తేల్చుకోలేక పోతున్నట్లుందే?

కొన్ని రాజకీయ పరీక్షలు అంతర్మథనానికి దారి తీస్తాయి. ఒకవైపు బంపర్ ఆఫర్. మరోవైపు ఓటు బ్యాంకు పాలిటిక్స్. ఎటూ తేల్చుకోలేని విషమ పరిస్థితులు కొంత ఇబ్బందికరమే. వైఎస్సార్ [more]

Update: 2020-02-18 15:30 GMT

కొన్ని రాజకీయ పరీక్షలు అంతర్మథనానికి దారి తీస్తాయి. ఒకవైపు బంపర్ ఆఫర్. మరోవైపు ఓటు బ్యాంకు పాలిటిక్స్. ఎటూ తేల్చుకోలేని విషమ పరిస్థితులు కొంత ఇబ్బందికరమే. వైఎస్సార్ కాంగ్రెసు పార్టీకి ఇప్పుడున్నంత సానుకూల వాతావరణం గతంలో ఎన్నడూ లేదు. ఆ పార్టీకి గతంలో ఎప్పుడూ ఎదురీతే. అధినేత కేసులు ఒక సమస్య గా వేధించాయి. దాంతోపాటు అధికారపార్టీగా ఉన్న టీడీపీ ఎప్పటికప్పుడు ఎన్నికైన ఎమ్మెల్యేలను ఎగరేసుకునిపోతూ పార్టీ అస్తిత్వాన్ని దెబ్బతీయాలని చూసింది. దాంతో నిరంతర పోరాటం ఆ పార్టీకి తప్పని సమస్యగా పరిణమించింది. అప్రతిహత విజయం సాధించడంతో ఆ కష్టాలన్నీ తీరిపోయాయి. కేసుల వంటివి ఇప్పటికిప్పుడు సమస్యలు సృష్టించే పరిస్థితి లేదు. రాష్ట్రంలో తిరుగులేదు. కేంద్రంలో అవకాశాలు తలుపు తడుతున్నాయి. తేల్చుకోవడంలోనే ఇప్పుడు తడబాటు. ముఖ్యంగా కేంద్రంలోని ఎన్డీఏకు భవిష్యత్ రాజకీయాల్లో వైసీపీ వంటి బలమైన పార్టీ అవసరం చాలా ఉంది. అదే విధంగా వైసీసీ కి ఒక పార్టీగా, ప్రభుత్వంగా రాజకీయ, పరిపాలన అవసరాలు చాలా కేంద్రంతో ముడిపడి ఉన్నాయి. అలాగని వెంటనే బీజేపీతో చేతులు కలిపితే వచ్చే లాభనష్టాలేమిటన్న ప్రశ్న వైసీపీని వెన్నాడుతోంది.

స్నేహ హస్తం…

మోడీ, అమిత్ షా లతో జగన్ భేటీ అనంతర పరిణామాలు చాలా వేగంగా చోటు చేసుకుంటాయని అందరూ ఆశించారు. 2019లో రెండోసారి మోడీ అధికారంలో కి వచ్చిన తర్వాత ఏ ముఖ్యమంత్రికి ఇవ్వనంతటి విలువైన సమయాన్ని జగన్ కు కేటాయించారు. రెండు రోజుల్లో అమిత్ షాతో భేటీకి కూడా మార్గం సుగమం చేశారు. అధికారికమైన అజెండా కొత్తదేమీ కాదు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, వచ్చే అవకాశమే లేని ప్రత్యేక హోదా, తాజాగా వైసీపీ సర్కారు తనంత తాను తెచ్చిపెట్టుకున్న మూడు రాజధానులు, మండలి రద్దు వివాదం. వీటన్నిటిలో ముఖ్యంగా రాజకీయంగా ముడిపడిన మండలి, రాజధానుల అంశంపై కేంద్రం స్పందన తటస్థంగా ఉన్నట్లుగా బీజేపీ నాయకులు చెబుతున్నారు. అయితే ఎన్డీఏ లో చేరడం ద్వారా కేంద్రంలో కీలకపాత్ర పోషించే అవకాశాన్ని తీసుకోవాలని అగ్రనాయకులు సూచించినట్లుగా ప్రచారం సాగుతోంది. దీనిని వైసీపీ నాయకులు కూడా తోసిపుచ్చడం లేదు. ప్రతిపాదన వస్తే పరిశీలిస్తామంటూ మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు కలకలం పుట్టించాయి. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏమైనా చేస్తామంటూ దానికి మంత్రి బొత్స ముక్తాయింపు కూడా ఇచ్చారు. ఇంకా ఒక నిర్ణయానికి రాకుండానే మంత్రి చేసిన ప్రకటన తొందరపాటుతో కూడుకున్నదే. పొలిటికల్ ఫీలర్ కిందే చూడాల్సి ఉంటుంది. అగ్రనాయకత్వంలో అవగాహన కుదిరిందో , లేదో స్పష్టత లేకుండానే ఈ ప్రకటన వచ్చింది. అటు నుంచి ఆహ్వానం ఉన్నప్పటికీ వైసీపీకి కొన్ని అవరోధాలున్నాయి.

