విశాఖ జనం విని విని విసిగిపోయారా…?

అవును మరి జగన్ చెప్పిన అన్ని హామీలు బాగానే అమలవుతున్నాయి. కానీ కొన్ని కీలకమైనవి అతి ముఖ్యమైనవి మాత్రం అలాగే ఆగిపోయాయి. అందులో అతి ప్రధాన‌మైనది విశాఖకు [more]

Update: 2021-01-03 11:00 GMT

అవును మరి జగన్ చెప్పిన అన్ని హామీలు బాగానే అమలవుతున్నాయి. కానీ కొన్ని కీలకమైనవి అతి ముఖ్యమైనవి మాత్రం అలాగే ఆగిపోయాయి. అందులో అతి ప్రధాన‌మైనది విశాఖకు పరిపాలనా రాజధాని. ఇదిపుడు జగన్ కి మెల్లగా వ్యతిరేకతను తెచ్చిపెట్టేలా కనిపిస్తోంది. ఎవరూ అడగకుండానే లడ్డూ కావాలా బాబూ అన్న టైపులో జగన్ రాజధానిగా మెగా సిటీని చేస్తామంటూ బోల్డ్ స్టేట్ మెంట్ ఇచ్చేశారు. ఈ ప్రకటనకు అక్షరాలా తొలి వార్షికోత్సవం జరిగింది. ఎప్పుడు మరి ఎప్పుడు అంటూ జనమంతా కాచుకుని కూర్చున్నారు.

అదిగో అల్లదిగో….

విశాఖ రాజధాని అంటూ ఒక ఏడాది కాలం ఇట్టే గడిపేసారు వైసీపీ నేతలు. విశాఖలో మకాం వేసిన వైసీపీ ఎంపీ జగన్ కుడి భుజం విజయసాయిరెడ్డి ఎపుడు మీడియా ముందుకు వచ్చిన విశాఖ రాజధాని త్వరలో విడుదల అంటూ షరా మామూలు స్టేట్ మెంట్ ఇస్తున్నారు. మొదట్లో దానికి జనాల్లో ఆసక్తి కనిపించినా ఇపుడు మాత్రం ఎవరూ పెద్దగా పట్టించుకోవడంలేదు. అందుకే విశాఖ పాలనా రాజధాని అంటూ జగన్ ప్రకటన చేసి ఏడాది అయిన సందర్భంగా వైసీపీ శ్రేణులు హడావుడి చేస్తే జనం నుంచి పెద్దగా స్పందన రాలేదు.

రాజకీయం అంతేగా…?

విశాఖ రాజధాని అవుతుందని టీడీపీ నుంచి కూడా పెద్ద ఎత్తున మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు వైసీపీలో చేరి జై విశాఖ అనేశారు. తాము టీడీపీని ఏ విషయంలోనూ వ్యతిరేకించడం లేదని విశాఖ రాజధానిగా వస్తూంటే అడ్డుకున్నందుకే ఆ పార్టీని వీడి వైసీపీకి మద్దతు ఇస్తున్నామని మాజీ తమ్ముళ్ళు ఆనాడు చెప్పిన మాట. మరి వారు అటు నుంచి ఇటు చేరినా కూడా విశాఖకు రాజధాని మాత్రం అయిపూ అజా లేదు. పైగా కేసుల మీద కేసులు, కోర్టులో న్యాయ విచారణలతో అసలు సీన్ మెల్లగా అర్ధమయ్యాక వారెవరూ ఇపుడు వైసీపీలో ముందుకు వచ్చి క్యాపిటల్ గా వైజాగే కావాలి అని సౌండ్స్ చేయడంలేదు.

ఈజీ కాదటగా…?

జగన్ చేతిలో ఏమీ లేదు, జగన్ విశాఖకు రాజధాని తేలేడు అన్నది విశాఖలోని సగటు జనం లో చర్చకు వస్తున్న మాట. రాజధాని అంటే అంత ఈజీ కాదటగా అన్న మాటలు కూడా వినిపిస్తున్నాయి. జగన్ అసెంబ్లీలో విశాఖకు రాజధాని అని ప్రకటించిన నాడు అంతా గట్టిగానే నమ్మారు. కానీ ఇపుడు కాలం గడుస్తున్న కొద్దీ తత్వం బోధపడ్డాక విశాఖకు రాజధాని వస్తే గిస్తే అది అద్భుతమేనని సాదర జనం అనుకుంటున్నారు. ఇక విశాఖ రాజధాని అవుతుందని ఆశపడిన పెట్టుబడిదారీ వర్గాలు, రియల్ ఎస్టేట్ వర్గాలు కూడా వైసీపీకి నాడు జై కొట్టాయి. ఇపుడు వారంతా ఎందుకొచ్చిన ఈ రాజధాని రాజకీయం రొచ్చు అనుకుంటూ న్యూట్రల్ అయిపోయారు. మొత్తానికి విశాఖలోని అన్ని వర్గాల జనం రాజధాని విషయంలో పూర్తిగా విసిగిపోయారనే చెప్పాలి.

Tags:    

Similar News