ఈసారి ఉత్తరాంధ్రలో ఎంపీ జగన్ ఇంటి నుంచేనా ?

విశాఖ ఎంపీ విషయంలో పార్టీలో విస్తృతంగా చర్చ సాగుతోంది. ఎన్నికలకు సరిగ్గా ఎనిమిది నెలల ముందు పార్టీలో చేరి ఎకా ఎకిన ఎంపీ అయిపోయిన లక్కీ ఫెలో [more]

Update: 2021-01-09 14:30 GMT

విశాఖ ఎంపీ విషయంలో పార్టీలో విస్తృతంగా చర్చ సాగుతోంది. ఎన్నికలకు సరిగ్గా ఎనిమిది నెలల ముందు పార్టీలో చేరి ఎకా ఎకిన ఎంపీ అయిపోయిన లక్కీ ఫెలో గా ఎంవీవీ సత్యనారాయణను చెప్పుకుంటారు. అంతకు ముందు ఆయన కొన్ని చిన్న సినిమాలు తీశారు, అలాగే బిల్డర్ గా ఉన్నారు. పెద్దగా విశాఖ జనాలకు తెలియని ఎంవీవీ హఠాత్తుగా రాజకీయ అరంగేట్రం చేయడం ఎంపీ కావడం అంటే అది పూర్తిగా రాజకీయ తమాషాగానే చూడాలి అంటారు. ఇక ఎంపీగా ఎంవీవీ గెలిచినా కూడా పనితీరులో తనదైన మార్క్ ని ఇప్పటిదాకా చూపించలేకపోయారు అన్న విమర్శలు ఉన్నాయి.

అసలు నమ్మట్లేదుగా…?

మరో వైపు చూసుకుంటే ఎంవీవీ సత్యనారాయణ తనకంటూ సొంత రాజకీయాన్ని మొదలుపెట్టారు. ఆయన పార్టీలో ఉంటూనే తానుగానే తన బిజినెస్ లతో పాటు, తన వ్యక్తిగత పరిచయాల‌కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు అని పార్టీలోనే విమర్శలు ఉన్నాయి. ఆయన వృత్తి పరంగా బిల్డర్ కావడంతో దానికే ప్రయారిటీ ఇస్తున్నారు అంటున్నారు. దాంతో పాటు ఆయనకు టీడీపీతోనూ మంచి సంబంధాలు ఏర్పడ్డాయి. అలాగే బీజేపీ నేతలతోనూ సాన్నిహిత్యాన్ని నెరుపుతున్నారు. ఈ మధ్య ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు విశాఖకు విడిది చేస్తే ఆయన వెళ్ళి కలవడంపైన కూడా కొంత చర్చ సాగింది. మరో వైపు మాజీ ఎంపీ బీజేపీ నేత కంభంపాటి హరిబాబుతో కూడా క్లోజ్ గా ఉంటారు అంటారు.

ఈసారి కచ్చితంగా నో….

ఇక విశాఖ తూర్పు ఎమ్మెల్యే, టీడీపీకి చెందిన వెలగపూడి రామకృష్ణ బాబుతో కూడా ఎంవీవీకి మంచి దోస్తే ఉందని కూడా అంటారు. ఇలా పార్టీ లైన్ ఒకలా ఉంటే ఎంవీవీ వేరేగా ఉండడం మీద కూడా చర్చ సాగుతోంది. ఆయనకు కూడా కొంత అసంతృప్తి పార్టీ మీద ఉందిట. ఎంపీగా తాను ఉంటే రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి విశాఖలో అన్నింటా హైలెట్ కావడాన్ని ఆయన తట్టుకోలేకపోతున్నారు అని అంటారు. ఇక పార్టీ అధికారంలో ఉన్నా కూడా ఆంక్షలు పెట్టడంతో ఒక బిల్డర్ గా కూడా ఆయన అసంతృప్తిగా ఉన్నారని చెబుతున్నారు. మళ్ళీ వైసీపీ ఆయనకు టికెట్ ఇస్తుందా అంటే ఉత్త మాటేనని పార్టీలోనే అంటున్నారు. ఆ సంగతి తెలిసే ఎంపీ తన రూట్ లో తాను వెళ్తున్నారు అని అంటున్నారు.

వైసీపీ ఫ్యామిలీ నుంచే….

ఈసారి విశాఖ ఎంపీ అభ్యర్ధి కచ్చితంగా వైసీపీ ఫ్యామిలీ నుంచే ఉంటారని అంటున్నారు. మూడు వంతులు వైఎస్ జగన్ సోదరి షర్మిల విశాఖ నుంచి పోటీ చేస్తారని అంటున్నారు. 2014 ఎన్నికల్లో తల్లి విజయమ్మ పోటీ చేసి ఓడిపోయారని, ఈసారి మాత్రం విశాఖలో జెండా ఎగరేయాల్సిందేనన్న పట్టుదల జగన్ ది అంటున్నారు. దాంతో షర్మిల విశాఖ ఎంపీ అవుతారంటూ ప్రచారం అయితే ఉంది. రాజధానిగా ఉన్న విశాఖ నుంచి తన సొంత కుటుంబీకులే ఎంపీగా ఉండాలని జగన్ గట్టిగా డిసైడ్ అయ్యారని అంటున్నారు. ఒకవేళ ఆమె కాకపోతే సొంత బాబాయ్ వైవీ సుబ్బారెడ్డిని అయినా విశాఖ బరిలో దింపుతారు అన్న మాట కూడా వస్తోంది. మొత్తానికి విశాఖ ఎంపీ సీటు మీద ఇప్పటి నుంచే వైసీపీలో హాట్ హాట్ చర్చ సాగుతోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.

Tags:    

Similar News