టీడీపీకి దెబ్బ కొట్టే ప్లాన్ … ?

రాజకీయం అంటేనే కులాల సమాహారం. సామాజిక వర్గాల అండా దండా ఎవరికి మెండుగా దక్కుతుందో వారే జెండా ఎగరవేస్తారు. అది కాంగ్రెస్ అయినా టీడీపీ, వైఎస్సార్ కాంగ్రెస్ [more]

Update: 2021-06-07 13:30 GMT

రాజకీయం అంటేనే కులాల సమాహారం. సామాజిక వర్గాల అండా దండా ఎవరికి మెండుగా దక్కుతుందో వారే జెండా ఎగరవేస్తారు. అది కాంగ్రెస్ అయినా టీడీపీ, వైఎస్సార్ కాంగ్రెస్ అయినా ఇదే రాజకీయ గణితం పుస్తకం చదువుకోవాల్సిందే. బీసీలను వెన్నుదన్నుగా చేసుకుని ఇన్నాళ్ళూ టీడీపీ రాజకీయాలు చేసింది. ఇపుడు ఆ బీసీలు వైసీపీ వైపుగా మెల్లగా టర్న్ అయ్యారు. అందువల్లనే ఉత్తరాంధ్రాలో అద్భుతమైన విజయాలు ఆ పార్టీ సొంతం అయ్యాయి.

విడాకులు ఇచ్చేశారా…?

విశాఖలో పాతిక లక్షల మంది జనాభా ఉంటే అందులో మూడవ వంతు యాదవ సామాజిక వర్గం ఉంది. వారే ఎంపీ, ఎమ్మెల్యే సహా అన్ని ఎన్నికల్లోనూ గెలుపుని శాసించేవారుగా ఉంటున్నారు. దీని పసిగట్టిన వైసీపీ తెలివిగా ఆ సామాజికవర్గాన్ని నెత్తిన పెట్టుకుంటోంది. వారికే మేయర్ పదవిని కట్టబెట్టిన వైసీపీ ముందు ముందు మరిన్ని కీలకమైన పదవులు ఇస్తామని చెబుతోంది. ఈ మధ్య జరిగిన విశాఖ కార్పోరేషన్ ఎన్నికల్లో వైసీపీ యాదవ సామాజికవర్గానికి చెందిన 16 మందికి టికెట్లు ఇస్తే అందులో పదమూడు మంది గెలిచారు అంటే ఆ కులం ఎవరి పక్షానా చేరిందో అర్ధమైపోతోందిగా. అదే సమయంలో ఇన్నాళ్ళూ తాము మోసిన టీడీపీకి యాదవులు విడాకులు ఇచ్చేసినట్లే అంటున్నారు.

పెద్ద పీట ఖాయం….

విశాఖ నగర రాజకీయాల్లో యాదవులకే పెద్ద పీట అని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అంటున్నారు. యాదవులు వైసీపీ గెలుపులో భాగంగా ఉన్నారు. వారు పార్టీని అంటిపెట్టుకుని కొనసాగుతున్నారు. అందువల్ల వారి కోసం పార్టీ కూడా చేయాల్సింది అంతా చేస్తుంది అని విజయ‌సాయిరెడ్డి హామీ ఇస్తున్నారు. విశాఖలో మరి కొందరు కీలక నేతలను గుర్తించి రానున్న రోజుల్లో వారికి నామినేటెడ్ పదవులు ఇవ్వాలని కూడా వైసీపీ ఆలోచన చేస్తోంది. అలాగే వారి కోసం ప్రత్యేకంగా విశాఖలో ఒక అద్భుతమైన పార్కుని నిర్మించడమే కాకుండా వారి ఆరాధ్య దైవం శ్రీక్రిష్ణుడి మ్యూజియం ని కూడా ఏర్పాటు చేయడానికి విజయసాయిరెడ్డి హామీ ఇచ్చేశారు. దీని కోసం ఎన్ని నిధులు ఖర్చు అయినా ప్రభుత్వం భరిస్తుంది అని ఆయన చెబుతున్నారు.

ఇదీ డిమాండ్ …?

విశాఖ మేయర్ పదవి చరిత్రలో తొలిసారిగా యాదవులకు దక్కింది. ఇప్పటిదాకా డిప్యూటీ మేయర్ తోనే వారు సంతృప్తి చెందేవారు. తొలిసారిగా వంద వార్డులు ఉన్న విశాఖ వంటి పాలనా రాజధానికి తొలి పౌరుడి పదవిని యాదవులకు కట్టబెట్టడం ద్వారాగా వైసీపీ వ్యూహాత్మకంగా వ్యవహరించింది అని చెప్పాలి. ఇక 13 మంది కార్పోరేటర్లు వైసీపీకి ఆ వర్గం నుంచి ఉన్నారు. రానున్న రోజుల్లో విశాఖ ఎంపీ సీటుతో పాటు రెండు ఎమ్మెల్యే టికెట్లు, రెండు ఎమెల్సీ టికెట్లు, కొన్ని నామినేటెడ్ పదవులు కూడా ఈ సామాజికవర్గం డిమాండ్ చేస్తోంది. వీటిని తీర్చడానికి వైసీపీ అధినాయకత్వం కూడా సిద్ధంగా ఉంది. టీడీపీ నుంచి తమకు బదిలీ అయిన యాదవుల మద్దతుని పది కాలాల పాటు కాపాడుకోవాలని వైసీపీ ఎత్తులు వేస్తోంది. యాదవులు ఒకసారి నమ్మితే దశాబ్దాల పాటు అలాగే మద్దతుగా ఉంటారు. తెలుగుదేశం విషయంలో ఇది రుజువు అయింది. ఇపుడు వైసీపీ వారిని ముందుంచి విశాఖ వంటి సిటీలో రాజకీయాన్ని సానుకూలం చేసుకోవాలనుకుంటోంది. మొత్తానికి అనుకున్నవన్నీ జరిగితే ఈ ప్రాంతం నుంచి కూడా వారిని మంత్రులుగా చూసే రోజు దగ్గరలోనే ఉంది అంటున్నారు.

Tags:    

Similar News