వైసీపీ మార్క్ స్ట్రాటజీతో బాబుకు షాకేనా… ?

చంద్రబాబు అసలు ఊహించని విషయం ఇపుడు జరుగుతోంది. తనలాగే జగన్ కూడా ప్రత్యేక హోదా ఊసు అసలు ఎత్తరని, ఆయనకు ఉన్న బలహీనతల కారణంగా ఆలా నెట్టుకుంటూ [more]

Update: 2021-07-21 08:00 GMT

చంద్రబాబు అసలు ఊహించని విషయం ఇపుడు జరుగుతోంది. తనలాగే జగన్ కూడా ప్రత్యేక హోదా ఊసు అసలు ఎత్తరని, ఆయనకు ఉన్న బలహీనతల కారణంగా ఆలా నెట్టుకుంటూ పోతారని చంద్రబాబు లాంటి అపర చాణక్యుడు అంచనా వేశారు. ఇక జగన్ సైతం హోదా విషయంలో అలా అడుగుతూనే ఉంటాం తప్ప ఇంతకు మించి ఏం చేసేది లేదు అంటూ విపక్షాలను ఒక విధంగా భ్రమలో ఉంచారనుకోవాలి. కేంద్రంలో మోడీకి ఫుల్ మెజారిటీ ఉంది కాబట్టి హోదా అన్నది అసలు కుదిరేది కాదని కూడా జగన్ సూత్రీకరించిన విషయమే. దాంతో దీన్ని వీలున్నపుడల్లా హోదా మ్యాటర్ కి ఒక రాజకీయ తురుపు ముక్కలా వాడుకుందామనే టీడీపీ అనుకుంది.

అనూహ్యమైన దూకుడు…

అయితే పార్లమెంట్ సమావేశాలకు రెండు రోజుల ముందే వైసీపీ హోదాపై చెడుగుడు ఆడాలని అజెండాలో పెట్టి మరీ నిర్ణయం తీసుకుంది. అయితే ప్రతీసారి ఇదే ముచ్చట ఉంటుంది కాబట్టి పెద్దగా టీడీపీ పట్టించుకోలేదు. కానీ చూడబోతే వైసీపీ మాటలే కాదు చేతల్లో తన ప్రతాపం చూపిస్తోంది. ఉభయ సభలను ఆ విధంగా స్తంభింపచేస్తోంది. దీంతో ఇపుడు అది జాతీయ మీడియాలోనూ హైలెట్ అవుతోంది. అలాగే ఏపీలోని రాజకీయం కూడా సంచలనంగా మారుతోంది. వైసీపీ ఒక్కటే హోదా మీద పోరాడే పార్టీ అన్నట్లుగా ప్రచారం కూడా సాగుతోంది.

దెబ్బకు చిత్తేనా …?

ఏపీలో ఇపుడు జనసేన, టీడీపీ వైసీపీ మీదకు దూసుకువస్తున్నాయి. ఇందులో జనసేన అయితే ప్రత్యేక హోదా విషయంలో ఎటూ మాట్లాడలేని స్థితిలో ఉంది. ఎందుకంటే ఆ పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకుంది కాబట్టి. మరో వైపు బీజేపీతో స్నేహం కోసం గట్టిగా ట్రై చేస్తున్న టీడీపీ కూడా వ్యూహాత్మకంగా ఆ విషయం ఎత్తడం లేదు. హోదా అన్నది గుర్తుకు వస్తే జగన్ మీదకే బాణాలు వేసి తెలివిగా తప్పుకుంటోంది. మరిపుడు ఏకంగా వైసీపీ పార్లమెంట్ లో రచ్చ చేస్తోంది. టీడీపీ విమర్శిస్తే మోడీ సర్కార్ నే విమర్శించాలి. జనసేన కూడా అంతే. మరి బీజేపీతో కలసి కూటమి కట్టాలని చూస్తున్న చంద్రబాబుకు ఇది మింగుడుపడే పరిణామమేనా అన్నదే చర్చగా ఉంది.

వదిలేయించుకున్నారా :

జగన్ తనను గురి చూసి ఏపీ విపక్షాలు పేల్చుతున్నహోదా తూటాను తెలివిగా మోడీ మీదకు మళ్ళించారు. అసలు దోషి బీజేపీ అని ఆయన క్లియర్ గా చెప్పేస్తున్నారు. మరి టీడీపీకి గానీ, చంద్రబాబుకు కానీ జగన్ ని అనే హక్కు లేదని వైసీపీ ఎంపీలు చెబుతున్నారు. పోరాడితే మాలా బయటకు వచ్చి గట్టిగా గర్జించండి అంటూ సూచిస్తున్నారు. అసలే ఒకసారి బీజేపీతో విడిపోయి చెడగొట్టుకున్న చంద్రబాబు ఎదురుగా నిలిచి మోడీతో వైరం తెచ్చుకుంటారా అన్నదే పాయింట్. మరి ఈ విషయంలో కనుక నోరు విప్పకపోతే హోదా పోరు మొత్తం క్రెడిట్ జగన్ కి పోతుంది. అలగని నోరు విప్పితే కమలంతో కలహం వస్తుంది. మొత్తానికి జగన్ మార్క్ మాస్టర్ స్ట్రాటజెతో పవన్, బాబులకు ఇబ్బందే అంటున్నారు.

Tags:    

Similar News