ఎమ్మెల్యే పార్టీ మారినా సీటు వైసీపీదే..!

కర్నూలు జిల్లాలో గత ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మెజారిటీ స్థానాలు సాధించి ఆధిపత్యం ప్రదర్శించింది. ఈ ఎన్నికల్లోనూ మరోసారి కర్నూలు జిల్లాలో మెజారిటీ స్థానాలు దక్కించుకోవాలని [more]

Update: 2019-05-08 02:00 GMT

కర్నూలు జిల్లాలో గత ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మెజారిటీ స్థానాలు సాధించి ఆధిపత్యం ప్రదర్శించింది. ఈ ఎన్నికల్లోనూ మరోసారి కర్నూలు జిల్లాలో మెజారిటీ స్థానాలు దక్కించుకోవాలని ఆ పార్టీ ప్రయత్నించింది. అయితే, ఫిరాయింపులను ప్రోత్సహించి బలపడినట్లు భావిస్తున్న తెలుగుదేశం పార్టీ ఈసారి కర్నూలు జిల్లా ఫ్యాన్ స్పీడ్ కి బ్రేకులు వేయ్యాలనే పట్టుదలగా వ్యూహాలు పన్నింది. ఎన్నికల ముందు వరకూ జిల్లాలో చేరికలతో తెలుగుదేశం పార్టీలో జోష్ కనిపించింది. అయితే, ఎన్నికల సమయానికి జిల్లాలో ఇద్దరు అభ్యర్థులు తాము పోటీ చేయలేమని మొదట మొండికేయడం, తర్వాత వారికి బుజ్జగించి పోటీకి నిలబెట్టడం, టీడీపీ నుంచి పలువురు నాయకులు వైసీపీలో చేరడంతో ఎన్నికల నాటికి వైసీపీ ఉత్సాహంగా కనిపించింది. ఇక, కర్నూలు జిల్లాలో ఈసారి కచ్చితంగా విజయం సాధిస్తామని ధీమాగా ఉన్న స్థానాల్లో శ్రీశైలం నియోజకవర్గం ఒకటి.

విజయంపై ధీమాతో శిల్పా చక్రపాణిరెడ్డి

పుణ్యక్షేత్రం శ్రీశైలంలో గత ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బుడ్డా రాజశేఖర్ రెడ్డి.. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి శిల్పా చక్రపాణిరెడ్డిపై 4,861 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. తర్వాత ఆయన తెలుగుదేశం పార్టీలోకి ఫిరాయించారు. టీడీపీ నుంచి పోటీ చేసిన శిల్పా చక్రపాణిరెడ్డి వైసీపీలో చేరారు. ఈసారి మళ్లీ వీరిద్దరే పోటీపడ్డా పార్టీలు మాత్రం మారాయి. రెండేళ్లు క్రితం నంధ్యాల ఉప ఎన్నికల సమయంలో పార్టీలో చేరినప్పుడు చక్రపాణిరెడ్డికి జగన్ ఈ టిక్కెట్ ఖరారు చేశారు. దీంతో ఆయన అప్పటినుంచే నియోజకవర్గంలో పనిచేసుకుంటున్నారు. గత ఎన్నికల్లో ఓడిపోయినా ప్రజల్లో ఉన్నారనే పేరుంది. పైగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ బలంగా కనిపిస్తోంది. దీంతో ఈసారి తమదే విజయమని చక్రపాణిరెడ్డి ధీమాగా ఉన్నారు.

బుడ్డాకు ఈసారి కష్టమే..?

తెలుగుదేశం పార్టీ తరపున పోటీలో ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి అయిష్టంగా ఈసారి పోటీ చేశారు. టిక్కెట్ ఖరారు చేసిన తర్వాత ఆయన పోటీ నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నారు. ఓ దశలో టీడీపీ కూడా ఆయన ప్రత్యామ్నాయంగా ఏరాసు ప్రతాప్ రెడ్డినో, బైరెడ్డి రాజశేఖర్ రెడ్డినో దింపాలనుకుంది. చివరకు మళ్లీ రాజశేఖర్ రెడ్డిని బుజ్జగించడంతో ఆయనే పోటీ చేశారు. బుడ్డాది రాజకీయ కుటుంబం. వారికి ఇక్కడ బాగానే గుర్తింపు ఉంది. ఆయన తండ్రి వెంగళరెడ్డి మూడుసార్లు, సోదరుడు సీతారామిరెడ్డి ఒకసారి ఎమ్మెల్యేగా పనిచేశారు. రాజశేఖర్ రెడ్డి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశానని చెప్పుకున్నారు. అయితే, పార్టీ ఫిరాయించడంతో ఆయనపై కొంత వ్యతిరేకత కనిపించింది. చివరి నిమిషంలో పోటీకి డైలమాలో ఉండటంతో ప్రత్యర్థి గెలుస్తున్నారనే భావన ప్రజల్లో వచ్చింది. సహజంగా గెలుస్తారనే అంచనా ఉన్నవారికే ప్రజలు ఎక్కువగా ఓట్లేస్తారు. ఇది వైసీపీకి ప్లస్ అయ్యింది. మొత్తంగా ఈసారి బుడ్డా రాజశేఖర్ రెడ్డికి గెలుపు అంత సులువు కాదనే అంచనాలు ఉన్నాయి.

Tags:    

Similar News