అన్ పాపులర్ అయ్యారా.. చేస్తున్నారా…?

వైఎస్ జగన్ పేరు మీదనే వైసీపీ గెలిచింది. మొత్తానికి మొత్తం అసెంబ్లీ సీట్లు వైసీపీ పరం అయ్యాయంటే అది జగన్ చరిష్మాయే కారణం. ఎవరు అవునన్నా కాదన్నా [more]

Update: 2019-08-06 02:00 GMT

వైఎస్ జగన్ పేరు మీదనే వైసీపీ గెలిచింది. మొత్తానికి మొత్తం అసెంబ్లీ సీట్లు వైసీపీ పరం అయ్యాయంటే అది జగన్ చరిష్మాయే కారణం. ఎవరు అవునన్నా కాదన్నా జగన్ ఫేస్ చూసే జనం ఓట్లేశారు. జగన్ ఇమేజ్ డ్యామేజ్ అయితే అది పార్టీకే యమ డేంజరే. ఆ సంగతి రాజకీయం ఆ మాత్రం తెలిసిన ఎవరికైనా అర్ధమవుతుంది. మరి పార్టీలో కీలకంగా ఉంటూ అతి ముఖ్యమైన శాఖలు చక్కబెడుతున్న మంత్రులకు తెలియదు అనుకోగలమా. ఉన్నదీ లేనిదీ పులిహోర కలిపేస్తూ జగన్ సర్కార్ ని ఎలాగైనా బదనాం చేయాలని ఓ వైపు టీడీపీ అనుకూల మీడియా మొదటి రోజు నుంచే విశ్వప్రయత్నం చేస్తోంది. జనాల్లో ముందు జగన్ ని అన్ పాపులర్ చేసి పారేస్తే ఆ తరువాత ఎన్ని స్కీములు పెట్టినా, మరెంతంగా చేరువ కావాలనుకున్నా ఈ తీవ్ర వ్యతిరేకతతో అసలు కుదిరే పని కాదన్న ఎత్తుగడతోనే అటు తెలుగుదేశం పార్టీ కూడా గట్టిగానే బురద జల్లుతోంది.

ధీటైన కౌంటర్లేవీ…

మరి ఈ విషయం తెలిసి కూడా కీలకమైన శాఖలు చూస్తున్న మంత్రులు ఎందుకు బేఖాత‌రుగా వ్యవహరిస్తున్నారో అర్ధం కాని పరిస్థితి . వీరిలో ముందుగా చెప్పుకుంటే సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ వస్తారు. అన్న క్యాంటీన్ల మూసివేత గురించి టీడీపీ గత వారం రోజులుగా ఒకటే ఊదరగొడుతోంది. పేద వాడి నోటి కాడ ముద్ద లాగేశారని రంకెలేస్తోంది. అక్కడికి ఏదో చంద్రబాబు ఇంట్లో నుంచి సొమ్ము తెచ్చి అన్న క్యాంటీన్లు నడుపుతున్నట్లుగా తెగ బిల్డప్ ఇస్తోంది. బాబు ఉంటే పేదలకు పట్టెడు అన్నం మెతుకులు దొరికేవని, ఇపుడు ఆ బొచ్చెను కూడా లాగేసే రాక్షస పాలన ఏపీలో సాగుతోందంటూ డైరెక్ట్ గా జగన్ ని టార్గెట్ చేస్తోంది. మరి ఈ విషయంలో సీనియర్ మంత్రిగా బొత్స ఎలా రియాక్ట్ కావాలి. అన్న క్యాంటీన్లు తొలగించడం లేదంటూ ఓ పేపర్ ప్రకటన ఇచ్చేసి మంత్రి గారు ఊరుకున్నారు. దాంతో మరింతగా ఇక్కడ సర్కార్ దొరికేసింది. ఇక టీడీపీ ఎమ్మెల్యేలు, తమ్ముళ్ళు జగన్ ని ఓ ఆట ఆటేడుసుకున్నారు. అసెంబ్లీలో దొరకపోయినా జనం వద్ద మాత్రం ప్రభుత్వం అడ్డంగా దొరికిపోయింది. మొసలి కన్నీరు కారుస్తూ టీడీపీ నడిపిన డ్రామాకు వైసీపె ఇమేజ్ మొత్తం డ్యామేజ్ అయింది. ఇక బొత్స అంతటితో ఆగకుండా మొబైల్ క్యాంటీన్లు పెడతామంటూ తాపీగా మరో స్టేట్ మెంట్ ఇచ్చారు. దీంతో ఇక అన్న క్యాంటీన్లు అసలు ఉండవంటూ సరికొత్త ప్రచారం మొదలెట్టేసింది టీడీపీ. ఈ విధంగా జగన్ సర్కార్ ని ఎండగట్టడంతో సూపర్ గా విజయవంతం అయింది.

ఇటు జీతాలు… అటు పోలవరం గోల …

ఇదిలా ఉంటే ఠంచనుగా ప్రతీ నెల ఒకటో తారీఖుకు సర్కార్ ఉద్యోగులకు, పెన్షనర్లకు జీతాలు ఖాతాలో పడతాయి. ఈసారి టెక్నికల్ ప్రాబ్లం వల్ల ఒక రోజు డిలే అయింది. దాంతో మరో అస్త్రం టీడీపీకి అందివచ్చింది. మా పాలనలో ఎపుడైనా ఇలా ఉందా అంటూ తమ్ముళ్ళు విమర్శలకు రెడీ అయిపోయారు. దాని మీద వివరణ ఇవ్వాల్సిన ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ ఒక రోజు ఆలస్యంగా మీడియా ముందుకు వచ్చారు. ఇంతలో జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇది మరో రకమైన డ్యామేజ్. ఇపుడు పోలవరం విషయంలోనూ వైసీపీ దొరికేసింది. నవయుగ కాంట్రాక్టుని వైసీపీ సర్కార్ రద్దు చేసింది. దాని మీద కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ పార్లమెంట్ లో అసలు అలా చేయకూడదంటూ ఘాటుగానే కామెంట్స్ చేశారు. దాన్ని అందిపుచ్చుకున్న టీడీపీ భావి నాయకుడు నారా లోకేష్ ఏకంగా జగన్ ని తుగ్లక్ అంటూ సంభొదిస్తే మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు చెడుగుడు ఆడుకుంటున్నాడు. ఇక్కడ కూడా జలవనరుల మంత్రి ఒక రోజు ఆలస్యంగా రియాక్ట్ అయ్యారు. పోలవరం టెండర్లు రద్దు చేయదానికి కారణం అవినీతి అంటూ ఇచ్చిన వివరణ కూడా అంత కిక్ ఇవ్వలేదు. ఈలోగా వెళ్లాల్సిన నెగిటివ్ ప్రచారం వెళ్ళిపోయింది. మరి బాధ్యత కలిగిన మంత్రులు తమ శాఖల విషయంలో వచ్చిన విమర్శలకు స్ట్రాంగ్ కౌంటర్లు ఇవ్వకపోవడం వల్లనే ఇలా జరిగింది. ఓ విధంగా వరసగా జరిగిన ఈ సంఘటనలు అన్నీ కూడా జగన్ ఇమేజ్ కి తూట్లు పొడిచేవే కావడం గమనార్హం.

Tags:    

Similar News