వైసీపీ ఆ సీటును మిస్ చేసుకుంటుందా..?

చిత్తూరు జిల్లాలోని హాట్ సీట్లలో ఒకటి పీలేరు. ఈ నియోజకవర్గంలో గెలుపును రెండు పార్టీలూ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. ఇక్కడి నుంచి తెలుగుదేశం పార్టీ తరపున మాజీ ముఖ్యమంత్రి [more]

Update: 2019-04-26 14:30 GMT

చిత్తూరు జిల్లాలోని హాట్ సీట్లలో ఒకటి పీలేరు. ఈ నియోజకవర్గంలో గెలుపును రెండు పార్టీలూ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. ఇక్కడి నుంచి తెలుగుదేశం పార్టీ తరపున మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి పోటీ చేస్తున్నారు. దీంతో ఇక్కడ విజయం నల్లారి కుటుంబానికి కీలకంగా మారింది. ఇక, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సైతం సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకాలని పట్టుదలగా ఉంది. ఎన్నికలు ముగిసినా పీలేరులో ప్రజలనాడి ఎవరికీ అంతు చిక్కడం లేదు. రెండు పార్టీల నుంచి పోటీ చేసిన అభ్యర్థులు పాత ప్రత్యర్థులు కావడం, అభ్యర్థుల రెండు కుటుంబాల మధ్య సుదీర్ఘ రాజకీయ వైరం ఉండటంతో ఇద్దరు విజయం కోసం తమ శాయశక్తులా కృషి చేశారు.

రెండూ బలమైన కుటుంబాలే

2009లో పీలేరు నుంచి కిరణ్ కుమార్ రెడ్డి విజయం సాధించడం.. ఆయనకు అదృష్టం కలిసి వచ్చి ముఖ్యమంత్రి కావడం తెలిసిందే. గత ఎన్నికల్లో కాంగ్రెస్ ను విభేదించిన ఆయన జై సమైక్యాంధ్ర పేరుతో ప్రత్యేకంగా ఓ పార్టీని పెట్టుకున్నారు. పీలేరులో కిరణ్ పోటీకి దూరంగా ఉండి ఆయన సోదరుడు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డిని పోటీ చేయించారు. రాష్ట్రం మొత్తంలో ఈ పార్టీ నుంచి పోటీ చేసి డిపాజిట్ తెచ్చుకున్న ఏకైక అభ్యర్థి కిషోర్. ఆయన గత ఎన్నికల్లో 56 వేలకు పైగా ఓట్లు తెచ్చుకొని రెండో స్థానంలో నిలిచారు. కిషోర్ పై వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి చింతల రామచంద్రారెడ్డి 15 వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఇక, తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసిన డా.ఇక్బాల్ అహ్మద్ 33 వేల ఓట్లు తెచ్చుకొని నాలుగో స్థానంలో నిలిచారు. అంతకుముందు ఐదు ఎన్నికల్లోనూ వాయల్పాడు, పీలేరు నియోజకవర్గాల్లో నల్లారి, చింతల కుటుంబాల మధ్యే పోటీ జరిగింది. దీంతో మూడు దశాబ్దాలుగా ఈ రెండు కుటుంబాల మధ్య రాజకీయ వైరం ఉంది.

హోరాహోరీ పోరు…

కిషోర్ కుమార్ రెడ్డికి నియోజకవర్గంలో గట్టి పట్టుంది. తన సోదరుడు కిరణ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అభివృద్ధి జరిగింది. కిరణ్ సీఎంగా రాష్ట్ర వ్యవహారాల్లో బిజీగా ఉన్న సమయంలో కిషోర్ కుమార్ రెడ్డి నియోజకవర్గ పనులు చూసుకునేవారు. దీంతో కిషోర్ బలమైన నేతగా ఎదిగారు. ఇప్పుడు సైతం కిరణ్ కాంగ్రెస్ లో ఉన్నందున బాహాటంగా ప్రచారం చేయకున్నా ఆయన మద్దతు మాత్రం తమ్ముడికే ఉంది. ఇక, నల్లారి కుటుంబానికి గత ఎన్నికల ఫలితాలను చూసుకుంటే సుమారు 50 వేల పర్సనల్ ఓటు బ్యాంకు ఉంది. దీనికి టీడీపీ ఓట్లు కూడా తోడైతే కచ్చితంగా విజయం సాధిస్తామని కిషోర్ కుమార్ రెడ్డి ధీమాగా ఉన్నారు. ఇదే సమయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా గెలుపుపై పూర్తి ధీమాగా ఉన్నారు. గత ఎన్నికల కంటే ఈ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి చింతల మెరుగైన ఓట్లు తెచ్చుకుంటారని ఆ పార్టీ నేతలు ధీమాగా చెబుతున్నారు. గత ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి ఇక్బాల్ ఇప్పుడు వైసీపీలో ఉండటం కూడా వైసీపీకి కొంత కలిసొచ్చింది. నియోజకవర్గంలో బలమైన ఓటు బ్యాంకుగా ఉన్న మైనారిటీలు వైసీపీ వైపే మొగ్గు చూపారన్న అంచనాలు ఉన్నాయి. మొత్తంగా ఈసారి ఇక్కడ ఎవరు గెలిచినా స్వల్ప మెజారిటీతోనే గెలవనున్నారు.

Tags:    

Similar News