సూపర్ ఫినిషింగ్ టచ్….!!!

శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్ఛాపురం నియోజకవర్గంలో పాదయాత్ర ఈ నెల 9వ తేదీతో ముగియనుంది. ఈ నెల 9వ తేదీ మధ్యాహ్నం ఒంటిగంటకు ఇచ్ఛాపురం భారీ బహిరంగ సభను [more]

Update: 2019-01-05 01:30 GMT

శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్ఛాపురం నియోజకవర్గంలో పాదయాత్ర ఈ నెల 9వ తేదీతో ముగియనుంది. ఈ నెల 9వ తేదీ మధ్యాహ్నం ఒంటిగంటకు ఇచ్ఛాపురం భారీ బహిరంగ సభను ఏర్పాటుచేస్తున్నారు. మొత్తం 3600 కిలోమీటర్లు ప్రయాణించి, పదమూడు జిల్లాల్లో నడక పూర్తి చేసిన జగన్ పార్టీ సూపర్ లెవెల్లో క్లోజింగ్ ఇవ్వాలని ఏర్పాట్లు చేస్తోంది. ఆరోజు రాష్ట్రం మొత్తం ఇచ్ఛాపురం వైపు చూసేలా ఏర్పాట్లు పూర్తి చేసుకుంటుంది. జగన్ 2016 నవంబరు 6వ తేదీన ఇడుపుల పాయనుంచి ప్రజాసంకల్ప పాదయాత్ర ప్రారంభించారు. ఇప్పటికి దాదాపు పథ్నాలుగు నెలలు జగన్ రోడ్డు మీదనే ఉన్నారు.

ముగింపు సభను…

గతంలో ఎవరూ చేయని సాహసాన్ని జగన్ చేయడంతో వైసీపీ ఇచ్ఛాపురంలో ముగింపు సభకు భారీగా జనసమీకరణనుచేయనుంది. పదమూడు జిల్లాల్లోని 175 నియోజకవర్గాల నుంచి పార్టీ శ్రేణులు రప్పిస్తున్నారు. నియోజకవర్గ బాధ్యులతో పాటు, పార్లమెంటు నియోజకవర్గ సమన్వయ కర్తలు, ఎంపీలు, ఎమ్మెల్యేలకు కూడా ప్రత్యేక బాధ్యతలను జగన్ స్వయంగా అప్పగించారు. ఆరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండగలా ఉండాలన్నది వైసీపీ అగ్రనేతల అభిప్రాయం. రాష్ట్రంలోని అన్ని గ్రామాల దారులూ ఇచ్ఛాపురం వైపు కలవాలని ప్రయత్నాలు చేస్తున్నారు.

లక్షలాది మంది ఇచ్ఛాపురానికి….

దాదాపు లక్ష మంది వరకూ జనసమీకరణ చేయాలన్న లక్ష్యంతో వైసీపీ నేతలు ఉన్నారు. ఇంకా ఎక్కువ మందే వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా తూర్పు గోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాల నుంచే ఇప్పటికే ప్రయివేటు వాహనాలన్నింటినీ నేతలు ముందుగానే బుక్ చేసుకున్నారు. ప్రతి నియోజకవర్గం నుంచి ముప్పయి నుంచి యాభై బస్సులు, లారీల వంటి వాహనాలకు తగ్గకుండా ఉండేలా నేతలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వీటితో పాటు కార్లు, జీపులు వంటివి అదనంగా ఉండనున్నాయి. అందుకోసమే పార్టీ శ్రేణుల్లో హీట్ పుట్టించేందుకు ఈ నెల 7వతేదీ వరకూ ప్రతి నియోజకవర్గంలో ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నిన్ను నమ్మేది లేదు బాబూ అంటూ కార్యక్రమాలుచేపట్టారు.

విరుచుకు పడతారా?

జగన్ తన ముగింపు సభలో తన సుదీర్ఘ పాదయాత్రలో తెలుసుకున్న ప్రధాన సమస్యలతో పాటు ఎన్ని వినతులు తనకు అందింది వివరించనున్నారు. ఇప్పటికే పార్టీ కేంద్ర కార్యాలయం దీనిపై కసరత్తులు పూర్తి చేసింది. జగన్ స్పీచ్ కూడా ప్రత్యేకంగా రూపొందించినట్లు తెలుస్తుంది. వచ్చే ఎన్నికల్లో పొత్తుల వ్యవహారంతో పాటుగా బీజేపీ, టీడీపీ, కాంగ్రెస్, జనసేన పార్టీలను టార్గెట్ గా చేసుకుని జగన్ ప్రసంగం కొనసాగనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకూ బీజేపీ పై పెద్దగా విమర్శలు చేయని జగన్ ఈ వేదికపై స్వరం పెంచుతారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తం మీద ఇచ్ఛాపురంలో జరిగే ముగింపు సభ సూపర్ హిట్ చేసి పాదయాత్రకు ఫినిషింగ్ టచ్ ఇవ్వాలని వైసీపీ శ్రేణులు శ్రమిస్తున్నాయి.

Tags:    

Similar News