ఇద్దరూ ఎవరికి వారే?

రాష్ట్రంలోని 22 మంది వైసీపీ ఎంపీల్లో ఎవ‌రి ప్రత్యేక‌త వారిదే అయినా.. ఓ ఇద్దరు ఎంపీలు మాత్రం చాలా ప్రత్యేక‌త‌గా ఉన్నార‌ని అంటున్నారు. “వైసీపీ ఎంపీల్లో ఆ [more]

Update: 2020-02-07 13:30 GMT

రాష్ట్రంలోని 22 మంది వైసీపీ ఎంపీల్లో ఎవ‌రి ప్రత్యేక‌త వారిదే అయినా.. ఓ ఇద్దరు ఎంపీలు మాత్రం చాలా ప్రత్యేక‌త‌గా ఉన్నార‌ని అంటున్నారు. “వైసీపీ ఎంపీల్లో ఆ ఇద్దరు స్పెష‌ల్‌“-అంటున్నారు విశ్లేష‌కులు. వీరిలో ఒక‌రు బాప‌ట్ల ఎంపీ నందిగం సురేష్ కా గా, రెండో వారు గుంటూరు జిల్లా న‌ర‌సరావుపేట‌కు చెందిన ఎంపీ లావు శ్రీకృష్ణ దేవ‌రాయులు. ఈ ఇద్దరూ కూడా యువ ఎంపీలే కావ‌డం గ‌మ‌నార్హం. వైసీపీలో ఎంద‌రో యువ ఎంపీలు ఉన్నప్పటికీ.. ఈ ఇద్దరికే ఎందుకు ప్రాధాన్యం పెరిగింద‌నేది ఆస‌క్తిక‌ర ప్రశ్న. విష‌యంలోకి వెళ్తే.. వీరు ఇద్దరూ కూడా జ‌గ‌న్‌కు అత్యంత విధేయులు. అంతేకాదు, స‌మ‌యానికి త‌గిన విధంగా మాట్లాడడంలో నూ ముందున్నారు.

నియోజకవర్గాల సమస్యపై….

నిజానికి వీరిద్దరూ ఎంపీలుగా ఎన్నికైన త‌ర్వాత పెద్దగా మీడియా ముందుకు రాలేదు. శ్రీకృష్ణ దేవ‌రాయలుత‌న ప‌నితాను చేసుకునిపోయారు. అమ‌రావ‌తి, గుంటూరు జిల్లాతో పాటు త‌న నియోజ‌క‌వ‌ర్గం అయిన ప‌ల్నాడు స‌మ‌స్యల‌ను లోక్‌స‌భ‌లో ఎన్నోసార్లు ప్రస్తావించారు. నియోజ‌క‌వ‌ర్గంలోని స‌మ‌స్యల‌పై ప్రధానంగా దృష్టి పెట్టారు. నందిగం సురేష్ ప‌రిస్థితి కూడా ఇంతే. అయితే, త‌న‌కు సంబంధం లేద‌ని తాడికొండ నియోజ‌క‌వ‌ర్గంలో వేలు పెడుతున్నార‌నే అప‌వాదు మిన‌హా ఆయ‌న కూడా అంద‌రితోనూ క‌లివిడిగా ఉంటున్నారు. లావు కూడా అంద‌రినీ క‌లుపుకొని పోతూ ముందుకు సాగుతున్నారు. స‌రే.. అస‌లు విష‌యానికి వ‌స్తే.. ఇప్పుడు రాజ‌ధాని ప్రాంతంలో కానీ, గుంటూరు జిల్లాలో కానీ ఈ ఇద్దరిపైనే చ‌ర్చ సాగుతోంది.

లావు హామీతో….

రాజ‌ధానిలో రైతులు చేస్తున్న ఆందోళ‌న‌కు ఇప్పటి వ‌ర‌కు వైసీపీ నుంచి ఒక్కరూ ముందుకు వ‌చ్చి ప‌రామర్శించ‌లేదు. కానీ, ఇటీవ‌ల లావు కృష్ణదేవ‌రాయ‌లు మాత్రం ఇక్కడి మంద‌డంలో ప‌ర్యటించి రైతుల స‌మ‌స్య విన్నారు. వారికి భ‌రోసా క‌ల్పించారు. పార్టీ ప్రణాళిక‌ను వారికి వినిపించారు. అంతేకాదు, రైతుల ఆవేద‌న‌ను ప్రభుత్వం వింటుంద‌ని కూడా హామీ ఇచ్చారు. మొత్తానికి ఈప‌రిణామంతో రైతుల్లో కొంత మేర‌కు ఉప‌శ‌మ‌నం ల‌బించింద‌నే చెప్పాలి.

దూకుడుతనంతో….

ఇక‌, ఎంపీ నందిగం విష‌యానికి వ‌స్తే ఆయ‌న డిఫ‌రెంట్ స్టయిల్‌తో దూకుడుగా ఉన్నారు. రాజ‌ధాని విష‌యంలో ప్రస్తుతం జ‌రుగుతున్న ఆందోళ‌న‌ల‌పై స్థానిక ఎంపీగా ఆయ‌న ఆచి తూచి వ్యవ‌హ‌రించాలి. అయితే, దీనికి భిన్నంగా త‌న‌దైన దూకుడు ప్రద‌ర్శించారు. ఇటీవ‌ల కృష్ణాజిల్లా నందిగామ‌కు వ‌చ్చిన ఎంపీని విద్యార్థి సంఘాలు అడ్డగించి రాజ‌ధానిపై ప్రక‌ట‌న చేయాల‌ని కోరుకున్నారు. అయితే, దీనిపై ఆచితూచి.. వ్యవ‌హ‌రించి ప‌రిస్థితిని త‌న‌దైన శైలిలో శాంతింప జేయాల్సిన సురేష్‌.. అగ్నికి ఆజ్యం పోసిన‌ట్టు మాట్లాడ‌డం కాస్త వివాదానికి కార‌ణ‌మైంది.

ఇద్దరూ చెరోరకంగా….

రాజ‌ధాని ఉద్యమంలో నిర‌స‌న‌ల్లో అస‌లే ఆగ్రహంతో ఉన్న విద్యార్థుల ముందు.. “నేను జ‌గ‌న్ మాట త‌ప్ప ఎవ‌రి మాటా విన‌ను. ఎవ‌రు ఎన్ని కుట్రలు ప‌న్నినా.. మూడు రాజ‌ధానుల‌ను క‌ట్టితీరుతాం“ అంటూ తీవ్రంగా వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఇది చిలికి చిలికిగాలివాన‌గా మారింది. ఇరు ప‌క్షాలు కేసులు పెట్టుకున్నారు. క‌ట్ చేస్తే.. ఇద్దరూ యువ ఎంపీలే అయినా.. రాజ‌ధాని విష‌యంలో లావు, నందిగంల వ్యవ‌హార శైలిపై ఆస‌క్తిగా చ‌ర్చ సాగుతుండ‌డం గ‌మ‌నార్హం.

Tags:    

Similar News