జగన్.. కోరికను మన్నిస్తారా..?

తాను మరణించాక ప్రజల ఇళ్లలో తన తండ్రి ఫోటో పక్కన తన ఫోటో ఉండేలా పాలించడమే తన కల అని చెబుతున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత [more]

Update: 2019-04-10 02:30 GMT

తాను మరణించాక ప్రజల ఇళ్లలో తన తండ్రి ఫోటో పక్కన తన ఫోటో ఉండేలా పాలించడమే తన కల అని చెబుతున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి. ఒక్క అవకాశం ఇస్తే రాజన్న రాజ్యం తెస్తానంటున్నారు. ఇందుకోసం తొమ్మిదేళ్లుగా ప్రజల్లో ఉన్నారు. ఎవరూ చేయనన్ని పోరాటాలు చేశారు. ప్రజల బాగోగులు తెలుసుకున్నారు. తాను అధికారంలోకి వస్తే ‘నవరత్నాల’తో ప్రజల జీవితాల్లో మార్పు తెస్తానంటున్నారు. అయితే, ఆ ఒక్క అవకాశం జగన్ కు ఇస్తారో లేదో రేపు తేల్చనున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. జగన్ కష్టాన్ని ప్రజలు గుర్తిస్తారా..? ఒక్క అవకాశం ఇవ్వాలంటున్న జగన్ కోరికను మన్నిస్తారా..? అనేది రేపే ప్రజలు నిర్ణయించనున్నారు.

సీనియర్ నేతను ధైర్యంగా ఢీకొంటూ…

వ్యాపారవేత్తగా ప్రస్థానాన్ని మొదలుపెట్టి 2009లో కడప ఎంపీగా గెలిచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన జగన్ కు కొన్ని నెలలకే కష్టాలు ప్రారంభమయ్యాయి. తండ్రి మరణంతో ఆయన పెద్దదిక్కును కోల్పోయారు. తండ్రి మరణాన్ని తట్టుకోలేక మరణించిన వారి కుటుంబాలను కలుస్తానని నల్లకాలువలో జగన్ చెప్పిన మాట ఆయనను కష్టాల్లోకి నెట్టేసింది. కాంగ్రెస్ పార్టీతో విభేదించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్థాపించాల్సి వచ్చింది. కేసులు ఎదుర్కొని, జైలు జీవితం అనుభవించాల్సి వచ్చింది. అయినా ఎక్కడా వెనకడుగు వేయకుండా పార్టీని ముందుకు తీసుకెళ్లారు జగన్. మొండిధైర్యంతో పార్టీని బలోపేతం చేసుకుంటూ వెళ్లారు. ఇవాళ 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న బలమైన నేతను 48 ఏళ్ల యువకుడైన జగన్ ఢీకొంటున్నారు. తన తండ్రి వైఎస్ మాదిరిగానే పోరాడుతున్నారు. ఓ దశలో అంత సీనియర్ నేతపై విజయం సాధించే స్థాయికి చేరుకున్నారు. జగన్ అంటే కొందరికి ఇష్టం ఉండవచ్చు. కొందరికి కోపం ఉండవచ్చు. కానీ జగన్ విషయంలో కొన్ని అంగీకరించాల్సిన వాస్తవాలు ఉన్నాయి.

అంశం ఏదైనా మాట ఒక్కటే…

జగన్ సమైక్యాంధ్రకు చివరి నిమిషం వరకు ఆయన కట్టుబడి ఉన్నారు. మిగతా పార్టీలన్నీ రెండు ప్రాంతాల్లో రాజకీయలబ్ధి వెతుక్కునేందుకు ప్రయత్నిస్తూ రెండు కళ్లు, కొబ్బరి చిప్పలు అనే సిద్ధాంతాలు చెబుతున్న సమయంలో జగన్ మాత్రం సమైక్యాంధ్ర కోసం పోరాడారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ప్రత్యేక హోదా సంజీవని కాదు, హోదా అంటే జైలుకే అని మిగతా నాయకులు చెబుతున్న సమయంలో జగన్ మాత్రం ఒకే మాట మీద ఉన్నారు. ప్రత్యేక హోదా వస్తేనే రాష్ట్రం బాగుపడుతుందంటున్నారు. ప్రత్యేక హోదా వల్ల కలిగే ప్రయోజనాల గురించి ప్రతీ జిల్లాలో యువతతో సమావేశమై అవగాహన కల్పించారు. జగన్ ఒక్కరు ప్రత్యేక హోదా గురించి మాట్లాడకపోయి ఉంటే ఇవాళ ఏపీలో ప్రత్యేక హోదా అనే అంశమే ఉండేది కాదు. జగన్ వల్లే ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకున్న నేత సైతం మాట మార్చి ప్రత్యేక హోదా కావాలంటున్నారు. ఇప్పుడు కూడా జగన్.. ప్రత్యేక హోదా ఇచ్చిన వారికే కేంద్రంలో తన మద్దతు అంటున్నారు.

మళ్లీ అవే ఆరోపణలు…

గత ఎన్నికల్లోనే ఆంధ్రప్రదేశ్ ప్రజల మనస్సులు గెలుచుకున్నారు జగన్. అయితే, ఆయన బలం అధికారం చేపట్టేందుకు సరిపోలేదు. మూడు ప్రత్యర్థి పార్టీలు ఒక్కటై జగన్ పై పైచేయి సాధించాయి. అయినా, జగన్ ధైర్యం చెడలేదు. తన పార్టీ గుర్తుపై తన ఫోటో పెట్టుకొని గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలు పార్టీ మారుతున్నా… పార్టీ మారుతూ జగన్ పైనే నాలుగు రాళ్లేసి పోతున్నా జగన్ మాత్రం ఎక్కడా వెనక్కు తగ్గలేదు. ప్రజల్లోకి వెళ్లారు. 3,648 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్ర ద్వారా పార్టీని బలోపేతం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రజల సమస్యలు దగ్గరనుండి చూశారు. ప్రజలకు మేలు చేసేలా నవరత్నాల పేరుతో పథకాలను రూపొందించారు. అధికారంలోకి వస్తే ఈ పథకాల ద్వారా ప్రజల జీవితాల్లో మార్పు తెస్తానంటున్నారు. అనుభవం లేదనే ఆరోపణలకు తొమ్మిదేళ్లుగా నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజల కష్టాలు తెలిసిన నేతగా మారి బదులు చెప్పారు. జగన్ కు పొగరు, ఫ్యాక్షన్ స్వాభావం అనే ఆరోపణలకు ఆయన పాదయాత్రలో ప్రజలతో మమేకమైన విధానమే సమాధానం ఇచ్చింది. అయినా, జగన్ పై ఆరోపణలు మాత్రం ప్రత్యర్థులు మానుకోవడం లేదు. గత ఎన్నికల్లో చేసిన అవినీతి, అరాచకత్వం, కుమ్మక్కు రాజకీయాలు అనే ఆరోపణలనే జగన్ పై ఈ ఎన్నికల్లోనూ చేస్తున్నారు. మరి, ఒక్క అవకాశం ఇస్తే రాజశేఖర్ రెడ్డిలా పాలిస్తాననంటున్న జగన్ కోరికను ఓటర్లు మన్నిస్తారో లేదా ప్రత్యర్థుల ఆరోపణలే నమ్మి ఈసారి కూడా జగన్ ను అధికారానికి దూరంగా ఉంచుతారో రేపు తమ ఓట్లతో తేల్చేయనున్నారు.

Tags:    

Similar News