ఫైర్ బ్రాండ్లకు నో ఎంట్రీయేనట

చిత్తూరు వైసీపీలో ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ సాగుతోంది. కీల‌క‌మైన నాయ‌కులు ఈ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. ముఖ్యంగా ఫైర్ బ్రాండ్లుగా గుర్తింపు సాధించిన రోజా, చెవిరెడ్డి భాస్కర‌రెడ్డి, [more]

Update: 2020-02-04 12:30 GMT

చిత్తూరు వైసీపీలో ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ సాగుతోంది. కీల‌క‌మైన నాయ‌కులు ఈ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. ముఖ్యంగా ఫైర్ బ్రాండ్లుగా గుర్తింపు సాధించిన రోజా, చెవిరెడ్డి భాస్కర‌రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి వంటి ప‌లువురు మంత్రి వ‌ర్గంలో బెర్తులు ఆశించారు. అయితే, జ‌గ‌న్ కు అత్యంత స‌న్నిహితుడైన పుంగ‌నూరు ఎమ్మెల్యే, సీనియ‌ర్ నాయ‌కుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మాత్రమే ఈ అవ‌కాశం ద‌క్కింది. నిజానికి పార్టీ కోసం పెద్దిరెడ్డితో స‌మానంగా రోజా, చెవిరెడ్డి కూడా క‌ష్టప‌డ్డారు. దీంతో వారు ఆశ‌లు పెట్టుకోవ‌డం స‌హ‌జమ‌నే భావ‌న క‌లిగింది. అయితే, ఇంత మంది రెడ్లకు అవ‌కాశం క‌ల్పిస్తే మిగిలిన వ‌ర్గాల‌కు ప్రాతినిధ్యం త‌గ్గడంతో పాటు ప్రభుత్వంపై వ్యతిరేక భావ‌న క‌లుగుతుంద‌ని జ‌గ‌న్ భావించారు.

నామినేటెడ్ పదవులిచ్చి…..

ఈ క్రమంలో జ‌గ‌న్ సీనియ‌ర్ నాయ‌కుడైన పెద్దిరెడ్డికి మంత్రి వ‌ర్గంలో చోటు క‌ల్పించారు. మిగిలిన చెవిరెడ్డి, రోజాకు నామినేటెడ్ ప‌దవుల‌ను ఇచ్చారు. ఇంత‌వ‌ర‌కు బాగానే ఉన్నా.. ఇటీవ‌ల అటు చంద్రగిరిలోనూ, ఇటు న‌గ‌రిలోనూ ఈ ఇద్దరు నాయ‌కుల‌కు స్థానిక కార్యక‌ర్తలు స‌న్మానం చేశారు. వేర్వేరు రోజుల్లోనే ఈ కార్యక్రమాలు జ‌రిగినా వీటికి ప్రాధాన్యం మాత్రం పెరిగింది. ఈ సందర్భంగా మాట్లాడిన కొంద‌రు సీనియ‌ర్ కార్యక‌ర్తలు త్వర‌లోనే త‌మ నాయ‌కుల‌ను మంత్రులుగా చూడాల‌ని ఉంద‌ని అభిలాష వ్యక్తం చేశారు. దీనికి అటు చెవిరెడ్డి, ఇటు రోజాలు ఇద్దరూ కూడా మురిసిపోయారు.

విస్తరణ జరిగినా….

కార్యక‌ర్తల అభీష్టం త్వర‌లోనే తీరుతుంద‌ని చెప్పారు. ఇక‌, ఈ ప‌రిణామాల త‌ర్వాత జిల్లాలో జోరుగా చ‌ర్చ కొన‌సాగుతోంది. చెవిరెడ్డి, రోజాల‌కు మంత్రి ప‌ద‌వులు ల‌భించే అవ‌కాశం ఉందా ? అనేదే ఈ చ‌ర్చల ప్రధాన కాన్సెప్ట్‌. ప్రస్తుతం ఏడు మాసాలు ముగిసిన జ‌గ‌న్ పాల‌న‌లో మ‌రో రెండేళ్లక‌న్నా త‌క్కువ‌లో నే ఆయ‌న చెప్పిన‌ట్టే మంత్రి వ‌ర్గాన్ని తిరిగి విస్తరించాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే వీరికి న్యాయం జ‌రుగుతుంద‌ని అనుకునేవారికి ఈ చ‌ర్చల్లో త‌గిన రీజ‌న్ క‌నిపించ‌లేదు. ఎంద‌కంటే.. రెండేళ్ల త‌ర్వాత మంత్రి వ‌ర్గ విస్తర‌ణ జ‌రిగినా టాప్ టెన్ మంత్రుల్లో ఇదే జిల్లాకు చెందిన పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి ఉన్నారు.

వచ్చినా ఒక్కరికే….

సో.. మంత్రి వ‌ర్గ విస్తర‌ణ జ‌రిగిన‌ప్పటికీ ఈయ‌న‌ను మార్చేందుకు జ‌గ‌న్ సాహ‌సించ‌రు. సో దీంతో రోజా, చెవిరెడ్డిల‌కు ఆశాభంగ‌మేన‌ని అంటున్నారు. పోనీ ఒక‌వేళ మార్చినా ఈ ఇద్దరిలో ఒక్కరికి మాత్రమే ఆ ఛాన్స్ ద‌క్కుతుంద‌ని అంటున్నారు. వీరిలోనూ చెవిరెడ్డికే మెజారిటీ ఉంటుంద‌ని భావిస్తున్నారు. పైగా ఈ ఇద్దరికీ కూడా కీల‌క‌మైన నామినేటెడ్ ప‌ద‌వుల‌నే జ‌గ‌న్ అప్పగించ‌డం విశేషం. సో.. దీంతో ఈ ఇద్దరి విష‌యం చిత్తూరులో చ‌ర్చకు దారితీసింది.

Tags:    

Similar News