టార్గెట్ చేసి ఇరిటేట్ చేయలన్నదే వ్యూహమా?

జనసేన అధినేత పవన్ సత్తా తెలిసిపోయిందా? అందుకే ఒంటికాలిమీద వైసీపీ లేస్తుందా? అంటే అవుననే అనిపిస్తుంది. భవిష్యత్తులో తమకు టీడీపీ కన్నా పవన్ కల్యాణ్ ప్రధాన శత్రువుగా [more]

Update: 2020-04-17 02:00 GMT

జనసేన అధినేత పవన్ సత్తా తెలిసిపోయిందా? అందుకే ఒంటికాలిమీద వైసీపీ లేస్తుందా? అంటే అవుననే అనిపిస్తుంది. భవిష్యత్తులో తమకు టీడీపీ కన్నా పవన్ కల్యాణ్ ప్రధాన శత్రువుగా మారనున్నారని వైసీపీ భావిస్తున్నట్లుంది. పవన్ కల్యాణ్ గత ఆరేళ్లుగా తమను టార్గెట్ చేయడం, టీడీపీకి అనుకూలంగా ఉండటం, తాజాగా బీజేపీతో చేతులు కలపడం వంటి వాటిని చూసి పవన్ కల్యాణ్ నిలదొక్కుకోకుండా చేయాలన్న ఉద్దేశ్యమే వైసీపీ నేతల్లో కన్పిస్తుంది.

బాబుపై నమ్మకం లేదని….

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై ప్రజల్లో నమ్మకం లేదని వైసీపీ భావిస్తుంది. గతంలో చంద్రబాబు ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడం, ఒక ప్రాంతానికే అభివృద్ధిని పరిమితం చేయడం, ఒకవర్గం వారికే ప్రయోజనాలు చేకూర్చడం వంటి వాటితో మొన్నటి ఎన్నికల తర్వాత టీడీపీ రానున్న నాలుగేళ్ల కాలంలో కోలుకోలేదన్న భరోసాతో వైసీపీ ఉన్నట్లుంది. అందుకే చంద్రబాబును లైట్ గా తీసుకుంటున్నారు.

పవన్ బలం పైన….

మరోవైపు జనసేన అధినేత పవన్ కల్యాణ‌్ ను మాత్రం కట్టడి చేయాలని నిర్ణయించినట్లు కన్పిస్తుంది. రాష్ట్రంలో బలమైన సామాజికవర్గానికి ప్రతినిధిగా పవన్ కల్యాణ్ ను చూడాల్సి ఉంది. ఆయనకున్న అభిమానుల బలం కూడా అదనమే. దీంతో వచ్చే ఎన్నికల నాటికి బీజేపీ మద్దతుతో పవన్ కల్యాణ్ నిలదొక్కుకునే అవకాశాలున్నాయని వైసీపీ అగ్రనాయకత్వం భావిస్తుంది. అందుకే పవన్ కల్యాణ్ ను విజయసాయిరెడ్డి టార్గెట్ చేశారన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి.

జాగ్రత్తగా డీల్ చేయాలని….

పవన్ కల్యాణ్ ను జాగ్రత్తగా డీల్ చేయాల్సిన అవసరం ఉందని వైసీపీ సీనియర్ నేత ఒకరు వ్యాఖ్యానించారు. పవన్ కల్యాణ్, బీజేపీ కలసి పోటీ చేయాలని తాము భావిస్తున్నామన్నారు. టీడీపీతో పవన్ ను కలవకుండా చేయగలిగితే రెండోసారి కూడా విజయం తమదేనన్న ధీమాలో వైసీపీ నేతలు ఉన్నారు. త్రిముఖ పోటీలో టీడీపీయే ఎక్కువగా నష్టపోతుందని, తాము లబ్దిపొందుతామన్న అంచనాలో ఉన్నారు. అందుకే తొలుత పవన్ కల్యాణ్ ను టార్గెట్ చేసి ఇరిటేట్ చేయాలన్న భావనలో వైసీపీ నేతలు ఉన్నట్లు కన్పిస్తుంది.

Tags:    

Similar News