జగన్ ఊరుకుంటారా…?

విశాఖ అర్బన్ జిల్లా రాజకీయాల్లో టీడీపీ, వైసీపీల మధ్య నువ్వా నేనా అన్నట్లుగా పోరు సాగుతుంది. ఉన్నది రెండే పార్టీలు,అ అధికార పదవులు కూడా రెండు పార్టీలు [more]

Update: 2019-08-13 15:30 GMT

విశాఖ అర్బన్ జిల్లా రాజకీయాల్లో టీడీపీ, వైసీపీల మధ్య నువ్వా నేనా అన్నట్లుగా పోరు సాగుతుంది. ఉన్నది రెండే పార్టీలు,అ అధికార పదవులు కూడా రెండు పార్టీలు పంచుకున్నాయి. ఒకరు అధికారంలో ఉంటే రెండవవారు ప్రతిపక్షంలో ఉంటారు. దాంతో ఎపుడు సై అంటే సై అన్న తీరే కనిపిస్తుంది తప్ప మాటలూ, మర్యాదలు చాలా తక్కువ. అయితే తాజా ఎన్నికల్లో వైసీపీ నుంచి విశాఖ ఎంపీగా అనూహ్యంగా నిలిచి గెలిచిన ఎంవీవీ సత్యనారాయణ టీడీపీతో సన్నిహిత సంబంధాలను పూర్తిగా కొనసాగించడం విశేషం. ఇప్పటివరకూ ఎవరూ అలాంటి చొరవ తీసుకోలేదు. కానీ వృత్తి రిత్యా రియల్ ఎస్టేట్ వ్యాపారి అయిన ఎంవీవీ సత్యనారాయణకు పూర్వాశ్రమంలో అందరితో పరిచయాలు ఉండడంతో ఎంపీగా అయినా కూడా వాటిని కొనసాగిస్తున్నారని ఆయన అనుచరులు అంటున్నారు.

ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యేతో …..

విశాఖ తూర్పు టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు పొందారు. ఆయన ఇప్పటికి మూడు సార్లు వరసగా ఎమ్మెల్యేగా గెలిచి సరికొత్త రికార్డ్ సృష్టించారు. ఆయనకు తాజా ఎన్నికల్లో వైసీపీ నుంచి గట్టి పోటీ ఎదురైందన్నది నిజం. అయితే వైసీపీలోని వర్గపోరు, కొత్తగా చివరి నిముషంలో పోటీకి దిగిన అక్రమాని విజయనిర్మలకు స్థానిక వైసీపీ నేతలు సహకరించకపోవడంతో వెలగపూడి మంచి మెజారిటీతో విజయం సాధించారని అంటారు. ఆ తెర వెనక సహాయం సంగతి ఏమో కానీ ఇపుడు వెలగపూడి రామకృష్ణబాబు ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమానికి కి ఎంవీవీ సత్యనారాయణ, ముఖ్య అతిధిగా హాజరై వైసీపీ నేతలకు షాక్ ఇచ్చారు. వెలగపూడితో చెట్టాప‌ట్టాలు వేస్తూ టీడీపీ తమ్ముళ్లను కూడా ఖుషీ చేశారు. ఇది విశాఖ రాజకీయాల్లో కొత్త మలుపు అంటున్నారు.

పార్టీలు ఇక పక్కకేనా….

నిజానికి వెలగపూడి, ఎంవీవీ ఒకే సామాజికవర్గానికి చెందిన వారు. ఇద్దరూ వలసపక్షులే. ఇక తాజా ఎన్నికల్లో ఎంవీవీ విజయానికి వెలగపూడి తూర్పు నుంచి తగినంత సాయం చేశారని టీడీపీ ఎంపీ అభ్యర్ధి భరత్ అనుమానించారు. పాతిక వేలకు పైగా వెలగపూడికి మెజారిటీ వస్తే భరత్ కి అందులో సగం కూడా రాలేదు. మరి ఆ ఓట్లు ఎటు పోయాయి అంటే వైసీపీకి వేయించారని అని అపుడే భరత్ వర్గీయులు డౌట్లు ముందుకు తెచ్చారు. ఇక వైసీపీ తూర్పు అభ్యర్ధిని అక్రమాని విజయనిర్మల కూడా స్థానిక నాయకులు తనని గెల‌వకుండా చేశారని అధినాయకత్వానికి ఫిర్యాదు చేశారు. ఇపుడు ఎంవీవీ వెలగపూడి తెర ముందు దోస్తీతో కొత్త అర్ధాలను వెతుక్కుంటున్నారంతా. ఇదిలా ఉండగా వైసీపీ అధినేత జగన్ ఓడిన సీట్లలో బలం పెంచుకుని గెలవాలని పార్టీ నేతలకు సూచిస్తూంటే నాయకులు మాత్రం పార్టీలను పక్కన పెట్టి దోస్తీలు కట్టడమేంటని వైసీపీ నేతలు గుస్సా అవుతున్నారు. అది కూడా సీఎం గా జగన్ గెలిచిన తరువాత ఆయన్ని అసభ్య పదజాలంతో దూషించిన వెలగపూడిపై పోలీస్ కేసు కూడా నమోదు అయిందని తెలిసి మరీ అధినేతను తిట్టిన వారితో చేయి కలుపుతారా అంటూ వైసెపీ నుంచి నిరసన వ్యక్తం అవుతోంది. ఈ స్నేహం ఎంతవరకూ పోతుందో చూడాలి.

Tags:    

Similar News