అదే తప్పు చేస్తే….?

విచక్షణాధికారాలు ఉన్న ప్రతి వ్యవస్థకు విశేష బాధ్యతలు కూడా ఉంటాయి. దేనినీ గుడ్డిగా అనుసరించకుండా సొంతయోచనతో అందరికీ న్యాయం చేసే విధంగా నిర్ణయాలు తీసుకుంటారనే అంచనాతోనే విచక్షణాధికారాలకు [more]

Update: 2019-07-17 15:30 GMT

విచక్షణాధికారాలు ఉన్న ప్రతి వ్యవస్థకు విశేష బాధ్యతలు కూడా ఉంటాయి. దేనినీ గుడ్డిగా అనుసరించకుండా సొంతయోచనతో అందరికీ న్యాయం చేసే విధంగా నిర్ణయాలు తీసుకుంటారనే అంచనాతోనే విచక్షణాధికారాలకు శ్రీకారం చుట్టారు మన రాజ్యాంగ నిర్మాతలు. బలవంతుడు బలహీనుడిని దోపిడి చేసే అనాది ఆచారం నుంచి దుర్బలులను సైతం రక్షించి వారి హక్కులకు పూచీకత్తు వహించడం రాజ్యధర్మం. చట్ట సభల నిర్వహణలోనూ ఇదే సూత్రం వర్తిస్తుంది. అందుకే స్పీకరు హోదాకు రాజ్యాంగబద్ధమైన స్వతంత్ర ప్రతిపత్తి ఉంది. పాతకాలంలో స్పీకర్లు రాజకీయాలకు అతీతంగా వ్యవహరించారనే కీర్తి ప్రతిష్ఠలు ఉండేవి. నీలం సంజీవరెడ్డి వంటివారైతే తాను ఎన్నికైన పార్టీకే రాజీనామా చేసేశారు. ఇప్పుడు అంతటి ఉదాత్తప్రమాణాలను ఆశించలేం. మారుతున్న కాలానికి అనుగుణంగా స్పీకర్లు సైతం తమ మంచి చెడ్డ చూసుకుంటున్నారు. భవిష్యత్తును లెక్కలు వేసుకుంటున్నారు. తమ మాతృపార్టీ పట్ల కృతజ్ణత చూపుతున్నారు. అందుకే అధికారపార్టీవైపు జంప్ చేసే విపక్ష సభ్యులపై వేటు పడటం లేదు. అనర్హత అన్నది అక్కరకు రాని నిబంధనగా మారిపోయింది. ఇటువంటి స్థితిలో ఆంధ్రప్రదేశ్ శాసనసభ నిర్వహణను బేరీజు వేయాల్సి ఉంటుంది. తమ పాలనలో కొత్త ప్రమాణాలు నెలకొల్పుతామని, ప్రతిపక్ష సభ్యులను తమపార్టీలో చేర్చుకునే ప్రసక్తే లేదని సభానాయకుడు జగన్ హామీ ఇవ్వడం ఆశలు రేకెత్తించింది. అదే రకమైన ప్రమాణాలు సభా నిర్వహణలోనూ వస్తే నవ్యాంధ్ర సభ దేశంలోనే ఆదర్శంగా నిలిచే అవకాశం దక్కుతుంది.

