వైసీపీ చెడుగుడు ఆపేట్లు లేదే?

కరోనాకు పేదా గొప్పా తేడా లేదు, రాజూ బంటూ అంతకంటే లేదు అంటారు. అలాగే ఏ తారతమ్యం లేని అపర ధర్మరాజు కరోనా వైరస్ అంటారు. కానీ [more]

Update: 2020-05-20 08:00 GMT

కరోనాకు పేదా గొప్పా తేడా లేదు, రాజూ బంటూ అంతకంటే లేదు అంటారు. అలాగే ఏ తారతమ్యం లేని అపర ధర్మరాజు కరోనా వైరస్ అంటారు. కానీ ఆచరణలో చూస్తూంటే కరోనా పేదలనే చంపుతోంది. డబ్బున్నోళ్ళు ఇళ్ళల్లో ఉంటూ ఎన్ని ఏళ్ళు అయినా లాక్ డౌన్ పెట్టుకోండి డబుల్ ఓకే అంటున్నారు. వలస కార్మికులు ఆకలితో చస్తున్నారు. మధ్యతరగతి అధోగతి అయిపోతున్నారు. పేదలు మరింతగా దీనమవుతున్నారు. ఇవన్నీ సామాజిక రంగంలో కనిపిస్తున్నాయి. ఇక రాజకీయాల్లో చూసుకుంటే కరోనా కాటుకు ప్రతిపక్షాలే ఎక్కడ చూసినా విలవిలాడుతున్నాయి. అధికార పార్టీలకు మాత్రం ఇదంతా బాగానే ఉంటోంది. ఏకపక్షంగా దూకుడు చేస్తున్నాయి.

సీన్ లో లేరే….

లాక్ డౌన్ పుణ్యమాని లాక్ డౌన్ విధించడంతో దేశంలో ప్రతిపక్షాలు ఒక్కసారిగా పరార్ అయ్యాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో చూసుకున్నపుడు అధికార పార్టీ సౌండ్ బలంగా వినిపిస్తోంది. ఇక ఏపీలోకి వస్తే రెండు నెలలైంది ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు గాయబ్ అయ్యారు. జగన్ ని గత పదినెలలుగా అల్లరి పెట్టిన జనసేనాని సైతం పొరుగు రాష్ట్రమే తన విలాసం అంటున్నారు. ఇక మిగిలిన రాజకీయ పార్టీలు ఏవీ బయట తిరిగే సీన్ లేదు. ఎవరు రావాలన్నా, పోవాలన్నా కూడా జగన్ సర్కార్ పర్మిషన్ అడగాలి. మొత్తానికి రాజకీయ మైదానంలో వైసీపీ ఒక్కటే అటూ ఇటూ నిలబడి మరీ చెడుగుడు ఆడేస్తోంది.

ఇదే అదనుగా ….

ఇక జగన్ తెలివిగా రాజకీయం చేస్తున్నారు. ఇదే అదనుగా ముందుకు దూసుకుపోతున్నారు. తాను అనుకున్నవి చకచకా కానిచ్చేస్తున్నారు. ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి ఏమైనా చేయగలరు, దాంతో తాను అధికారంలోకి వచ్చిన కొత్తల్లో ప్రభుత్వం భూములు అమ్మాలనుకున్నారు. నాడు మోకాలడ్డాయి విపక్షాలు, నానా యాగీ చేశాయి. ఇపుడు లాక్ డౌన్ ఉంది. ఎన్నో ఆంక్షలు ఉన్నాయి. దాంతో జగన్ సరిగ్గా ఇదే టైమ్ అని భావించి సర్కార్ భూముల వేలానికి తెర లేపారు. ఇపుడు ఎవరూ ఉద్యమాలు చేయలేరు, వీధి పోరాటాలు అంతకంటే చేయలేరు. దాంతో సరైన సమయం చూసి భూములను అమ్మేస్తున్నారని విపక్షాలు వాపోతున్నాయి.

అదీ అంతేనా..?

మరో వైపు జగన్ ఏ స్కీం కూడా అపడంలేదు. అన్ని వర్గాలను ఆకట్టుకుంటున్నారు. తన హామీలను అమలు అయ్యేలా చూసుకుంటున్నారు. వీటిని నిచ్చెన మెట్లుగా మార్చుకుని స్థానిక ఎన్నికలకు తయారు అయిపోతున్నారు. ఇప్పటికే కరోనా సాయం పేరిట వైసీపీ నేతలంతా జనంలోనే ఉన్నారు. జగన్ సైతం తడవకో పధకం అనౌన్స్ చేస్తూ జనాలకు చేరువ అవుతున్నారు. కరోనా వైరస్ మూలంగా విపక్షాలు తలుపులులేసుకుని ఇంట్లో ఉంటే అధికార పార్టీగా వైసీపీ వీధుల్లో ఉంటోంది. మరి ఇలా కొన్ని నెలలు గడిస్తే స్థానిక ఎన్నికలు కూడా పెడతారు. అపుడు కచ్చితంగా వైసీపీకే అధిక ప్రయోజనం సమకూరుతుంది అని అంటున్నారు. మొత్తానికి కరోనా, లాక్ డౌన్ తో ఏపీలో విపక్షం చిత్తు అవుతూంటే వైసీపీ ప్రశాంతంగా తన మార్క్ రాజకీయానికి పదును పెడుతోంది.

Tags:    

Similar News