అంతా సైలెన్స్….. దేనికి సంకేతం?

అధికార వైసీపీ ఎమ్మెల్యేల వ్యవ‌హారం చాలా నిరుత్సాహంగా ఉంద‌నే వ్యాఖ్యలు స‌ర్వత్రా వినిపిస్తున్నాయి. కొందరు ఎమ్మెల్యేలు నిర్లక్ష్యంగా ఉంటే.. మ‌రికొంద‌రు ఎమ్మెల్యేలు ఏకంగా వైరాగ్య భావ‌న‌తో ఉన్నార‌ని [more]

Update: 2020-07-24 15:30 GMT

అధికార వైసీపీ ఎమ్మెల్యేల వ్యవ‌హారం చాలా నిరుత్సాహంగా ఉంద‌నే వ్యాఖ్యలు స‌ర్వత్రా వినిపిస్తున్నాయి. కొందరు ఎమ్మెల్యేలు నిర్లక్ష్యంగా ఉంటే.. మ‌రికొంద‌రు ఎమ్మెల్యేలు ఏకంగా వైరాగ్య భావ‌న‌తో ఉన్నార‌ని కూడా తెలుస్తుండ‌డం గ‌మ‌నార్హం. ఎన్నో ఆశ‌లు, ప్రజ‌ల్లో అంచ‌నాల‌తో ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వారు చాలా మందే ఉన్నారు. ఇప్పుడు వీరి ఆట‌లు జ‌గ‌న్ ఎక్కడా సాగ‌నీయ‌డం లేదు. ముఖ్యంగా సీనియ‌ర్లను ప‌క్క‌న పెడితే జూనియ‌ర్ ఎమ్మెల్యేలు ఎంతో మ‌హారాజ వైభోగం వెల‌గ బెట్టవ‌చ్చన్న ఆశ‌ల‌తో భారీగా ఖ‌ర్చు చేసి ఎమ్మెల్యేగా విజ‌యం సాధించారు.

అభివృద్ధి ఏదీ.. ఆరోపణలు తప్ప…..

ఇప్పటికే 16 నెల‌లు పూర్త‌య్యింది. వీరిలో చాలా మంది పూర్తిగా నిరాశ నిస్పృహ‌ల్లోకి వెళ్లిపోయార‌ని టాక్‌. దీంతో అస‌లు ఏం జ‌రుగుతోంది ? అనే చ‌ర్చ ప్రారంభ‌మైంది. ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర అయింది. ఈ ఏడాదిన్నర కాలంలో ఎమ్మెల్యేలు చేసింది ఏమైనా ఉందా ? అంటే ఏమీ క‌నిపించ‌డం లేదు. పైగా వారిపై ఆరోప‌ణ‌లు వెల్లువెత్తుతున్నాయి. ఇసుక స‌హా ఇళ్ల విష‌యాల్లో అవినీతికి పాల్పడుతున్నార‌నే వాద‌న వ్యతిరేక మీడియాలో వెల్లువెత్తుతోంది. అయితే, ఇలా వ్యతిరేక క‌థ‌నాలు వ‌చ్చిన‌ప్పుడు మంత్రులు ఒక‌రో ఇద్దరో మీడియా ముందుకు వ‌చ్చి.. ప్రతిగా కౌంట‌ర్లు ఇవ్వడ‌మో.. లేకపోతే.. ఎదురుదాడి చేయ‌డ‌మో చేసి స‌రిపెడుతున్నారు.

ఏమీ పట్టనట్లుగా….

