ఆర్ధిక మూలాలే కూలుస్తున్నారా..?

ఏపీలో రాజకీయం ఒక యాక్షన్ సినిమాను తలపిస్తోంది. ఎవరూ వెనక్కి తగ్గని రెండు పార్టీల నడుమ జరుగుతున్న పోరు ఇది. 2019 ఎన్నికల్లోనే టీడీపీని ఎలిమినేట్ చేసిన [more]

Update: 2020-10-31 14:30 GMT

ఏపీలో రాజకీయం ఒక యాక్షన్ సినిమాను తలపిస్తోంది. ఎవరూ వెనక్కి తగ్గని రెండు పార్టీల నడుమ జరుగుతున్న పోరు ఇది. 2019 ఎన్నికల్లోనే టీడీపీని ఎలిమినేట్ చేసిన వైసీపీకి ఇపుడు ఆ పార్టీలో ఉన్న అరకొర మూలాలను కూడా లేకుండా చేయాలన్న పట్టుదల అలా గట్టిగా పెరిగిపోతోంది. అందులో భాగంగా అమరావతి రాజధాని మూడు ముక్కలు కావడంగా చూడాలి. అలా ఒక సామాజికవర్గం తిరిగి లేవకుండా చావు దెబ్బ తీసిన ఈ రాజకీయ మంత్రాంగం ఇపుడు కాబోయే రాజధాని విశాఖ‌లో కూడా ఆ వర్గం గుత్త పెత్తనానికి చెక్ చెప్పే దిశగా దూకుడుగా సాగుతోంది అంటున్నారు.

రెండవ బెజవాడ …..

విశాఖను ఒక సామాజికవర్గం వారు రెండవ బెజవాడ అని ముద్దుగా పిలుచుకుంటారు. వారంతా నాలుగు దశాబ్దాలుగా విశాఖలో సెటిల్ అయిపోయారు. ఆర్ధికంగా, సామాజికంగా రాజకీయంగా విశాఖ సిటీని శాసిస్తున్నారు. అందుకు సాక్ష్యం మూడు దశాబ్దాలుగా విశాఖ నగరంలో నాన్ లోకల్ ఎంపీ తప్ప లోకల్ కార్డ్ ఊసే లేదు. ఇక పెట్టుబడులు పెట్టి గెలుస్తున్నారు. వ్యాపారాలను విస్తరించుకుంటున్నారు. ఒక విధంగా విశాఖ వారికి వ్యాపార రాజధాని, అటువంటి చోట పాలనారాజధానిగా వైసీపీ ప్రతిపాదించినా వారి డామినేటింగ్ రోల్ ని తట్టుకోవడం బహు కష్టం. అందుకే ఇపుడు విశాఖలో కొత్త వ్యూహాలు అమలుచేస్తున్నారు అంటున్నారు.

ఆపరేషన్ విశాఖ ….

విశాఖలో రేపటి రోజున మరో సామాజికవర్గం పెత్తనం కోసం అర్రులు చాచుకుని కూర్చుంది. ఇప్పటికే వారి ఆనవాళ్ళు ఉన్నా మొదటి సామాజికవర్గం అంత బలంగా లేరు. పైగా విశాఖలో రాజకీయంగా వారికి పట్టు దొరకడంలేదు. దాంతో బలమైన మొదటి సామాజికవర్గానికి చుక్కలు చూపించి వచ్చిన దారే చూపిస్తేనే తమకు చోటు ఉంటుందని ఆశిస్తున్నారు. దాంతో వారి మీద గట్టి దెబ్బ పడుతోంది. మామూలుగానే భూ ఆక్రమణలు అంటే రాజకీయ నాయకునికి సహజమైన హక్కుగా చూస్తారు. మరి దానికి ఇంత పెద్ద ఎత్తున హంగామా చేయాలా అంటే దానికి జవాబు వేరేగా దొరుకుతుంది. ఆధిపత్య పోరు పీక్స్ కి చేరుకున్నాక లాజిక్కులు ఉండవు. మొహమాటాలు అసలు ఉండవు. అందుకే లోడెత్తి మరీ ఫైటింగ్ కి దిగిపోతున్నారు అంటున్నారు.

గుప్పిట పట్టాల్సిందే ….

విశాఖను పదహారేళ్ల పడుచు పిల్ల అనుకుంటే దాని కోసం ఇద్దరు మధ్యన భీకరమైన పోరు సాగుతోంది అనుకోవాలి. ఇంతకాలం తమ ఆధీనంలో ఉంచుకున్న వారి నుంచి గుంజుకునే సమరంలోనే ఇవన్నీ జరుగుతున్నాయని కూడా చెబుతున్నారు. వీటికంతటికీ కారణం విశాఖలో పుట్టి పెరిగిన సిసలైన భూమి పుత్రులకు రాజకీయంగా తమ సొంత ప్రాంతంలో బలం లేదు, ఆర్ధికంగా వారికి స్థిరం లేదు. అందుకే నాన్ లోకల్ పాలిటిక్స్ రంజుగా సాగుతోంది. రెండు పార్టీలు, రెండు సామాజిక వర్గాల మధ్య్న రంజైన పోరుగా విశాఖ మైదానం మారుతోంది అని కూడా అంటున్నారు. ఈ పోరులో విజేతలు ఎవరు అయినా కానీ స్థానికుడు మాత్రం ఆటలో అరటిపండే. అతను పోటీలోకి రాకుండా ఎపుడో ఓడిపోయాడు.

Tags:    

Similar News