అదే తప్పు ..పదే పదే......!

Update: 2018-01-25 15:30 GMT

విప్లవనాయకుడు చేగువేరా , సంస్కర్త పూలే పేర్లను నిత్యం స్మరించే జనసేనాని పవన్ కల్యాణ్ పాత పల్లవినే అందుకుంటున్నారు. ప్రశ్నిస్తానంటూ రంగ ప్రవేశం చేసిన పార్టీ ప్రశంసల బాట పడుతోంది. రాజకీయాల్లో కొత్తదనం కోరుకునే వారికి పవన్ కొరుకుడు పడటం లేదు. ఆయన చంద్రబాబు నాయుడిని కలుస్తున్నారు. తాజాగా కేసీఆర్ నూ కలిశారు. ఆయా పార్టీల అధినేతలను కలిసినప్పుడు అంతర్గతంగా ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. బయటకొచ్చి చేసే ప్రకటనలు మాత్రం జనసైనికుల ఉత్సాహంపై నీళ్లు జల్లేస్తున్నాయి. ఈ మాత్రం దానికి కొత్త పార్టీ అవసరమా? అంటూ ప్రశ్నిస్తున్నాడు సగటు ఓటరు. చలోరే చల్ అంటూ ప్రచార యాత్ర తొలిదశను తెలంగాణలో పూర్తి చేసిన పవన్ కల్యాణ్ రాజకీయ ప్రస్థానం ఏమిటో ఎవరికీ అంతుచిక్కడం లేదు. అసలు రాజకీయ పార్టీకి ఉండాల్సిన పంథా, పథనిర్దేశం పై జనసేనకు స్పష్టమైన అవగాహన ఉన్నట్లు కనిపించడం లేదని రాజకీయ విశ్లేషకులు విమర్శిస్తున్నారు.

వ్యూహాత్మక తప్పిదం....

అభిమానుల సంఖ్య దృష్ట్యా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అత్యధిక ఆదరణ కలిగిన నటుడు పవన్ కల్యాణ్. మిగిలిన అగ్ర హీరోల సినిమా సూపర్ హిట్టైతే సాధించే 50 కోట్ల రూపాయల వసూళ్లు పవన్ సినిమా అట్టర్ ప్లాఫ్ అయితే వచ్చే మొత్తంతో సమానం. అభిమానుల్లో పవన్ మానియా ఆ రేంజిలో ఉంటుంది. ప్రేక్షకాదరణలో మెగాస్టార్ చిరంజీవిని సైతం అధిగమించి కొత్త రికార్డులు సృష్టించుకున్న హీరో. సినిమారంగాన్ని పక్కనపెడదాం. రాజకీయంగా కూడా పవన్ పై ప్రత్యేక అభిమానం ఉన్న లక్షలాది ప్రజలకు కొదవ లేదు. దీనికి ప్రధాన కారణం పవన్ మాటతీరులోని నిజాయతీ. తాను చెప్పే విధానాలపట్ల కనబరిచే చిత్తశుద్ధి. సూటిగా మాట్లాడటం, నేరుగా ప్రశ్నించడం ఆయన విధానంగా ప్రజలు భావిస్తారు. తనలోని ఆవేశమే ఆయనకు ఒక కొత్త ఇమేజ్ తెచ్చిపెట్టింది. ప్రజారాజ్యం పార్టీ పెట్టకముందే కుటుంబ వ్యవహారంలో అన్న కూతురికి అన్యాయం జరుగుతోందనే అనుమానంతో రోడ్డెక్కి ధర్నా చేసి హడావిడి చేసి తన ఆవేశాన్ని నిరూపించుకున్నారు. అటువంటి వ్యక్తి ప్రజల సమస్యలపై గట్టిగా స్పందిస్తారనే నమ్మకం ఉండేది. ప్రభుత్వాన్ని ప్రజలకు జవాబుదారీ చేసేలా ప్రశ్నిస్తారనే ఆశలూ ఉండేవి. కానీ తాజాగా ఈ విధానం నుంచి క్రమంగా వైదొలిగిపోతున్నట్లనిపిస్తోంది. ప్రజారాజ్యం అధినేతగా చిరంజీవి చేసిన తప్పులనే పవన్ కూడా పునరావ్రుతం చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. 2008 లో పీఆర్పీని స్థాపించిన తర్వాత చిరంజీవి అత్యంత లౌక్యంగా పాలిటిక్స్ నడపాలని ప్రయత్నించారు. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిని , ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడిని తీవ్రంగా విమర్శించడానికి సాహసించలేదు. ‘ఇద్దరూ మంచివారే. బాగానే పనిచేస్తున్నారు. పని చేస్తారు. మాకు అవకాశం ఇస్తే ఇంకా చక్కగా పనిచేస్తాం.’ అంటూ చిరంజీవి సన్నాయినొక్కులు మొదలుపెట్టారు. దాంతోనే సగం బలం క్షీణించిపోయింది. ఇద్దరూ మంచివారైతే ప్రజారాజ్యం వ్యవస్థాపనకే అర్థం లేదనే విమర్శలు మొదలవ్వడంతో మెగా అభిమానులు, కాపు సామాజిక వర్గానికే ప్రజారాజ్యం పరిమితమైపోయింది. ఇప్పుడు అదే రకమైన తప్పును పవన్ కల్యాణ్ పునరావృతం చేస్తున్నారు. ఇద్దరు సీఎంలతోనూ సత్సంబంధాలు నెరపుతూ జనసేన ను ముందుకు తీసుకెళ్లాలన్న ప్రయత్నం అంతగా ఫలించే అవకాశాలు లేవని రాజకీయ విమర్శకులు పేర్కొంటున్నారు.