ఇక‌, ఎమ్మెల్యేలు ఏమీ ప‌ట్టన‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. జ‌గ‌న్ ఎమ్మెల్యేల్లో చాలా మందికి పార్టీ అధికార ప్రతినిధి ప‌ద‌వులు కూడా ఇచ్చారు. వీరు కూడా మాట్లాడ‌డం లేదు. ప్రభుత్వం ఒక‌వైపు అనేక సంచ‌ల‌న కార్యక్రమాలు రూపొందిస్తోంది. అనేక సంక్షేమ‌కార్యక్రమాలు ప్రజ‌ల్లోకి విస్థృతంగా తీసుకువెళ్లాల‌ని చెబుతోంది. అయిన‌ప్పటికీ.. ఎమ్మెల్యేలు.. ప‌ట్టించుకోవ‌డం లేదు. దీంతో అస‌లు ఏం జ‌రుగుతోంద‌నే ప్రశ్న స‌ర్వత్రా వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. గ‌త ప్రభుత్వాన్నే తీసుకుంటే.. నిజానికి చేసింది త‌క్కువో.. ఎక్కువో.. ప‌క్కన పెడితే.. ఎమ్మెల్యేలు.. ప్రజ‌ల్లోకి బాగా తీసుకువెళ్లారు.అధినేత చంద్రబాబుపై ఒక్కమాట అన్నా విరుచుకుప‌డేవారు. కానీ, ఇప్పుడు ఎమ్మెల్యేలు నిమ్మకు నీరెత్తిన‌ట్టు వ్యవ‌హ‌రిస్తున్నారు.

పథకాల గురించి…..

వైఎస్సార్ ఆస‌రా అనే ప‌థ‌కం నిజానికి దేశంలోనే తొలిసారి.. ల‌క్షల మంది ఎస్సీ, ఎస్టీ మ‌హిళ‌ల‌కు ఆర్ధికంగా ప్రోత్సాహాన్నిచ్చే ప‌థ‌కం. అయితే, ఇప్పటి వ‌ర‌కు దీనిపై ఎమ్మెల్యేల‌కే అవగాహ‌న లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఇలాంటి ప‌థ‌కం వ‌చ్చిన‌ప్పుడు ప్రజ‌ల‌ను దీనిపై చ‌ర్చించే దిశ‌గా ఎందుకు చేయ‌లేక‌పోతున్నారు. ఇక‌, చేదోడు ప‌థ‌కం కూడా ఇలాంటిదే. అయినా ఎమ్మెల్యేలు ఇలాంటి ప‌థ‌కాల‌ను ప్రజ‌ల్లోకి తీసుకువెళ్లలేక‌పోతున్నారు. ఫ‌లితంగా ఆయా కార్యక్రమాలు, ప‌థ‌కాలు ఎక్కడివ‌క్కడే అనే ధోర‌ణిలో ఉన్నాయి. మ‌రి ఎమ్మెల్యేలు ఆశిస్తున్నది ఏంటి ? అన్నదానిపై ఆరా తీస్తే ఆస‌క్తిక‌ర అంశాలే బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి.

లైట్ తీసుకుంటూ….

చాలా మంది ఎమ్మెల్యేల‌కు ఇప్పట‌కీ జ‌గ‌న్ అపాయింట్‌మెంట్ లేదు. యేడాది కాలంగా జ‌గ‌న్ అపాయింట్‌మెంట్ కోసం వెయిట్ చేస్తోన్న ఎమ్మెల్యేలు క‌నీసం 80 మంది వ‌ర‌కు ఉంటార‌ని పార్టీ వ‌ర్గాల్లోనే గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. మ‌రి కొంద‌రు ఎమ్మెల్యేలు భారీ ప్రతిపాద‌న‌లు మంత్రుల వ‌ద్దకు తీసుకు వెళుతున్నా వాటిల్లో క‌నీసం 5 శాతం ప‌నులు కూడా కాని ప‌రిస్థితి ఉంద‌ట‌. ఈ ప‌రిణామాల‌తోనే ఎమ్మెల్యేలు పార్టీని లైట్ తీస్కొంటూ నియోజ‌క‌వ‌ర్గాల్లోనే త‌మ పెత్తనాన్ని చ‌క్క పెట్టుకుంటున్నార‌ట‌.

Tags:    

Similar News