అదే తీరు..అదే పోరు…

2014 నుంచి 19 వరకూ నడిచిన నవ్యాంధ్ర తొలిసభ ఏమంత సత్సంప్రదాయాలు నెలకొల్పలేదనే విషయం అందరికీ తెలిసిందే. ప్రతిపక్షం గొంతు నొక్కేస్తున్నారనే వాదనతోనే వైసీపీ ఏకంగా సభనే బాయ్ కాట్ చేసేసింది. ప్రతిపక్షం లేకుండానే ఏకపక్షంగా సభ నడవడం తో ప్రస్తుతి ప్రసంగాలకు, ప్రశంసలకే సెషన్లలో సమయం చాలావరకూ సరిపోయింది. ఫలితంగా అధికారపక్షమే తీవ్రంగా నష్టపోయింది. ఆత్మ విమర్శ లోపించింది. అడిగేవారు లేకుండాపోయారు. దాంతో తాను చేస్తున్న ప్రతిపనీ అద్భుతమేనని అధికారపార్టీ అనుకున్నది. ప్రశ్నించే గొంతు లేకపోవడంతో ప్రతి నిర్ణయమూ బ్రహ్మాండమని భ్రమల్లో మునిగిపోయింది. లోపాలు, అవకతవకలను ఎండగట్టేవారు, సకాలంలో సరిదిద్దేవారు కనిపించక పాలకపక్షంలో విచ్చలవిడితనం ప్రవేశించింది. ప్రజాభిప్రాయంతో సంబంధాలు తెగిపోయాయి. దీనివల్లనే ఎన్నికల్లో టీడీపీ ఘోరపరాజయం చవిచూడాల్సి వచ్చింది. ప్రస్తుతం అధికారపక్షం వైసీపీ గతంలో అధికారపక్షమైన టీడీపీ కంటే మెజార్టీ రీత్యా చాలా బలంగా ఉంది. అప్పట్లో వంద పైచిలుకు స్తానాలకే టీడీపీ పరిమితమైంది. కానీ ప్రస్తుతం వైసీపీ 150 పైచిలుకు స్థానాలు కలిగి ఉంది. సభ్యుల సంఖ్య తక్కువ కావడంతో సభలో ప్రతిపక్షానికి దక్కే ప్రాధాన్యం అంతంతమాత్రమే. సమయం చాలా తక్కువ దొరుకుతుంది. అయినప్పటికీ గత శాసనసభను తలపించే విధంగా ప్రతిపక్ష, అధికారపక్షాల పోరు కొనసాగుతోంది. ఒకరిపై ఒకరు పైచేయి సాదించాలనే తపనతో కనీస ప్రమాణాలు ప్రశ్నార్థకమవుతున్నాయి. వ్యంగ్యం పేరుతో వక్రోక్తులు, శరీరాక్రుతిని కించపరిచే వ్యాఖ్యలు సర్వసాధారణంగా మారుతున్నాయి. అబద్దం అన్న మాటనే అన్ పార్లమెంటరీగా నిషేధించే చట్ట సభల ప్రమాణం బాడీ షేమింగ్ ను సైతం సహించాల్సి రావడం దురద్రుష్టకరమనే చెప్పాలి.

లెక్కకు లెక్క…

గతంలో అధికార టీడీపీ ప్రధానప్రతిపక్షమైన వైసీపీకి తగినంత ప్రాముఖ్యం ఇవ్వలేదు. స్సీకర్ సైతం తెలుగుదేశం పార్టీకి చెందిన వ్యక్తే. ఆయనను ప్రభుత్వం అనేక రకాలుగా ప్రభావితం చేస్తోందనే ఆరోపణలు ఎదురయ్యాయి. వైసీపీ నుంచి ఎన్నికైన 23 మంది శాసనసభ్యులు పార్టీ ఫిరాయించినప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోలేకపోయారు. సభాపతి మౌనం వహించారు. ప్రజాస్వామ్యం అపహాస్యం పాలైంది. ఇవన్నీ కలగలిసి టీడీపీని దెబ్బతీశాయని చెప్పాలి. అప్పట్లో ప్రతిపక్ష నాయకుడైన జగన్ మాట్టాడటానికి లేచినప్పుడల్లా అధికారపార్టీ ఆటంకపరిచేది. స్పీకర్ సైతం అధికారపక్షానికి కల్పించినన్ని అవకాశాలు విపక్షానికి ఇవ్వలేదనే ఆరోపణలు ఎదుర్కొంటుండేవారు. గంపగుత్తగా వైసీపీ శాసనసభను బహిష్కరించడానికి అటు టీడీపీ, ఇటు స్పీకర్ చర్యలు దోహదం చేశాయి. వైసీపీ వంటి బలమైన ప్రతిపక్షానికే అప్పట్లో చేదు అనుభవాలు ఎదురయ్యాయి. మరిప్పుడు టీడీపీ బలహీనమైన ప్రతిపక్షం . తాము ఎదుర్కొన్న కష్టనష్టాలకు బదులు తీర్చుకోవాలనే ప్రతీకారం వైసీపీ సభ్యుల్లో కనిపిస్తోంది. టీడీపీ చేసిన తప్పునే వైసీపీ కూడా చేస్తే అర్థం ఉండదు. అపకారికి ఉపకారము నెపమెన్నక సేయువాడే నేర్పరి అన్న నీతి సూత్రం పూర్తిగా మరిచిపోయినట్లే. తెలుగుదేశం పార్టీ నిరంకుశంగా వ్యవహరించిన కారణంగానే ప్రజాక్షేత్రంలో దెబ్బతినాల్సి వచ్చింది. దానిని పరిగణనలోకి తీసుకుంటే అధికారపార్టీకి చేదు నిజం తేటతెల్లమవుతుంది. ఆత్మావలోకనం చేసుకోకుండా గతంలో తాము చేసిన ప్రతిపనీ కరెక్టే అన్నట్లుగా సమర్థించుకోజూస్తున్న ప్రతిపక్షానికీ ఒక గుణపాఠం అవుతుంది.

