ఎమ్మెల్యే వెళ్లినా సీటు వైసీపీదే..!

గత ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గంలో ఈసారి ఆసక్తికర పోటీ జరిగింది. అభ్యర్థులు పాత వారే అయినా పార్టీలు [more]

Update: 2019-05-12 15:30 GMT

గత ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గంలో ఈసారి ఆసక్తికర పోటీ జరిగింది. అభ్యర్థులు పాత వారే అయినా పార్టీలు మారి పోటీ చేశారు. గత ఎన్నికల్లో చేజారిటీ ఈ స్థానాన్ని ఈసారైనా దక్కించుకోవాలని తెలుగేదశం పార్టీ భవిస్తుండగా, తమ సిట్టింగ్ స్థానాన్ని మళ్లీ కైవసం చేసుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పట్టుదలగా పనిచేసింది. సామాజకవర్గ సమీకరణాలు గెలుపోటములను ప్రభావితం చేసే ఈ నియోజకవర్గంలో ఈ ఎన్నికల్లో తీవ్ర పోటీ జరిగింది. ఇక్కడ టీడీపీ, వైసీపీతో పాటు జనసేన పార్టీ కూడా గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉండటంతో గిద్దలూరు నియోజకవర్గంలో త్రిముఖ పోటీ నెలకొంది.

పాత అభ్యర్థుల మధ్యే పోటీ

గత ఎన్నికల్లో గిద్దలూరు నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి కొత్త అభ్యర్థి ముత్తముల అశోక్ రెడ్డి విజయం సాధించారు. టీడీపీ అభ్యర్థి అన్నా రాంబాబుపై ఆయన 12 వేల మెజారిటీతో గెలుపొందారు. అంతకుముందు అన్నా రాంబాబు ప్రజారాజ్యం పార్టీ తరపున 2009లో విజయం సాధించారు. గత ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచిన అశోక్ రెడ్డి కొన్ని రోజుల తర్వాత తెలుగుదేశం పార్టీలోకి ఫిరాయించారు. దీంతో టీడీపీలో ఉన్న అన్నా రాంబాబు వైసీపీలోకి వచ్చారు. దీంతో రాంబాబుకు ఏడాది క్రితమే జగన్ టిక్కెట్ ఖరారు చేశారు. అప్పటి నుంచి ఆయన ప్రజల్లోనే ఉంటున్నారు. గత ఎన్నికల్లో ఓడినా ఈసారి కచ్చితంగా విజయం సాధిస్తానని ఆయన ధీమాగా ఉన్నారు. ఇక, అశోక్ రెడ్డి సైతం పార్టీ మారి తాను అభివృద్ధి చేయగలిగానని, కాబట్టి మళ్లీ విజయం సాధిస్తానని నమ్మకంగా ఉన్నారు.

సామాజక సమీకరణాల్లో ముందున్న వైసీపీ

నియోజకవర్గంలో రెడ్డి సామాజకవర్గం ఓటర్లు అధికంగా ఉన్నారు. టీడీపీ అభ్యర్థి అదే సామాజకవర్గం కావడంతో వారు తనకే ఓటేస్తారని టీడీపీ భావిస్తోంది. అయితే, రెడ్లు వైసీపీ వైపు ఉన్నారనేది పోలింగ్ సరళి చూశాక టీడీపీ నేతలే అంగీకరిస్తున్నారు. బీసీల ఓట్లు కూడా ఇక్కడ ఎక్కువ. వారు కూడా టీడీపీకే మొగ్గు చూపుతారని భావిస్తున్నారు. అయితే, జనసేన నుంచి బీసీ అభ్యర్థి బరిలో ఉండటంతో ఆయన వారి ఓట్లు భారీగా చీల్చే అవకాశం ఉంది. ఇక, ఎస్సీ, ముస్లిం వర్గాల ఓట్లు వైసీపీ వైపు ఎక్కువ మొగ్గు ఉండే అవకాశం ఉంది. దీంతో సామాజకవర్గ సమీకరణాలు చూసుకుంటే వైసీపీకే అనుకూలంగా ఉన్నాయి. ఇక, ఇద్దరు అభ్యర్థులూ ఆర్థికంగా బలంగా ఉన్నారు. దీంతో డబ్బు యధేచ్ఛగా ఖర్చు చేశారు. అశోక్ రెడ్డికి వ్యక్తిగతంగా కొంత మంచి పేరే ఉన్నా జగన్ ను మోసం చేసి టీడీపీలోకి వెళ్లారనే పేరుంది. అన్నా రాంబాబు పట్ల గత ఎన్నికల్లో ఓడిపోయిన సానుభూతి కూడా ఉంది. మొత్తంగా ఇక్కడ హోరాహోరీ పోరు ఉన్నా వైసీపీ స్వల్ప మెజారిటీతోనైనా విజయం సాధించే అవకాశం కనిపిస్తోంది.

Tags:    

Similar News