ఎవరు హీరో తేలిపోనుందా?

ఉత్తరాంధ్రలో మొత్తం అసెంబ్లీ సీట్లను వైసీపీ స్వీప్ చేసింది. అలా ఇలా కాదు. ఏకంగా 34 అసెంబ్లీ సీట్లకు గాను 28 సీట్లను, అయిదు ఎంపీలకు నాలుగింటినీ [more]

Update: 2019-08-26 02:00 GMT

ఉత్తరాంధ్రలో మొత్తం అసెంబ్లీ సీట్లను వైసీపీ స్వీప్ చేసింది. అలా ఇలా కాదు. ఏకంగా 34 అసెంబ్లీ సీట్లకు గాను 28 సీట్లను, అయిదు ఎంపీలకు నాలుగింటినీ సొంతం చేసుకుని టీడీపీ కంచుకోట మీద వైసీపీ జెండా ఎగురవేసింది. అదే మ్యాజిక్ ని లోకల్ బాడీ ఎన్నికల్లో కొనసాగించాలని వైసీపీ చూస్తోంది. ఇందుకోసం వ్యూహాలను రచిస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో టీడీపీ మళ్ళీ లేవకూడదు, అలా దెబ్బ పడాలంటే మంత్రులు సారధ్యం వహించి ఎక్కడికక్కడ భారీ విజయాలను నమోదు చేయాలి అని గట్టిగా కోరుతోంది. అదే విధంగా ఎమ్మెల్యేలు సైతం తమ పరిధిలోని అన్నింటా గెలవాలని కూడా ఆదేశాలు జారీ చేస్తోంది. పార్టీ నుంచి పెద్ద ఎత్తున గెలిచిన ఎంపీలు కూడా పార్టీ తాజా విజయాన్ని మరింత పటిష్టం చేయాలంటే ఇప్పటినుంచే జనాల్లో ఉండాలని, శ్రమించాలని వైసీపీ హై కమాండ్ ఆదేశాలు జారీ చేసింది.

మంత్రులు రెడీనా….?

ఉత్తరాంధ్రా జిల్లా వరకూ తీసుకుంటే నలుగురు మంత్రులు ఉన్నారు. వీరిలో బొత్స సత్యనారాయణ తప్ప అంతా కొత్తవారే. అయితే అందరికీ కీలకమైన బాధ్యతలు జగన్ అప్పగించారు కాబట్టి వారి సత్తా నిరూపించుకోవాల్సివుంటుంది శ్రీకాకుళం విషయానికి వస్తే ధర్మాన కృష్ణదాస్ జిల్లాను అంతా ఒక్క తాటిమీద నడిపించి వైసీపీకి లోకల్ బాడీ ఎన్నికల్లో అద్భుత విజయాన్ని తీసుకురావాలి. ఓడిపోయినా కూడా సీనియర్ నేత కళా వెంకటరావు టీడీపీలో గట్టి నేతగా ఉన్నారు. ఇక మాజీ మంత్రి అచ్చెన్నాయుడు, అబ్బాయి కింజరపు రామ్మోహన్నాయుడు శ్రీకాకుళం ఎంపీగా ఉన్నారు. మరో వైపు గౌతు కుటుంబం కూడా బాగానే హవా చలాయించే అవకాశం ఉంది. మాజీ మంత్రి గుండా అప్పలసూర్యనారయణ కుటుంబం సైతం సవాల్ చేస్తోంది. వీరందరినీ అడ్డుకుని గెలవాలంటే ధర్మాన కృష్ణదాస్ శ్రమించాల్సి ఉంది.

ఏజెన్సీ బాధ్యత ఆమెదే…

ఇక డిప్యూటీ సీఎం గా గిరిజన శాఖా మంత్రిగా ఉన్న పుష్ప శ్రీవాణి సైతం ఇపుడు భారీ విజయాలను పార్టీకి సాధించిపెట్టాలి. ముఖ్యంగా ఏజెన్సీ నియోజకవర్గాల బాధ్యతలు వైసీపీ అగ్రనాయకులు ఆమెకు అప్పగించారు. అక్కడ ఒక్క వార్డు కూడా పోకుండా అన్ని సీట్లు వైసీపీకి దాఖలు పడేలా చూడాలి. మరి తన సమర్ధతకు ఇది అగ్నిపరీక్షగానే చెప్పాలి. ఆమె ఎలా జనంలోకి దూసుకుపోతుందో చూడాలి. విజయనగరంలో మిగిలిన ప్రాంతాలను బొత్స సత్యనారాయణ చూసుకోవాలి. బొత్సకు అనేక యుధ్ధాల్లో ఆరితేరిన అనుభవం ఉంది. పైగా తన మనుషులే ఎమ్మెల్యేలుగా ఉన్నారు. వారిని కలుపుకుని బొత్స వైసీపీ వైపుగా జనం మొగ్గు చూపేలా చూడాల్సివుంది. ఇక విశాఖ జిల్లా నుంచి చూసుకుంటే అవంతి శ్రీనివాసరావు మొత్తం జిల్లాకు ఏకైన మంత్రిగా ఉన్నారు. ఆయనకు విశాఖ అర్బన్ జిల్లా ఓ విధంగా సవాల్ గా ఉంది. ఇక్కడ ఉన్న నాలుగు ఎమ్మెల్యే సీట్లు టీడీపీ గెలుచుకుంది. అందువల్ల ఆయన జీవీఎంసీ ని గెలిచి జగన్ ముందు హీరోగా నిలబడితేనే ఆయన పనితీరుకు రాణింపు దక్కుతుంది. మరి మంత్రులందరిలో ఎవరు హీరో అన్నది మరో మూడు నెలల్లో తేలిపోతుంది.

Tags:    

Similar News