వైసీపీ నుంచి భారీ ఫిరాయింపులట‌….!!

గేలమంటూ ఉంటే ఏ చేప అయినా చిక్కుతుంది. పట్టుబట్టి అదే పనిగా వల వేస్తే ఏదో ఒకటి ద‌క్కుతుంది. ఇపుడు ఏపీలో బీజేపీ చేస్తున్నది ఇదే. జీరోలో [more]

Update: 2019-07-06 13:30 GMT

గేలమంటూ ఉంటే ఏ చేప అయినా చిక్కుతుంది. పట్టుబట్టి అదే పనిగా వల వేస్తే ఏదో ఒకటి ద‌క్కుతుంది. ఇపుడు ఏపీలో బీజేపీ చేస్తున్నది ఇదే. జీరోలో ఉంది ఆ పార్టీ గ్రాఫ్. అందువల్ల పోయేది ఏమీ లేదు, అంతా వచ్చేదే. ఎటూ టీడీపీకి కన్ను గీటుతున్న బీజేపీ పనిలో పనిగా వైసీపీకి కూడా డోర్లు ఓపెన్ అంటోంది. మరి బీజేపీ గూట్లోకి చేరడానికి ఎవరికి అవకాశం ఉంది అన్నదే ఇపుడు చర్చ. వైసీపీకి 22 మంది ఎంపీలు ఉన్నారు. వాళ్ళలో చాలా మంది రాజకీయంగా గండర గండలే. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గాలి ఉంది కాబట్టి ఆ పార్టీలో చేరి గెలిచారు కానీ విధేయతలు విషయం వస్తే పెద్ద ప్రశ్నార్ధకమే జవాబు అవుతుంది అంటున్నారు. ఇక జగన్ మడి కట్టుకుని కూర్చున్నారు. ఆయన తన ఎంపీలను ప్రతిపక్షంలో ఉంచి పోరాడమంటున్నారు.

హోదా పోరుకు ఇదే జవాబు….

పైగా ప్రత్యేక హోదా అంటూ ఒకటే సతాయిస్తున్నారు. మోడీ జగ మొండి హోదా ఇవ్వరు కదా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వైపే మూడో కన్ను వేస్తారు. ఇపుడు ఏపీలో వైసీపీ బలాన్ని తగ్గించేడయానికి బీజేపీ ప్రయత్నాలు చేస్తున్నట్లుగా కూడా చెబుతున్నారు. గోదావరి జిల్లాలకు చెందిన ఓ ఎంపీ గారు మోడీని కుటుంబ సమేతంగా కలవడం, ఏకాంతంగా కొంత సేపు మాట్లాడడం ఇపుడు వైసీపీలో, బీజేపీలో కూడా చర్చగా ఉంది.ఆయనలాంటి వారు చాలా మంది ఉన్నారని బీజేపీ అంటోంది. ఇక విశాఖకు చెందిన ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ ఏపీలో పెద్ద తలకాయలు ఎన్నో బీజేపీలో చేరేందుకు రెడీ అంటున్నాయని చెప్పుకొచ్చారు. అందులో వైసీపీ నేతలు కూడా ఉన్నారని కూడా షాకింగ్ న్యూస్ చెబుతున్నారు.

ఇదే దగ్గర దారి…..

నిజానికి ఏపీలో బలపడాలని బీజేపీ గట్టిగా అనుకుంటోంది. అందుబాటులో ఉన్న ఏ ఒక్క అవకాశాన్ని కూడా బీజేపీ జారవిడుచుకోదని అంటున్నారు. ఇక ఎంపీగా గెలిచి అయిదేళ్ళు ప్రతిపక్షంలో కూర్చోవడం అంటే ఇపుడున్న వారికి చాలా కష్టం. భారీ పారిశ్రామికవేత్తలు, వ్యాపారాలు, వ్యవహారాలు వున్న వారు చాలా మంది ఏపీ నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీలుగా ఉన్నారు. అందువల్ల గోడ దూకేయడం అంటే పెద్దగా బాధపడరు కూడా. పైగా దాన్ని సర్దిచెప్పుకోవడానికి, సమర్ధించుకోవడానికి కూడా బోలెడన్ని అవకాశాలు ఉన్నాయి. మరి మరి ఇవన్నీ చూసినపుడు కచ్చితంగా ఏదో జరుగుతోందనిపిస్తోంది. అంటే జగన్ తో హానీమూన్ ముగిసినట్లేనా. ఇక బస్తీ మే సవాల్ అంటూ బీజేపీ దూసుకొస్తుందా అంటే రాజకీయల్లో ఏమైనా జరగొచ్చు అన్నదే సమాధానం.

Tags:    

Similar News