వేవ్ ఎటు తిరుగుతోంది?

రాజ‌కీయం ఖిల్లా ప‌శ్చిమ గోదావ‌రిలో అధికార పార్టీ ప‌రిస్థితి ఎలా ఉంది? ఒక‌ప్పుడు టీడీపీకి కంచుకోట‌గా ఉన్న ఈ జిల్లాలో 2014లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో వైసీపీ బోణీ [more]

Update: 2019-10-28 15:30 GMT

రాజ‌కీయం ఖిల్లా ప‌శ్చిమ గోదావ‌రిలో అధికార పార్టీ ప‌రిస్థితి ఎలా ఉంది? ఒక‌ప్పుడు టీడీపీకి కంచుకోట‌గా ఉన్న ఈ జిల్లాలో 2014లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో వైసీపీ బోణీ కూడా కొట్టలేదు. క‌నీసం ఒక్కటంటే ఒక్క చోట కూడా గెలుపు గుర్రం ఎక్కలేక పోయింది. దీంతో ఇక్కడ పార్టీ పూర్తిగా నిర్వేదంలో మునిగిపోయింది. అయితే, జ‌గ‌న్ ఎన్నిక‌ల‌కు ముందు నిర్వహించిన ప్రజాసంక‌ల్ప యాత్ర ద్వారా ఇక్కడ జోష్ తీసుకు వ‌చ్చారు. న‌వ‌ర‌త్నాల హామీలు గుప్పించారు. దీంతో 2019 ఎన్నిక‌ల స‌మ‌యానికి ఇక్కడ సైలెంట్ వేవ్ ఏర్పడింది. వైసీపీకి సానుకూలంగా రాజ‌కీయ ప‌వ‌నాలు ఊపందుకున్నాయి.

ఐదునెలల కాలంలో….

ఈ క్రమంలోనే ఈ ఏడాది జ‌రిగిన సార్వత్రిక ఎన్నిక‌ల్లో జిల్లాలో వైసీపీ విజ‌యం ఢంకా మోగించింది. మొత్తం 2 ఎంపీ స్థానాలు, 13 ఎమ్మెల్యే స్థానాల్లో గెలుపు గుర్రం ఎక్కింది. అప్పటి వ‌ర‌కు త‌మ‌కు తిరుగులేద‌ని అనుకున్న టీడీపీ కేవ‌లం ఉండి, పాల‌కొల్లు సీట్లకే ప‌రిమిత‌మైంది. దీంతో ఇప్పుడు వైసీపీ ప‌రిస్థితి ఏంటి? ఐదు నెల‌ల జ‌గ‌న్ పాల‌పై జిల్లా ప్రజ‌లు ఏమ‌నుకుంటున్నారు? ప్రజ‌లు ఇచ్చిన భారీ మెజారిటీని ఎంజాయ్ చేస్తున్న వైసీపీ ఇక్కడి ప్రజ‌ల‌కు ఏంచేస్తోంద‌నే విష‌యంపై స‌ర్వత్రా చ‌ర్చ సాగుతోంది. వాస్తవానికి ప్రభుత్వం ఏర్పడిన వెంట‌నే ఇసుక మాఫియాకు అడ్డుక‌ట్టవేయాల‌నే ఉద్దేశంతో జ‌గ‌న్ ప్రభుత్వం ఇసుక‌ను నిలిపి వేసింది.

కొంత మెరుగ్గా…..

దీంతో ప‌శ్చిమలో భ‌వన నిర్మాణాలపై ఆధార‌ప‌డిన వేలాది మంది కార్మికులు రోడ్డున ప‌డ్డారు. రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారులు కూడా ఖాళీ అయిపోయారు. ఎక్కడి ప్రాజెక్టులు అక్కడే నిలిచిపోయాయి. అదే స‌మ యంలో వ‌ర‌ద‌లు ముంచెత్తడంతో రైతులుకూడా ఇబ్బందుల్లో కూరుకుపోయారు. ఈ క్రమంలో వైసీపీ ప్రభుత్వంపై ప్రజ‌లు కారాలు మిరియాలు నూరారు. అయితే, ఇంత‌లోనే రెండు నెల‌ల కింద‌ట ఆగ‌స్టులో చేప‌ట్టిన గ్రామ వలంటీర్‌, స‌చివాల‌య ఉద్యోగాల‌తో ఈ జిల్లాలో భారీ ఎత్తున యువ‌త ఉద్యోగాలు కైవ‌సం చేసుకుంది. దీంతో కొంత మేర‌కు వ్యతిరేక‌త త‌గ్గింది. ఇక‌, తాజాగా జ‌గ‌న్ ప్రతిష్టాత్మకంగా చేప‌ట్టిన వైఎస్సార్ రైతు భ‌రోసా కార్యక్రమం కూడా ఇక్కడ పుంజుకుంది. ఇది వైసీపీకి చాలా ప్లస్ అయ్యింది.

పథకాల అమలుతో…..

ఈ ప‌థ‌కం కింద అటు కేంద్ర నిధులు ఐతేనేంటి, రాష్ట్ర ప్రభుత్వ సాయం అయితే నేంటి .. మొత్తంగా రైతుల ఖాతాల్లో రు. 9500 ప‌డే స‌రికి కొంత జోష్ పెరిగింది. నిన్న మొన్నటి వ‌ర‌కు ఇబ్బందుల్లో ఉన్న రైతాంగం తాజాగా వైఎస్సార్ రైతు భ‌రోసాతో ఆనందం ఏర్పడింది. అటు యువ‌త‌కు, రైతుల‌కు ఆనందంగా ఉంది. అయితే, రియ‌ల్టర్లు అన్ హ్యాపీగా ఉన్నారు. దీంతో వైసీపీ ప‌రిస్థితి కొంత తీపి, కొంత కారం అనే చందంగా మారిపోయింది. అయితే, ఇక్కడి ప‌రిస్థితుల‌ను గ‌మ‌నిస్తున్న వైసీపీ నాయ‌కులు రాబోయే రోజుల్లో ప్రభుత్వం అమ‌లు చేసే కార్యక్రమాల ద్వారా పార్టీ పుంజుకుంటుంద‌నే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

మంత్రి పదవులు దక్కినా….

ఇక వైసీపీ పార్టీ ప‌రంగా చూస్తే జిల్లాకు మూడు మంత్రి ప‌ద‌వులు ద‌క్కాయి. డిప్యూటీ సీఎం ఆళ్ల నానితో పాటు తానేటి వ‌నిత‌, చెరుకువాడ శ్రీరంగ‌నాథ రాజు కూడా మంత్రులుగా ఉన్నారు. తాజాగా దెందులూరు ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌద‌రితో పాటు పోల‌వ‌రం ఎమ్మెల్యే తెల్లం బాల‌రాజుకు పార్టీ అధికార ప్రతినిధి ప‌ద‌వులు ద‌క్కాయి. ఇక ఇప్పుడిప్పుడే కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో అసంతృప్త జ్వాల‌లు కూడా స్టార్ట్ అయ్యాయి.

Tags:    

Similar News