ఆపరేషన్ మరోలా?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ కు తెరతీసినా ప్రయోజనం లేకపోవడంతో మరో రూట్లో టీడీపీ నేతలను కట్టిపడేసేందుకు సిద్ధమయింది. నిజానికి టీడీపీ నేతల ఆర్థిక మూలాలను [more]

Update: 2020-02-21 03:30 GMT

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ కు తెరతీసినా ప్రయోజనం లేకపోవడంతో మరో రూట్లో టీడీపీ నేతలను కట్టిపడేసేందుకు సిద్ధమయింది. నిజానికి టీడీపీ నేతల ఆర్థిక మూలాలను దెబ్బతీయడమే గత ఎనిమిది నెలలుగా లక్ష్యంగా పెట్టుకుందని పసుపు పార్టీ నేతలు ఆరోపిస్తున్నా వైసీపీ మాత్రం కొనసాగిస్తూనే ఉంది. ఇందుకు ప్రకాశం జిల్లా టీడీపీ నేతలే నిదర్శనం. అయితే న్యాయపరంగా ఎదుర్కొందామనుకున్న టీడీపీ నేతలకు మరో ఇబ్బంది ఎదురయింది.

గొట్టిపాటిని దెబ్బతీయడానికి….

గత ఎన్నికల్లో ప్రకాశం జిల్లాలో టీడీపీ నాలుగు సీట్లను గెలుచుకుంది. ఇందులో అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ వ్యాపారాలను దెబ్బతీయడమే లక్ష్యంగా ప్రభుత్వం పెట్టుకుందని టీడీపీ ఆరోపిస్తుంది. ఒక దశలో గొట్టిపాటి రవికుమార్ పార్టీ మారదామనుకున్నారు. అంతా సిద్ధం చేసుకునే సమయంలో రాజధాని అమరావతి విషయం రావడంతో ఆయన సేఫ్ గా ఉండాలంటే టీడీపీలోనే కొనసాగడం బెటరని డిసైడ్ అయ్యారు.

మూడు వందల కోట్లు జరిమానా?

దీంతో ఈ మధ్యకాలంలో ప్రకాశం జిల్లాలో గొట్టిపాటి రవికుమార్ కు చెందిన గ్రానైట్ క్వారీలపై విజిలెన్స్ మరియు గనుల శాఖ అధికారులు దాడులు చేశారు. గొట్టిపాటి రవికుమార్ క్వారీలకు 305 కోట్లు జరిమానా విధించారు. దీంతో ఆయన జరిమానా చెల్లించాలా? న్యాయపరంగా వెళ్లాలా? అన్న ఆలోచనలో ఉన్నారు. ఇదే జిల్లాకు చెందిన మాజీ మంత్రి శిద్దా రాఘవరావుకు చెందిన కంపెనీలపై కూడా దాడులు జరిపి దాదాపు 600 కోట్లు జరిమానా విధించింది.

న్యాయస్థానానికి వెళ్లాలంటే?

అలాగే తెలుగుదేశం పార్టీలో కీలకంగా ఉండి ఇటీవల బీజేపీలో చేరిన రాజ్యసభ సభ్యుడు గరికపాటి మోహన్ రావుకు కూడా ప్రకాశం జిల్లాలో గ్రానైట్ క్వారీలున్నాయి. ఈయనకు చెందిన కంపెనీలకు కూడా 280 కోట్లు పెనాల్టీ వేశారు. దీంతో నేతలు భయపడిపోతున్నారు. జరిమానాలు చెల్లించే పరిస్థితి లేదు. అలాగని న్యాయపోరాటం చేయాలంటే నిబంధనల ప్రకారం జరిమానా మొత్తంలో పదిశాతం మొత్తం కోర్టుకు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. అంత డబ్బు జరిమానా కట్టలేక, ఇటు న్యాయస్థానాన్ని ఆశ్రయించలేక నలిగిపోతున్నారు. చంద్రబాబు గొట్టిపాటి రవికుమార్, శిద్ధారాఘవరావులుకు ఫోన్ చేసి ధైర్యం చెప్పినట్లు తెలిసింది. ఎంత ఇబ్బంది పెట్టినా తాము టీడీపీలోనే కొనసాగుతామని వారు చెబుతుండటం విశేషం.

Tags:    

Similar News