వణుకెందుకు బాస్?

ఏపీలో ఇపుడు బలమైన పార్టీ ఏదీ అని అడిగితే ఠక్కున వచ్చే సమాధానం వైసీపీ అని, చరిత్రలో కనీ వినీ ఎరగని విధంగా 151 ఎమ్మెల్యే, 22 [more]

Update: 2020-01-23 05:00 GMT

ఏపీలో ఇపుడు బలమైన పార్టీ ఏదీ అని అడిగితే ఠక్కున వచ్చే సమాధానం వైసీపీ అని, చరిత్రలో కనీ వినీ ఎరగని విధంగా 151 ఎమ్మెల్యే, 22 ఎంపీ సీట్లు ఆ పార్టీ దక్కించుకుంది. పైగా 50 శాతం పైగా ఓట్ల షేర్ ని కూడా సాధించింది. అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు మాత్రమే అయింది. ఇంకా చేతిలో నాలుగేళ్ళకు పైగా పవర్ ఉంది. అటువంటి వైసీపీ వణుకుతోందా? వణికితే దేనికి చూసి. అంటే బీజేపీ, జనసేన పొత్తులను చూసి వైసీపీకి నిలువెల్లా వణుకుపుడుతోందని జనసేన నాయకుడు నాదెండ్ల మనోహర్ అంటున్నారు. మరి నిజంగా ఇది సరైన విశ్లేషణో, విమర్శో తెలియదు కానీ ఇది కూడా హాట్ టాపిక్ గానే ఉంది.

వరసపెట్టి మరీ….

వైసీపీలో సరైన విధానం లేదనడానికి జనసేన, బీజేపీ పొత్తులపైన చేస్తున్న రాధ్ధాంతమే పెద్ద ఉదాహరణ అంటున్నారు. ఏపీలో ఆ రెండు పార్టీల పొజిషన్ ఏంటో జనం సరిగ్గా తొమ్మిది నెలల క్రితమే చూపించారు. బీజేపీకి నోటా కంటే తక్కువ ఓట్లు వస్తే జనసేనకు మరో మూడు పార్టీలతో కలుపుకుని ఆరు శాతం ఓట్లు వచ్చాయి. ఓ విధంగా బలహీనమైన రెండు పార్టీల మధ్య పొత్తు ఇది. మరో వైపు నలభై శాతం ఓట్లు, 23 సీట్లు ఉన్న ఫార్టీ యియర్స్ ఇండస్ట్రీ టీడీపీని ఒంటి చేత్తో ఎదుర్కొంటున్న వైసీపీకి ఈ పొత్తు అసలు కంటికి కూడా ఆనక్కరలేదు. కానీ వైసీపీ నేతలు మాత్రం వరసగా ప్రకటలూ, ప్రెస్ మీట్లు అంటూ అతి చేస్తున్నారు. పవన్ కల్యాణ్ ను చీల్చిచెండాడుతున్నారు.

ఎందుకిలా…?

నిజానికి పవన్ అయినా, బీజేపీ అయినా ఇపుడే అధికారంలోకి రారు. అసలు వారు ముందు వరసలోకి రావాలంటేనే ప్రతిపక్షంలోని పెద్ద పార్టీ టీడీపీని వంచాలి. ఆ పార్టీని ఖాళీ చేస్తేనే వారికి రెండవ స్థానం దక్కుతుంది. ఆ తరువాత కదా అధికార పార్టీ వైపు చూసే అవకాశం ఉంటుంది. ఇదంతా పెద్ద కసరత్తు, ఎన్నో ఎత్తులు, జిత్తులూ వేయాల్సిఉంటుంది. అయినా సరే వైసీపీ ఈ పొత్తుని తప్పుపడుతోంది. మంత్రుల నుంచి సామంతుల వరకూ పవన్ని టార్గెట్ చేస్తున్నారు. ఎందుకిలా అంటే వైసీపీ భయాలు వారికి ఉన్నాయని విశ్లేషణలు వెలువడుతున్నాయి. కేంద్రంలోని మోడీ సర్కార్ సాయం లేకుండా ఏపీ సర్కార్ ఇపుడు పెద్దగా చేయాల్సిన పనులు లేవీ చేయలేదు. ఆర్ధికంగా ఇబ్బందులో ఉన్న రాష్ట్రం. పైగా విభజన హామీలు నెరవేర్చాలి. నిధులు భారీగా ఇవ్వాలి. ఉదారంగా కేంద్రం ఉండాలి. మరి అవన్నీ జరగాలంటే రెండు ప్రభుత్వాల మధ్య సామరస్యం ఉండాలి. అది చెడగొట్టేందుకు ఈ పొత్తు కుదిరిందా అన్న బెంగతోనే ఇపుడు వైసీపీ ఎగిరెగిరిపడుతోంది.

మునుపట్లా సాగేనా…?

నిజానికి జగన్ ముఖ్యమంత్రి అయిన కొత్తల్లో తరచూ ఢిల్లీ వెళ్ళేవారు, ప్రధాని సైతం ఆయన్ని ఆప్యాయంగా హత్తుకునేవారు. నిధులు ఎంత ఇచ్చారన్న మాటను పక్కన పెడితే అపాయింట్లుమెంట్లు సులువుగా దొరికేవి. ఆ సీన్ గత కొన్ని నెలలుగా కనిపించడంలేదు. మరో వైపు మూడు రాజధానుల ప్రకటనతో జగన్ దూకుడుగా ఉన్నారు. రాజధానుల వరకూ ఆయన నిర్ణయం ఓకేగా ఉన్నా, హైకోర్టు కర్నూలుకి రావాలన్న, ఈ మొత్తం తతంగం సాఫీగా సాగాలన్నా కేంద్రం సానుకూలంగా ఉండాలి. మరి ఇవన్నీ ఆలోచించుకునే వైసీపీ ఈ పొత్తు గురించి కంగారు పడుతోందని అంటున్నారు. పైగా ఈ పొత్తు వెనక చంద్రబాబు ఉన్నారని కూడా గట్టిగా నమ్ముతోంది. చంద్రబాబు సైతం ఈ పొత్తుని స్వాగతించడంతో ఇపుడు వైసీపీకి ఈ బలహీనమైన పొత్తే భారంగా మారుతోందని విశ్లేషిస్తున్నారు. మరి చూడాలి ఏం జరుగుతుందో.

Tags:    

Similar News