అది గ్యారంటీగా వైసీపీదేనా..?

ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు స్వంత జిల్లా చిత్తూరులో ఉన్న రెండు పార్ల‌మెంటు స్థానాల‌నూ ద‌క్కించుకోవడం ఆయ‌న‌కు ప్ర‌తిష్టాత్మ‌కంగా మారింది. గ‌త ఎన్నిక‌ల్లో జిల్లాలోని చిత్తూరు పార్ల‌మెంటు స్థానం [more]

Update: 2019-05-19 02:30 GMT

ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు స్వంత జిల్లా చిత్తూరులో ఉన్న రెండు పార్ల‌మెంటు స్థానాల‌నూ ద‌క్కించుకోవడం ఆయ‌న‌కు ప్ర‌తిష్టాత్మ‌కంగా మారింది. గ‌త ఎన్నిక‌ల్లో జిల్లాలోని చిత్తూరు పార్ల‌మెంటు స్థానం తెలుగుదేశం పార్టీకి ద‌క్క‌గా తిరుప‌తి నియోజ‌క‌వ‌ర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజ‌యం సాధించారు. దీంతో ఈసారైనా తిరుప‌తి లోక్ స‌భ స్థానాన్ని కైవ‌సం చేసుకోవాల‌ని టీడీపీ ప‌ట్టుద‌ల‌గా ప‌నిచేసింది. ఇక‌, మ‌రోసారి త‌మ సిట్టింగ్ స్థానాన్ని ద‌క్కించుకోవాల‌ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ క‌స‌ర‌త్తు చేసింది. రెండు పార్టీల మ‌ధ్య హోరాహోరీ పోరు జ‌ర‌గ‌గా పోలింగ్ త‌ర్వాత రెండు పార్టీల్లోనూ గెలుపుపై ధీమా క‌నిపిస్తోంది.

కాంగ్రెస్ కు కంచుకోట‌

తిరుప‌తి లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గంలో ముందునుంచీ తెలుగుదేశం పార్టీ ప్ర‌తికూలంగానే ఫ‌లితాలు వ‌చ్చాయి. ఆ పార్టీ ఆవిర్భ‌వించిన త‌ర్వాత కేవ‌లం ఒక్క‌సారి మాత్ర‌మే ఇక్క‌డి నుంచి టీడీపీ గెలిచింది. మూడుసార్లు ఈ స్థానాన్ని పొత్తులో భాగంగా బీజేపీకి వ‌దిలేసింది. ఒక్క‌సారి మాత్రమే బీజేపీ విజ‌యం సాధించింది. టీడీపీ ఆవిర్భావం త‌ర్వాత కాంగ్రెస్ పార్టీ ఇక్క‌డి నుంచి ఏకంగా ఆరుసార్లు విజ‌యం సాధించ‌గా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒకసారి గెలుపొందింది. రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత కాంగ్రెస్ పూర్తిగా నామ‌మాత్రం కాగా ఆ స్థానంలోకి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వ‌చ్చింది. గ‌త ఎన్నిక‌ల్లో ఈ స్థానాన్ని టీడీపీ బీజేపీకి వ‌దిలేసింది. బీజేపీ అభ్య‌ర్థి జ‌య‌రాంపై వైసీపీ అభ్య‌ర్థి వెల‌గ‌ప‌ల్లి వ‌ర‌ప్ర‌సాద్ 37,425 ఓట్ల మెజారిటీతో విజ‌యం సాధించారు.

ఎవ‌రు గెలిచినా స్వ‌ల్ప మెజారిటీనే

ఈ ఎన్నిక‌ల్లో వైసీపీ అనూహ్యంగా వ‌ర‌ప్ర‌సాద్ ను గూడురు అసెంబ్లీకి పోటీ చేయించి బ‌ల్లె దుర్గాప్ర‌సాద్ ను తిరుప‌తి ఎంపీగా పోటీ చేయించారు. తెలుగుదేశం పార్టీ టిక్కెట్ కోసం ముగ్గురు స్థానిక నేత‌లు ఆశించినా చివ‌ర‌కు కాంగ్రెస్ నుంచి మాజీ కేంద్ర‌మంత్రి ప‌న‌బాక ల‌క్ష్మిని పార్టీలో చేర్చుకొని చివ‌రి నిమిషంలో ఆమెకు టిక్కెట్ ఇచ్చారు. దీంతో ప్ర‌ధాన అభ్య‌ర్థులు ఇద్ద‌రూ కొత్త వారు అయ్యారు. వైసీపీ అభ్య‌ర్థితో పోల్చితే టీడీపీ అభ్య‌ర్థి గుర్తింపు ఉన్న నాయ‌కురాలు కావ‌డం ఆ పార్టీకి ప్ల‌స్ అయ్యింది. తిరుప‌తి లోక్ స‌భ ప‌రిధిలోని ఏడు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో గ‌త ఎన్నిక‌ల్లో ఆరింటిలో వైసీపీకి మెజారిటీ రాగా తిరుప‌తిలో మాత్రం బీజేపీకి మెజారిటీ వ‌చ్చింది. ఈసారి వైసీపీకి మూడు అసెంబ్లీల్లో మెజారిటీ వ‌చ్చే అవ‌కాశం ఉంది. టీడీపీకి రెండింటిలో మెజారిటీ రావ‌చ్చు. మిగ‌తా ఒక అసెంబ్లీలో హోరాహోరీ పోరు ఉంది. మొత్తంగా తిరుప‌తి పార్ల‌మెంటు స్థానంలో వైసీపీకి విజ‌యావ‌కాశాలు క‌నిపిస్తున్నా టీడీపీ కూడా గ‌ట్టి పోటీనే ఇచ్చింది. ఎవ‌రు గెలిచినా స్వ‌ల్ప మెజారిటీ రావ‌చ్చు.

Tags:    

Similar News