వైసీపీ ఎమ్మెల్యేలు డీలా…ఎందుకంటే?

వ‌ద‌లమంటే పాముకు కోపం.. క‌ర‌వ‌మంటే క‌ప్పకు కోపం.. అన్న చందంగా మారిపోయింది వైసీపీ ఎమ్మెల్యేల ప‌రిస్థితి. ఈ ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లో కోట్లాది రూపాయ‌లు ఖర్చు చేసుకుని [more]

Update: 2019-11-09 11:00 GMT

వ‌ద‌లమంటే పాముకు కోపం.. క‌ర‌వ‌మంటే క‌ప్పకు కోపం.. అన్న చందంగా మారిపోయింది వైసీపీ ఎమ్మెల్యేల ప‌రిస్థితి. ఈ ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లో కోట్లాది రూపాయ‌లు ఖర్చు చేసుకుని పోటీ చేసి, త్రిముఖ పోటీ (టీడీపీ-జ‌న‌సేన‌-వైసీపీ)లో కూడా విజ‌యం సాధించారు. ఏకంగా 151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీలు గెలిచారు. ఎంపీల సంగ‌తి ప‌క్కన పెడితే ఎమ్మెల్యేల‌కు మాత్రం భారీగానే చేతి చ‌మురు వ‌దిలింది. ఈ క్రమంలోనే ప్రజ‌ల‌కు వివిధ రూపాల్లో హామీల‌ను ఇచ్చారు. వంతెన‌ల నిర్మాణం నుంచి పాఠ‌శాలలు, ర‌హ‌దారులు, బిల్డింగులు ఇలా అనేక హామీల‌ను గుప్పించారు. దీంతో ప్రజ‌లు కూడా వైసీపీ వైపు మొగ్గు చూపారు. దీంతో రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడింది. ఈ ప్రభుత్వం ఏర్పడి దాదాపు ఆరో మాసం కూడా పూర్తి కావ‌స్తోంది.

నిధులు లేక….

అయితే, ఇప్పటి వ‌రకు రాష్ట్రంలోని వైసీపీ ఎమ్మెల్యేలు గెలిచిన నియోజ‌క‌వ‌ర్గాల్లో ఎక్కడా అభివృద్ది అనే మాట కానీ, ఒక్క కార్యక్రమం కానీ చేప‌ట్టిన ప‌రిస్థితి లేకుండా పోయింది. ఏ ప‌ని చేయాలన్నా నిధులు ముఖ్యం. కానీ, ఇప్పుడు ఎమ్మెల్యేల‌కు నిధులు లేక‌పోవ‌డంతో ఇటు ప్రజ‌ల నుంచి ఆరోప‌ణ‌లు, మ‌రోప‌క్క ప్రతి ప‌క్షాల నుంచి విమ‌ర్శలు ఎదుర్కొనాల్సి వ‌స్తోంది. పోనీ.. ప్రభుత్వం నుంచి నిధులు తీసుకుందామన్నా.. ఎక్కడా ప్రభుత్వంతో మాట్లాడే ప‌రిస్థితి కూడా లేకుండా పోయింది. ఫ‌లితంగా ఎక్కడి అభివృద్ధి అక్కడే నిలిచి పోవ‌డంతో ఎమ్మెల్యేలు తీవ్ర ఆవేద‌న వ్యక్తం చేస్తున్నారు.

సంస్కరణలు, పథకాలు….

సీఎం జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి తొలి ఆరు నెల‌ల్లో కేవ‌లం సంస్కర‌ణ‌ల మీదే ఎక్కువుగా కాన్‌సంట్రేష‌న్ చేస్తూ వ‌చ్చారు. ప‌రిపాల‌న‌లో మార్పులు, గ్రామ స‌చివాల‌యాల ఏర్పాటు, మ‌ద్యం పాల‌సీతో పాటు అమ్మ ఒడి అమ‌లు ఇలా అనేక ప‌థ‌కాల‌పై దృష్టి సారిస్తున్నాడు. ఇక నియోజ‌క‌వ‌ర్గాల్లో అభివృద్ధి ప‌నుల నిధుల కోసం అర్రులు చాస్తోన్న వైసీపీ ఎమ్మెల్యేలు ఇప్పుడు ఝంజాట‌ంలో ఉన్నారు. వీళ్ల బాధ‌లు ఎవ్వరూ ప‌ట్టించుకోవ‌డం లేదు.

జగన్ ను కలుద్దామన్నా…..

జిల్లాల‌కు చెందిన ఇన్‌చార్జ్ మంత్రులు, ఇత‌ర మంత్రుల‌ను క‌లిసినా ఇప్పుడు నిధులు ఎక్కడ ఉన్నాయ‌న్న స‌మాధానం రావడంతో వైసీపీ ఎమ్మెల్యేలకు త‌మ గోడు ఎవ‌రికి చెప్పుకోవాలో తెలియ‌డం లేద‌ట‌. ఇక సీఎం అపాయింట్ మెంట్ చాలా మందికి దొర‌క‌డం లేదు. ఇక‌, కొద్దొ గొప్పో నోరున్న ఎమ్మెల్యేలు నేరుగా సీఎం జ‌గ‌న్‌ను క‌లిసి త‌మ ఆవేద‌న‌ను వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో కొద్దో గొప్పో నిధుల ప్రయ‌త్నం చేస్తున్నారు. కానీ, సాధార‌ణంగా ఉండే వైసీపీ ఎమ్మెల్యేలు ఈ మాత్రం కూడా అవ‌కాశం ద‌క్కడం లేదు. పోనీలే అని స‌ర్దుకుపోదామ‌న్నా ఇక్కడ ప్రజ‌ల‌కు హామీలు ఇచ్చి ఉండ‌డంతో ఏం చేయాలో తెలియ‌క ఇర‌కాటంలో ప‌డుతున్నారు.

కోటి వస్తాయని……

వాస్తవానికి అసెంబ్లీ తొలి సెష‌న్‌లోనే జ‌గ‌న్‌.. స‌భ‌లో ఒక హామీ ఇచ్చారు. ప్రతి ఎమ్మెల్యేకీ త‌మ ప్రభుత్వం ఏడాదికి కోటి రూపాయ‌లు ఇస్తుంద‌ని నియోజ‌క వ‌ర్గంలో అభివృద్ధి చేసుకోవ‌చ్చని ఆయ‌న సూచించారు. దీనికి సంబంధించి ఇటీవ‌ల ప్రతిపాద‌న కూడా మంత్రి వ‌ర్గ భేటీలో చ‌ర్చకు వ‌చ్చింది. అయితే రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితి బాగోక పోవ‌డంతోనే జ‌గ‌న్ ఈ విష‌యంలో ఆలోచించి నిర్ణయం తీసుకునేందుకు నిర్ణయించార‌ని స‌మాచారం. అయితే, కొత్త ప్రభుత్వం కొలువుదీరి ఆరు మాసాలు అవుతుండ‌డంతో స‌హ‌జంగానే ఉండే తొంద‌ర ఎమ్మెల్యేల‌ను ఇర‌కాటంలోకి నెడుతోంది.

Tags:    

Similar News