ఆ ఎన్నికలు జరిగితే పగిలిపోయేది ఎవరికి ?

విశాఖ స్మార్ట్ సిటీ. మెగా సిటీ. మరిప్పుడో ఏకంగా పాలనా రాజధానిగా ప్రకటించారు. న్యాయ వివాదాలు లేకపోతే ఈపాటికి విశాఖలోనే సీఎం మకాం పెట్టి ధూ ధాం [more]

Update: 2021-01-01 11:00 GMT

విశాఖ స్మార్ట్ సిటీ. మెగా సిటీ. మరిప్పుడో ఏకంగా పాలనా రాజధానిగా ప్రకటించారు. న్యాయ వివాదాలు లేకపోతే ఈపాటికి విశాఖలోనే సీఎం మకాం పెట్టి ధూ ధాం గా రోడ్ల మీద టూర్లు వేసేవారు. మరి అటువంటి విశాఖలో మౌలికమైన సదుపాయాల విషయానికి వస్తే ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లుగా పరిస్థితి ఉంది. కనీస సదుపాయలు ముందు కల్పించండి మహాప్రభో అని జనాలు గోల పెడుతున్నారు. జగన్ సర్కార్ వచ్చి ఇప్పటికి ఏడాదిన్నర కాలం గడచిపోయింది. కానీ కానీ క‌నీసం ప్రధానమైన రోడ్లకు ప్యాచ్ వర్కులు కూడా చేయించలేదు అన్న మాట అయితే గట్టిగానే ఉంది. జీవీఎంసీ వద్ద నిధులు లేవు. రాష్ట్ర ప్రభుత్వం అసలు పట్టించుకోవడంలేదు. దాంతో విశాఖ రోడ్లు భారీ ఎత్తున పగుళ్ళతో దర్శనమిస్తున్నాయి.

అదే మైనస్ గా….

విశాఖ కార్పొరేషన్ ఎన్నికలు జరిగితే మాదే విజయం అని జబ్బలు చరచుకుంటున్న అధికార పార్టీ కనీసం రోడ్ల దుస్థితిని పట్టించుకోవడంలేదని నగరవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జగన్ వచ్చాక వానలు బాగా కురిసాయి. అంతటితో సంతోషం అనుకుంటే రోడ్లన్నీ వానలకు, వరదలకూ పూర్తిగా పాడైపోయి గుంటలు పడిపోయాయి. ఎటు చూసినా మెయిన్ రోడ్లే అతుకుల గతుకుల మయంగా ఉన్నాయి. దీంతో విశాఖ రోడ్ల విషయంలో ప్రభుత్వం వెంటనే శ్రద్ధ పెట్టకపోతే రానున్న జీవీఎంసీ ఎన్నికలలో వైసీపీకి అదే అతి పెద్ద మైనస్ పాయింట్ అవుతుందని అంటున్నారు.

బీజేపీ పిలుపుతో …

అద్వాన్నమైన రోడ్ల అంశాన్ని బీజేపీ పొలిటికల్ అజెండాగా మార్చుకుంది. విశాఖలో తన బలాన్ని పెంచుకునేందుకు బీజేపీ ఏకంగా రోడ్ల మీద పడింది. ఏ రోడ్డు చూసినా ఏముంది గర్వకారణం పాలకుల ఉదాశీనతకు అదే అచ్చమైన నిదర్శనం అంటూ బీజేపీ నేతలు చేస్తున్న విమర్శలకు వేస్తున్న సెటైర్లకు వైసీపీ నుంచి కనీసం బదులు చెప్పే సీన్ కూడా లేకుండా ఉంది. మరో వైపు మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు లాంటి వారు ఇదే అంశాన్ని రాజకీయ అస్త్రంగా చేసుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీ ఏలుబడిలో విశాఖ ఇంత దారుణంగా ఉందా అంటూ టీడీపీ తమ్ముళ్ళు వేస్తున్న ప్రశ్నలు జనాలకు బాగానే తాకుతున్నాయి. దాంతో వైసీపీకి ఉత్తి పుణ్యానికే భారీ వ్యతిరేకత వచ్చేలా ఉంది.

ఆ పని చేస్తేనే ….?

కొత్త ఏడాదిలో ఎన్నికలకు వెళ్తామని చెబుతున్న వైసీపీ పెద్దలు ముందు అర్జంటుగా విశాఖ రోడ్లను అభివృద్ధి చేయాల్సిందేనని డిమాండ్ వచ్చి పడుతోంది. అది జరగకుండా వారు ఎన్నికలకు వెళ్తే మాత్రం పగిలిన రోడ్ల సాక్షిగా అది పెద్ద దెబ్బ వైసీపీకి పడడం ఖాయమని అంటున్నారు. మరో వైపు పాలనారాజ‌ధాని అంటూ తెగ ఊదరగొట్టడం కూడా బూమరాంగ్ అవుతోంది. ఉన్న రోడ్లకే దిక్కు లేదు, ఇపుడు రాజధాని వస్తే ఏం చేస్తారూ అంటూ జనం కూడా రివర్స్ అవుతున్నారు. మరి పగిలిన రోడ్లలో తమ భవిష్యత్తును చూసుకుంటారో లేక విశాఖలో కనీస మౌలిక సదుపాయాల మీద దృష్టి సారిస్తారో అధికార పార్టీయే తేల్చుకోవాలని జనాలు అంటున్నారు.
.

Tags:    

Similar News