ఆ సీటు మళ్లీ వైసీపీదేనా..?

2014 ఎన్నికల్లో గుంటూరు నగరంలోని రెండు స్థానాల్లో తూర్పు నియోజకవర్గాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. ఇక్కడి నుంచి వైసీపీ తరపున మొదటిసారి పోటీ చేసిన [more]

Update: 2019-03-15 13:30 GMT

2014 ఎన్నికల్లో గుంటూరు నగరంలోని రెండు స్థానాల్లో తూర్పు నియోజకవర్గాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. ఇక్కడి నుంచి వైసీపీ తరపున మొదటిసారి పోటీ చేసిన మహ్మద్ ముస్తాఫా 3 వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మద్దాలి గిరిధరరావుపై ఆయన గెలుపొందారు. ముస్లింలు గెలుపోటములను ప్రభావితం చేయనున్న ఈ స్థానాన్ని ఈసారి కచ్చితంగా గెలుచుకోవాలని తెలుగుదేశం పార్టీ పట్టుదలగా ఉండగా తిరిగి తూర్పు స్థానాన్ని తమ ఖాతాలో వేసుకోవాలని వైసీపీ భావిస్తోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి మరోసారి సిట్టింగ్ ఎమ్మెల్యే మహ్మద్ ముస్తాఫా పోటీలో ఉండనున్నారు. ఆయన ప్రలోభాలకు లొంగి పార్టీ ఫిరాయించకుండా జగన్ వెంటే ఉండటంతో ఆయనకు టిక్కెట్ దక్కడం ఖాయమైంది.

ముస్లింలు ఎటు వైపో..?

తూర్పు స్థానంలో ముస్లిం ప్రజల మెజారిటీ ఎక్కువ. ఇక్కడి నుంచి రెండుసార్లు ముస్లిం వర్గానికి చెందిన వారే ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. అంతకుముందు గుంటూరు-1గా ఉన్న ఈ స్థానంలో 1983 నుంచి వరుసగా ముస్లిం నేతలే ఎమ్మెల్యేలుగా గెలుస్తూ వస్తున్నారు. కాగా, ఓడిపోయిన అభ్యర్థులు సైతం ముస్లింలే కావడం గమనార్హం. అంటే ముస్లింల మధ్య ఇక్కడ పోటీ ఉండనుంది. కానీ, గత ఎన్నికల్లో మాత్రం టీడీపీ గిరిధరరావుకు టిక్కెట్ కేటాయించగా ఆయన వైసీపీకి గట్టి పోటీ ఇచ్చారు. ముస్లింల ఓట్లను ఆకర్షించడానికి ఈసారి సినీ నటుడు అలీని ఇక్కడి నుంచి పోటీ చేయించాలని టీడీపీ భావించించింది. అలీ కూడా ఇందుకు మొగ్గు చూపారు. ఆయన ఏకంగా ఇక్కడ ఓటు హక్కును కూడా నమోదు చేయించుకున్నారు. అయితే, స్థానిక టీడీపీ నేతలు మాత్రం అలీకి టిక్కెట్ ఇవ్వవద్దని స్థానికేతర అంశాన్ని లేవనెత్తారు. దీంతో టిక్కెట్ పై ఆయనకు చంద్రబాబు నుంచి భరోసా లభించలేదు. తర్వాత ఆయన వైసీపీలో చేరిపోయిన విషయం తెలిసిందే.

టీడీపీ అభ్యర్థి ఎవరో..?

మహ్మద్ ముస్తఫా ఐదేళ్లుగా ప్రజల్లో ఉంటున్నారనే పేరుంది. దీనికి తోడు ముస్లింల నుంచి ఆయనకు మద్దతు బాగానే ఉంది. సహజంగానే ముస్లింలు ఎక్కువగా వైసీపీ వైపే ఉంటున్నారనే అంచనాలు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ తరపున అభ్యర్థి ఎవరనే దానిని బట్టి ఇక్కడ గెలుపోటములు ఆధారపడి ఉంటాయి. మళ్లీ గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన గిరిధరరావుకు టిక్కెట్ ఇస్తే సానుభూతి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఆయన ముస్లిం ఓట్లను కూడా ఆకర్షించగలిగితేనే విజయానికి అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ టీడీపీ తరపున ముస్లిం అభ్యర్థినే బరిలో నిలిపితే మాత్రం ముస్తఫాకు కొంత ఇబ్బంది తప్పదు. మొత్తానికి ఇప్పటికైతే వైసీపీ అభ్యర్థి ముస్తాఫాకు విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయనే అంచనాలు ఉన్నాయి. అయితే ముస్తాఫాపై పార్టీ క్యాడర్ లోనే కొంత వ్యతిరేకత ఉంది. ఆయన గెలవాలంటే క్యాడర్ ను మచ్చిక చేసుకోవాలని అంటున్నారు.

Tags:    

Similar News