ప్రసన్నకు అంతా ప్రశాంతమేనటగా…!!!

రాజకీయ దిగ్గజాలకు నెల్లూరు జిల్లా కేరాఫ్ లాంటిది. ఇక్కడ వివిధ సమయాల్లో చక్రం తిప్పిన కుటుంబాల్లో నల్లపురెడ్డి కుటుంబం ఒకటి. నల్లపురెడ్డి శ్రీనివాసురెడ్డి నెల్లూరు జిల్లాలో ఒకప్పుడు [more]

Update: 2019-05-01 05:00 GMT

రాజకీయ దిగ్గజాలకు నెల్లూరు జిల్లా కేరాఫ్ లాంటిది. ఇక్కడ వివిధ సమయాల్లో చక్రం తిప్పిన కుటుంబాల్లో నల్లపురెడ్డి కుటుంబం ఒకటి. నల్లపురెడ్డి శ్రీనివాసురెడ్డి నెల్లూరు జిల్లాలో ఒకప్పుడు కీలక నేతగా ఉండేవారు. ఐదుసార్లు ఆయన ఎమ్మెల్యేగా గెలిచి ముగ్గురు ముఖ్యమంత్రుల క్యాబినెట్లలో మంత్రిగా పనిచేశారు. ఆయన వారసుడిగా వచ్చిన కుమారుడు నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి సైతం తండ్రికి తగ్గ వారసుడిగా నిలిచారు. ఏకంగా ఆయన కోవూరు నియోజకవర్గంలో ఐదుసార్లు విజయం సాధించారు. అయితే, గత ఎన్నికల్లో మాత్రం ఆయన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పోలంరెడ్డి శ్రీనివాస్ రెడ్డి చేతిలో 7,937 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. దీంతో ఆయన ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని పనిచేశారు. కచ్చితంగా ఈసారి గెలిచి తీరాలని ఆయన పట్టుదలగా ఉన్నారు.

రెండుసార్లు బ్రేక్ వేసిన పోలంరెడ్డి

నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం ముందునుంచీ నల్లపురెడ్డి కుటుంబానికి కంచుకోట వంటిది. 1983 నుంచి ఇక్కడ 10 ఎన్నికలు జరగగా ఎనిమిదిసార్లు నల్లపురెడ్డి కుటుంబమే గెలిచింది. దీనిని బట్టి ఈ నియోజకవర్గంలో ఆ కుటుంబానికి ఉన్న పట్టు అర్థం చేసుకోవచ్చు. అయితే, వీరి హవాకు మాత్రం పోలంరెడ్డి రెండుసార్లు బ్రేక్ వేశారు. 2004లొ మొదటిసారి కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ప్రసన్నను ఓడించిన పోలంరెడ్డి గత ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి మరోసారి ప్రసన్నను ఓడించారు. 2012 ఉప ఎన్నికల్లో 22 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో వైసీపీ తరపున గెలిచిన ప్రసన్న 2014లో మాత్రం ఓడిపోవడం గమనార్హం. ఈ ఎన్నికల్లో కచ్చితంగా గెలవాలని ప్రసన్న కుమార్ రెడ్డి ప్రయత్నించారు. ప్రజల్లో ఉండే నేతగా పేరున్న ఆయనకు మంచి గుర్తింపు ఉంది. దీనికి తోడు జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హవా వీచిందనే అంచనాలు ఉన్నాయి. మొత్తంగా ప్రసన్నకుమార్ రెడ్డి ఈసారి గెలుపుపై బాగానే ఆశలు పెట్టుకున్నారు.

రేసులో ముందున్న ప్రసన్న

ఇదే సమయంలో సిట్టింగ్ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాస్ రెడ్డి కూడా గెలుపుపై భరోసాతో ఉన్నారు. ఈ ఐదేళ్ల కాలంలో నియోజకవర్గంలో తాను అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశానని, మరోసారి తాను విజయం సాధిస్తానని ఆయన ధీమాగా ఉన్నారు. డబ్బు కూడా ఆయన బాగానే ఖర్చు చేశారనే అంచనాలు ఉన్నాయి. అయితే, గెలుపోటములను ప్రభావితం చేయగలిగిన ఓ ప్రధాన సామాజకవర్గం వైసీపీకి మద్దతుగా నిలవడం పోలంరెడ్డికి మైనస్ గా మారింది. మొత్తంగా గత ఎన్నికల్లో కోవూరు స్థానాన్ని కోల్పోయినా ఈసారి మాత్రం ఇక్కడ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి విజయావకాశాలు మెరుగ్గా ఉన్నాయనే అంచనాలు ఉన్నాయి. అయితే, పోలంరెడ్డి వైసీపీకి గట్టి పోటీ ఇచ్చారు. ఎవరు గెలిచినా స్వల్ప మెజారిటీ మాత్రమే వచ్చే అవకాశం ఉంది.

Tags:    

Similar News