కింగ్ మేకర్ 2019.....

పవన్ 2019 ఎన్నికల్లో కింగ్ మేకర్ పాత్రనే పోషించాలని కోరుకుంటున్నారని ఆయనకు సన్నిహిత వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. తనకు పదవి, అధికారం మీద వ్యామోహం లేదని ఇప్పటికే పలు సందర్భాల్లో పవన్ పేర్కొన్నారు. చిన్న చిన్న పొరపాట్లు ఉన్నప్పటికీ పునర్విభజన తర్వాత కొత్తగా ఏర్పడిన రెండు రాష్ట్రాలు పరిపాలన పరంగా సరైన దిశలోనే నడుస్తున్నాయనేది పవన్ నిశ్చితాభిప్రాయమంటున్నారు. అందుకనే ఆయా పార్టీలు, అధినేతలపై తీవ్రంగా ధ్వజమెత్తకుండా ప్రజల్లోకి వెళ్లాలనుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో పాజిటివ్ పాలిటిక్స్ కు నిదర్శనగా నిలవాలనేది ఆయన యోచనగా చెబుతున్నారు. అందువల్ల సమాజంలో రాజకీయ కక్షలు, నేతల మధ్య వ్యక్తిగత స్పర్థలకు తావుండరాదనేది పవన్ ఆలోచనగా జనసేనలోని ఉన్నతస్థాయి వర్గాలు పేర్కొంటున్నాయి. సిద్ధాంతపరమైన విధానాల్లోనే పార్టీలు,నాయకుల మధ్య విభేదాలు ఉండాలి తప్పితే వ్యక్తిగత వైరాల వల్ల ప్రజలకు, రాష్ట్రానికి నష్టం వాటిల్లుతోందని ఇటీవల పార్టీ అంతర్గత సమావేశంలో పవన్ స్పష్టం చేశారనేది సమాచారం. 2019 నాటికి జనసేన పూర్తిస్థాయి నిర్మాణం సాధ్యం కాదని పవన్ అభిప్రాయపడుతున్నట్లుగా తెలుస్తోంది. దీర్ఘకాలం పాటు రాజకీయాల్లో కొనసాగాలంటే అందుకు అవసరమైన మౌలిక వసతులు, శిక్షణతో కూడిన సమర్థ యంత్రాంగం అవసరం. అందుకనుగుణంగా కార్యాలయాలు, క్రియాశీల కార్యకర్తలకు శిక్షణ, ప్రచారం చేయబోతున్నారు. అధికార పక్షం ఏదైనప్పటికీ పదేళ్లపాటు అధికారంలో ఉంటేనే అభివృద్ధి కార్యక్రమాలకు ఒక లక్ష్యం , దిశ ఉంటాయనేది జనసేన సిద్దాంతమని పవన్ చెబుతున్నారంటున్నారు.అందుకే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ 2019లో పోటీకి నిలబడి రాజకీయంగా పట్టు నిరూపించుకోవడానికే పరిమితం కావాలనేది జనసేన ఆలోచన. కింగ్ మేకర్ గా మారడం ద్వారా ప్రభుత్వాలు సక్రమ పంథాలో నడిచేలా వాచ్ డాగ్ పాత్ర పోషించవచ్చని 2024 నాటికి పూర్తిగా తెలుగు రాష్ట్రాల్లో జనసేన జెండా ఎగరేయాలనేది పవన్ దీర్ఘకాలిక లక్ష్యం అని జనసేనలో సీనియర్ నేతలు చెబుతున్నారు.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News