వారే వైసీపీకి బూస్ట్ ఇస్తున్నారా..?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కులాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. సామాజకవర్గాలను దృష్టిలో పెట్టుకొని పార్టీలు రాజకీయాలు చేస్తుంటాయి. తెలుగుదేశం పార్టీకి కమ్మ సామాజకవర్గం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రెడ్డి [more]

Update: 2019-02-15 03:30 GMT

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కులాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. సామాజకవర్గాలను దృష్టిలో పెట్టుకొని పార్టీలు రాజకీయాలు చేస్తుంటాయి. తెలుగుదేశం పార్టీకి కమ్మ సామాజకవర్గం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రెడ్డి సామాజకవర్గం ఎక్కువగా అండగా ఉంటుందనేది కాదనలేని సత్యం. 100 శాతం కాకున్నా అధిక శాతం ఆ సామాజకవర్గాలకు చెందిన ఓటర్లు ఆయా పార్టీలకు అండగా ఉంటున్నారు. ఇక, కులాలు, మతాలకు అతీతంగా రాజకీయాలు చేస్తామని చెపుతున్న జనసేన పార్టీ వెనుక కాపు సామాజకవర్గం ఉంటుందనే అంచనాలు ఉన్నాయి. ఇప్పటివరకు ఆ పార్టీలో ఉన్న నేతలు, క్యాడర్ ఎక్కువగా ఆ సామాజకవర్గం వారే. ఇక, జనసేన కొంత బలంగా ఉంది కూడా కాపులు అధికంగా ఉండే ఉభయ గోదావరి జిల్లాల్లోనే. అయితే, రాష్ట్ర రాజకీయాలను, ఎన్నికల్లో గెలుపోటములను ప్రభావితం చేయగలిగే సంఖ్యలో ఉన్న కాపులు గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ మద్దతు ఉండటం, చంద్రబాబు హామీలతో టీడీపీ వైపు మెగ్గు చూపారు. ఈసారి పవన్ కళ్యాణ్ విడిగా పోటీ చేస్తుండటంతో పవన్ వైపే కాపులు ఉంటారనే అంచనాలు ఉన్నాయి. అయితే, తాజా పరిణామాలు చూస్తుంటే కాపులు ఏకపక్షంగా జనసేన వైపు నిలిచే అవకాశాలు కనిపించడం లేదు.

జనసేనను కాదని వైసీపీలోకి…

ముఖ్యంగా, కాపు సామాజకవర్గం నేతలు జనసేన వైపు ఎక్కువగా మొగ్గు చూపడం లేదు. తాజాగా ఆ సామాజకవర్గానికి చెందిన ఆమంచి కృష్ణమోహన్ టీడీపీ నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన పవన్ కళ్యాణ్ తో చర్చలు కూడా జరిపడంతో జనసేనలో చేరుతారని కూడా ప్రచారం జరిగింది. అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్ రావు కూడా అదే పనిచేశారు. ఆయన గతంలో ప్రజారాజ్యంలో పనిచేశారు. మెగా కుటుంబానికి సన్నిహితంగా ఉండేవారు. అంతకుముందు రాయలసీమకు చెందిన సీనియర్ నేత సి.రామచంద్రయ్య కూడా జనసేనలో చేరుతారని ప్రచారం జరిగినా వైసీపీలో చేరిపోయారు. ఆయనా ప్రజారాజ్యంలో కీలక నేతగా ఉన్నవారే. ఇక, కాపు సామాజకవర్గానికే చెందిన తోట త్రిమూర్తులుతో పాటు మరికొందరు టీడీపీ నేతలు కూడా వైసీపీలో చేరుతారనే ప్రచారం జరుగుతోంది. వీరంతా జనసేనలోకి వెళ్లకుండా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడం ఆసక్తికరంగా మారింది. వాస్తవానికి, ఈ ఐదేళ్ల కాలంలో కాపులకు, కాపులు చేసిన ఉద్యమానికి వైసీపీ అండగా ఉంది. ముద్రగడ పద్మనాభం ఆధ్వర్యంలో జరిగిన ఉద్యమానికి వైసీపీ, జగన్ మీడియా పూర్తిగా సహకరించింది. ముద్రగడ కూడా జగన్ పట్ల చాలారోజులు సానుకూలంగా వ్యవహరించారు.

జగన్ వ్యాఖ్యలతో వ్యతిరేకమయ్యారని…

అయితే, ఉభయ గోదావరి జిల్లాల్లో పాదయాత్రలో భాగంగా.. కాపు రిజర్వేషన్ల అంశం తన చేతిలో లేదని జగన్ కుండ బద్దలుకొట్టినట్లే చెప్పేశారు. కాకపోతే కాపులను ఆదుకునేందుకు అన్ని చర్యలూ తీసుకుంటామన్నారు. దీంతో కాపులకు జగన్ అన్యాయం చేశారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. తర్వాత పవన్ కళ్యాణ్ వివాహాల గురించి జగన్ మాట్లాడిన సమయంలోనూ అది పూర్తిగా కాపులపైనే దాడి అన్నట్లు కొంత చిత్రీకరించారు. ఈ పరిణామాలతో నిజంగానే కాపులు వైసీపీకి దూరమయ్యారా అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. వైసీపీలో ఉన్న కాపు సామాజకవర్గ నేతలు కూడా అసంతృప్తిగా ఉన్నారనే ప్రచారం జరిగింది. అయితే, కొన్ని రోజులకే సీన్ రివర్స్ అయ్యింది. ఆ సామాజకవర్గానికి చెందిన ప్రజాప్రతినిధులు వైసీపీలో వరుసకట్టి చేరుతున్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులు అంచనా వేసుకొనే వారు చేరుతున్నారు. కాబట్టి, కాపుల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పట్ల ఆదరణ ఉన్నట్లు కనిపిస్తోంది. దీనిని బట్టి చూస్తే కాపు సామాజకవర్గ ఓటర్లు ఏకపక్షంగా జనసేన వైపు మొగ్గు చూపే అవకాశాలు మాత్రం తక్కువే అంటున్నారు విశ్లేషకులు.

Tags:    

Similar News