పరస్పర ప్రయోజనాలు…

సాధారణంగా రాజకీయాల్లో పరస్పర ప్రయోజనాలే లక్ష్యంగా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. అందులోనూ ఆయా పార్టీల రాజకీయ అవకాశాలు, అవసరాలు, అనివార్యతలే పొత్తులు, కలయికలను నిర్ణయిస్తుంటాయి. రాజకీయ గణాంకాలను సరిచేసుకున్న తర్వాతనే ఎంతెంత లాభమో పక్కాగా తేల్చుకుని పొత్తు పెట్టుకుంటారు. రాష్ట్రంలో వైసీపీ సర్కారుకు ఆర్థిక, రాజకీయ అవసరాలు ఉన్నాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉంది. పునర్విభజన చట్టం పేరు చెప్పి కేంద్రం నుంచి నిధులు తెచ్చుకోవాల్సిన స్థితి నెలకొంది. ఇతర రూపాల్లో కేంద్రం కూడా నిధులిచ్చే స్థితి లేదు. మిగిలిన రాష్ట్రాలు ప్రశ్నిస్తాయి. అందువల్ల పునర్విభజన చట్టం, గతంలోనే మంజూరు చేసిన ప్రత్యేక ప్యాకేజీల రూపంలో 25 వేల కోట్ల రూపాయల వరకూ వివిధమార్గాల్లో కేంద్రం అందచేసేందుకు అవకాశం ఉంది. వీటన్నిటినీ కేంద్ర, రాష్ట్ర సాధారణ సంబంధాల రూపంలో తెచ్చుకోవడం దాదాపు అసాధ్యం. గత తెలుగుదేశం ప్రభుత్వం, అప్పట్లో వైసీపీ సైతం కేంద్రానికి, రాష్ట్రానికి మధ్య దూరం పెరగడంలో తమవంతు పాత్ర పోషించాయి. ఇప్పుడిప్పుడే వాస్తవిక పరిస్థితులు అర్థమవుతున్నాయి. రాజకీయ పోరాటం వల్ల సాధించేది శూన్యం.

రాజకీయ అవసరాలు…

మండలి రద్దు, మూడు రాజధానులపై కేంద్ర సహకారం అనివార్యం. న్యాయ, పాలన రాజధానుల పేరిట వైసీపీ సర్కారు పెద్ద రాజకీయ కుంపటిని తెచ్చి పెట్టుకుంది. ముందుకు వెళ్లక తప్పని స్థితి. సెక్రటేరియట్ ను కేంద్రంతో సంబంధం లేకుండా తనంత తాను తరలించుకు వెళ్లినప్పటికీ హైకోర్టును కర్నూలులో పెట్టకపోతే రాయలసీమ లో సెంటిమెంటు రగులుతుంది. దానికి ముందుగా బలయ్యేది అధికారపక్షమే. పరిపాలన రాజధాని తరలింపు వల్ల వైసీపీకి రాజకీయంగా తూర్పుగోదావరి, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో మాత్రం ప్రయోజనం సమకూరుతుంది. కర్నూలులో హైకోర్టు పెట్టగలిగితే నాలుగు రాయలసీమ జిల్లాలు సంతోషిస్తాయి. ప్రకాశం, నెల్లూరు జిల్లాలు తటస్థ పాత్రకు పరిమితమవుతాయి. ఎటొచ్చీ కృష్ణా, గుంటూరు, పశ్చిమగోదావరి జిల్లాల నుంచి వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే ప్రభుత్వం తాను ఆశించినట్లుగా మూడు రాజధానుల వ్యవహారాన్ని సక్రమంగా చేయగలిగితే వ్యతిరేకత ప్రభావం రెండు మూడు జిల్లాలకే పరిమితమవుతుంది. దీనికి కేంద్రం సంపూర్ణంగా సహకరించాలి. అందుకోసమైనా బీజేపీతో చెలిమి తప్పకపోవచ్చని ఒక అంచనా.

