దమ్ము లేకపోవడం వల్లనే

విశాఖకు ఓ శాపం ఉంది. అదేంటి అంటే ఈ ప్రాంతం గురించి మాట్లాడే దమ్మున్న నేతలు లేకపోవడం. అందరూ ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చిన నేతలు [more]

Update: 2019-08-26 03:30 GMT

విశాఖకు ఓ శాపం ఉంది. అదేంటి అంటే ఈ ప్రాంతం గురించి మాట్లాడే దమ్మున్న నేతలు లేకపోవడం. అందరూ ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చిన నేతలు కావడంతో విశాఖ సమస్యలు అలా పేరుకుపోతునే ఉన్నాయి. జోన్ కావాలన్న డిమాండ్ అర్ధ శతాబ్దానికి నెరవేరిందని ఆనందించినంత సేపు పట్టలేదు, 160 ఏళ్ళ చరిత్ర ఉన్న వాల్తేర్ డివిజన్ ని లేకుండా చేసి ఇచ్చారన్ని తెలిసి మళ్ళీ మోసపోయామన్న బాధ విశాఖవాసులది. ఈలోగా ఎన్నికలు వచ్చాయి. విశాఖ ఎంపీగా వైసీపీ నుంచి ఎంవీసీ సత్యనారాయణ గెలిచారు. ఆయన వాల్తేర్ డివిజన్ తీసుకువస్తానని హామీ ఇచ్చారు. అయితే ఇప్పటికి ఏ మాత్రం పురోగతి లేదు, ఇక ఇచ్చిన జోన్ విషయంలో కూడా అడుగు ముందు పడలేదు. మొత్తం మీద వాల్తేర్ డివిజన్ పాయే, జోన్ అతీ గతీ తెలియదాయే అన్నట్లుగా విశాఖ రైల్వే పరిస్థితి ఉంది.

సానుకూలమేనా…?

ఇదిలా ఉండగా ఈ మధ్యన ఢిల్లీలో కేంద్ర రైల్వే మంత్రి పీయూష్ గోయల్ ని వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి. విజయసాయిరెడ్డి ఆద్వర్యంలో మొత్తం వైసీపీ ఎంపీల బృందం కల్సింది. ఈ సందర్భంగా పెట్టిన డిమాండ్ ఏంటి అంటే విశాఖ రైల్వే జోన్ని తొందరగా ప్రారంభించాలని, అదే సమయంలో వాల్తేర్ డివిజన్ని యధాతధంగా కొనసాగించాలని. శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురం, పలాస స్టేషన్లను వాల్తేర్ డివిజన్లో ఉంచాలని కూడా కోరారు. వీటి అన్నిటిమీద రైల్వే మంత్రి సానుకూలంగా స్పందించారని వార్తలు వచ్చాయి. అయితే ఆచరణలో అది సాధ్యమేనా అన్న సందేహాలు వస్తున్నాయి. ఇప్పటికే వాల్తేర్ డివిజన్ ను ఉనికి లేకుండా చేశారు. అందులో ఓ ముక్కతో రాయగడ డివిజన్ ని ఏర్పాటు చేసి ఒడిషాలోని తూర్పు కోస్తా రైల్వే జోన్లో కలిపేశారు. మరో ముక్కను విజయవాడ డివిజన్లో విలీనం చేశారు. లాభాలు వచ్చే కిరండల్ లైన్ ను రాయగడ డివిజన్ కి ఇచ్చేశారు. ఇలా అన్ని కీలకమైన నిర్ణయాలు తీసేసుకున్నాక ఇపుడు తిరగతోడడం సాధ్యమా అన్న మాట వినిపిస్తోంది.

రాజకీయానిదే పైచేయి….

ఒడిషాలో ఉన్నది ఫ్రెండ్లీ సర్కార్. అక్కడ బిజూ జనతాదళ్ రాజ్యం చేస్తోంది. నవీన్ పట్నాయక్ మోడీకి సన్నిహితంగా ఉంటూ పార్లమెంట్ లో కీలకమైన సమయంలో మద్దతు ఇస్తున్నారు. పైగా ఒడిషాలో పాగా వేయాలని బీజేపీకి పెద్ద ఆశలే ఉన్నాయి. అందుకే అక్కడ ప్రజల కోసమే ఈ డివిజన్ ని ముక్కలు చేసి వాల్తేర్ అన్న మాట కూడా చేసింది. ఇపుడున్న పరిస్థితుల్లో ఏపీ నుంచి గట్టిగా గొంతెత్తి అడిగే వారు లేరు, అడిగినా కూడా ఇచ్చేందుకు బీజేపీ సిధ్ధంగా లేదు. ఏపీలో కంటే ఒడిషాలో బీజేపీకి రాజకీయ బలం ఉంది. పైగా జోన్ అడిగారు ఇచ్చామని అంటోంది. అంతే తప్ప మళ్ళీ తిరగతోడి ఒడిషాకు చెడ్డ అవుతారా పొలిటికల్ మైలేజిని పోగట్టుకుంటారా అన్న డౌట్లు ఉన్నాయి. దీంతో పీయూష్ సానుకూలత అంతా ముఖ‌ స్తుతి కోసమేనా అన్న మాట కూడా వినిపిస్తోంది. ఒకవేళ ఆయనే కనుక సానుకూలంగా ఉంటే మాత్రం వాల్తేర్ డివిజన్ ని వెనక్కు తెస్తే వైసీపీ ఎంపీలు ఉత్తరాంధ్రలో హీరోలు అవుతారు. మరి ఆ ఛాన్స్ ఉందా.

Tags:    

Similar News