐఎం సహకారంతో ఆయా పథకాలను ప్రచారం చేసుకోవడం, మైనారిటీ ఓట్లను జిల్లాల్లో రాబట్టడమే లక్ష్యంగా టీఆర్ఎస్ ఎత్తుగడలు వేస్తోంది. నిజాం చాలా గొప్ప చరిత్ర కలవాడంటూ ముస్లింలలో ఆత్మాభిమానం రగిలించడంతోపాటు సెంటిమెంటునూ రేకెత్తించాలనే దిశలో పావులు కదుపుతున్నారు కేసీఆర్. ఓట్ల రాజకీయంలో ఇది దగ్గరి దారి. కానీ ఏమాత్రం వికటించినా సామాజిక అశాంతికి దారితీసే ప్రమాదం కూడా పొంచి ఉంది.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News