ప్రజలు చూస్తున్నారు…

మాటమాటకూ ప్రజలు చూస్తున్నారంటూ టీడీపీ సానుభూతి కొట్టేయాలనుకుంటోంది. దానిని సభానాయకుడు జగన్ సరిగానే అంచనా వేస్తున్నారు. సరైన దృక్పథంతో నిర్ణయాలు తీసుకుంటూ ప్రతిపక్షానికి సరైన సమయమిస్తే ప్రజలు చూసినా ఏమీ కాదు. ప్రజలు గమనిస్తేనే ఇంకా మంచిది. ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుంది. అధికారపార్టీ న్యాయబద్ధంగా వ్యవహరిస్తుందనే సంకేతం వెళుతుంది. ఇది సోషల్ మీడియా యుగం. కమ్యూనికేషన్ ప్రపంచం. అరచేతిని అడ్డుపెట్టి సమాచారాన్ని, భావప్రకటన స్వేచ్చను అడ్డుకోలేం. అందువల్ల అధికార,ప్రతిపక్షాలు ఏమి చేసినా క్షణాల్లో మంచిచెడ్డల లెక్కలు తేల్చేస్తున్నారు ప్రజలు. అందువల్ల సమున్నత స్థానాల్లో ఉన్నవారు నిష్పాక్షికంగా ఉండటమే కాదు. ఉన్నట్లుగా కనిపించడం కూడా చాలా ముఖ్యం. ప్రజలు గమనించడమనేది అధికార,విపక్షాలకు ఒక అడ్వాంటేజ్. ప్రజాక్షేమానికి, రాష్ట్రప్రయోజనాలకు ఎవరెంత మేరకు కష్టపడుతున్నారో తెలుసుకునే అవకాశం కలుగుతుంది. అధికార, ప్రతిపక్షాల మాటల్లో చేతల్లో రాజకీయం పాళ్లెంత? రాష్ట్రానికి ఒరిగేదెంత? తేల్చుకోగల సామర్థ్యం నేటి ఓటరుకు ఉంది. అందుకే ఒకే ఒక ఎన్నికతో ఓడలు బళ్లు, బళ్లు ఓడలు అయిపోతూ ఉంటాయి. ప్రతిపక్ష సభ్యులను చేర్చుకునేది లేదని ఎంత కరాఖండిగా సభా నాయకుడు ప్రకటించారో, అంతే సూటిగా అధికార విపక్షాలను రెండుకళ్లుగా చూస్తానంటూ మనసావాచాకర్మణా ప్రతిన పూనితే స్పీకర్ పీఠమూ శోభిస్తుంది.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News