ఒకరికొకరు…

కేంద్రంతో వైసీపీ కలిస్తే చంద్రబాబుపై పట్టు బిగించేందుకు ఆస్కారం ఏర్పడుతుంది. సీబీఐ,ఈడీ, ఆదాయ పన్ను శాఖలతో గత సర్కారు అవతవకలు వెలికి తీయవచ్చు. ఏమాత్రం లోపాలు బయటపడినా తెలుగుదేశాన్ని శాశ్వతంగా దెబ్బతీసేందుకు వీలుంటుంది. ఎప్పటికప్పుడు రాజకీయ వ్యూహాలు మారుస్తూ తనదైన శైలిని అనుసరించే చంద్రబాబు నాయుడు గత ఎన్నికలలో అతిపెద్ద పొరపాటు చేశారు. కేంద్రంలో బీజేపీ తిరిగి అధికారంలోకి రాదనే తప్పుడు అంచనాతో కొంచెం దూకుడు ప్రదర్శించారు. మోడీ, అమిత్ షా లను వ్యక్తిగతంగా చంద్రబాబు టార్గెట్ చేశారు. అందుకే సయోధ్యకు టీడీపీ ఎన్నిరకాలుగా ప్రయత్నించినా కేంద్ర పెద్దలు ససేమిరా అంటున్నారు. ఇంకా రాష్ట్రంలో టీడీపీ పుంజుకోలేదన్న వారి అంచనాలు కూడా ఇందుకు కారణం. అందువల్ల వైసీపీ కి బీజేపీతో చేతులు కలిపేందుకు ఇదే సరైన సమయం. అయితే వైసీపీకి గట్టి పట్టున్న ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ఓటు బ్యాంకు చీలిపోతుందేమోనన్న భయం ఆ పార్టీలో గూడుకట్టుకుంది. అందుకే ఆచితూచి నిర్ణయం తీసుకోవాల్సి వస్తోంది. మరోవైపు బీజేపీ నుంచి ఒత్తిడి తీవ్రంగానే ఉన్నట్లు సమాచారం. జనసేనతో కలిసినప్పటికీ తక్షణం పెద్ద రాజకీయ శక్తిగా రాష్ట్రంలో రూపుదాల్చే అవకాశాలు కనిపించడం లేదు. దాంతో బీజేపీని రాజకీయ అనివార్యతలు వెంటాడుతున్నాయి. దక్షిణాదిన పట్టు పెంచుకోవడం తప్పనిసరిగా మారింది. కేంద్రంపై కేసీఆర్ కఠిన వైఖరి తీసుకున్నారు. తెలంగాణలో తాడోపేడో తేల్చుకోవడానికి పోరాడక తప్పని స్థితి నెలకొంది. తమిళనాడులో నిరాశవహ పరిస్థితులు ఏర్పడ్డాయి. తాను నమ్ముకున్న ఏఐఏడీఎంకే పెద్దగా గెలుపు సాధించిపెట్టగల పక్షం కాదు. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీ, మహారాష్ట్ర ల్లో ఎదురు దెబ్బలతో రాజ్యసభలో సీట్లు తగ్గిపోనున్నాయి. మరోవైపు వైసీపీ రానున్న నాలుగేళ్లలో పది మంది రాజ్యసభ సభ్యుల స్థాయికి పెరుగుతుంది. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకునే కేంద్రం స్నేహ హస్తం అందిస్తోంది. దానిని స్వీకరించాలా? వద్దా ? అన్నది వైసీపీ నిర్ణయంపైనే ఆధారపడి ఉంది.

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News