ఒకరికి ఒకరు చెక్.. విజయం ఎవరిదో?

రాజ‌కీయాల్లో ఎప్పుడు ఏది పైచేయి అవుతుంది? ఎవ‌రు ఆధిప‌త్యం చ‌లాయిస్తారు ? అనే విష‌యాల‌పై క్లారిటీ ఇవ్వడం కుద‌ర‌దు. ఎవ‌రికి సానుకూల ప‌వ‌నాలు వీస్తే వారే వ్యూహాత్మకంగా [more]

Update: 2020-04-02 05:00 GMT

రాజ‌కీయాల్లో ఎప్పుడు ఏది పైచేయి అవుతుంది? ఎవ‌రు ఆధిప‌త్యం చ‌లాయిస్తారు ? అనే విష‌యాల‌పై క్లారిటీ ఇవ్వడం కుద‌ర‌దు. ఎవ‌రికి సానుకూల ప‌వ‌నాలు వీస్తే వారే వ్యూహాత్మకంగా పైచేయి సాధిస్తారు. కాక‌లు తీరిన రాజ‌కీయ యోధులు సైతం కాలం కాటేస్తే గ‌ప్‌చుప్ అవ్వాల్సిదే. అదే టైం క‌లిసొస్తే ఎలాంటి రాజ‌కీయ అనుభ‌వం లేని వాళ్లు సైతం అధికార ద‌ర్పం వెల‌గ‌బెడుతుంటారు. ఇప్పుడు అధికార వైసీపీలోనూ ఇదే త‌ర‌హా రాజ‌కీయాలు క‌నిపిస్తున్నాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. విష‌యంలోకి వెళ్తే విజ‌య‌న‌గ‌రం జిల్లాకు చెందిన ఇద్దరు కీల‌క నాయ‌కులు వైసీపీలో రాజ‌కీయ ర‌గ‌డ సృష్టిస్తున్నారు. ఎవ‌రికి వారు త‌మ‌దంటే త‌మ‌దే హ‌వా చ‌లామ‌ణి కావాల‌ని ప్రయ‌త్నిస్తున్నారు. దీంతో రాజ‌కీయాలు రోజుకో ర‌కంగా మ‌లుపు తిరుగు తున్నాయి.

ఇద్దరికీ జగన్ అంటే అభిమానమే అయినా…

విజ‌య‌న‌గ‌రం జిల్లా కు చెందిన సీనియ‌ర్ నాయ‌కుడు, మంత్రి బొత్స స‌త్యనారాయ‌ణ‌, ఇదే జిల్లాకు చెందిన మ‌రో సీనియ‌ర్ నాయ‌కుడు విజ‌య‌న‌గ‌రం ఎమ్మెల్యే కోల‌గ‌ట్ల వీర‌భ‌ద్ర స్వామికి మ‌ధ్య ప‌చ్చగ‌డ్డి వేసినా భ‌గ్గుమ‌నే ప‌రిస్థితి నెల‌కొంది. నిజానికి వీరు గ‌తంలో కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు కూడా ఇదే త‌ర‌హా ప‌రిస్థితి ఉంది. 1999 నుంచి వీరి మ‌ధ్య ఇదే త‌ర‌హా వార్ న‌డుస్తోంది. 2014 ఎన్నిక‌ల్లోనే కోల‌గ‌ట్ల వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అయితే ఆ త‌ర్వాత రాష్ట్ర విభ‌జ‌న‌తో బొత్స కూడా త‌న ఫ్యామిలీతో స‌హా వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇద్దరికీ కూడా జ‌గ‌న్ అంటే అభిమాన‌మే. అయితే, జిల్లా రాజకీయాల్లోకి వ‌చ్చే స‌రికి మాత్రం ఒక‌రిపై ఒక‌రు పైచేయి సాధించాల‌ని చూస్తున్నారు.

బొత్స అడ్డంపడుతుండటంతో….

ఇక వీరి మ‌ధ్య పాత ప‌గ‌లు ఉండ‌నే ఉన్నాయి. నిజానికి వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు కాగానే కోల‌గ‌ట్లకు మంత్రి ప‌ద‌వి ఇవ్వాల‌ని జ‌గ‌న్ భావించారు. అయితే, దీనికి బొత్స అడ్డు ప‌డ్డార‌ని ప్రచారం జ‌రిగింది. అందుకే వైశ్య సామాజిక వ‌ర్గం కోటాలో మంత్రి ప‌ద‌విని వెల్లంపల్లి శ్రీనివాస్‌కు ఇచ్చార‌ని అంటారు. దీంతో అప్పటి వ‌ర‌కు ఇద్దరి మ‌ధ్య ఉన్న విభేదాలు మ‌రింత పెరిగాయి. ఇక‌ ఇటీవ‌ల స్థానిక ఎన్నిక‌ల్లో విజ‌య‌నగరం కార్పొరేష‌న్ మేయ‌ర్ ప‌ద‌విని త‌న కుమార్తె శ్రావ‌ణికు ఇప్పించుకోవాల‌ని కోల‌గ‌ట్ల భావించారు. అయితే, ఈ విష‌యంలోనూ బొత్స అడ్డుప‌డ్డార‌ని ఆయ‌న వ‌ర్గం చెబుతోంది. ఇక్కడి స్థానిక ప‌ద‌వులు అన్నీ కూడా బీసీకి రిజ‌ర్వ్ అయ్యేలా బొత్స చ‌క్రం తిప్పార‌ని అంటున్నారు.

కోలగట్ల అడ్డం తిరిగి……

దీంతో కోల‌గ‌ట్ల ఆశ‌లు రెండోసారి కూడా అడియాస‌ల‌య్యాయి. దీంతో కోల‌గ‌ట్ల వ్యూహాత్మకంగా చ‌క్రం తిప్పి జిల్లా కేంద్రమైన విజ‌య‌న‌గ‌రం కార్పొరేష‌న్‌లో కార్పొరేట‌ర్ సీట్లు అన్ని త‌న‌వారికే టికెట్లు ఇప్పించుకున్నారు. ఈ విష‌యంలో మినిస్టర్ హోదాలో బొత్స ఎంత ప్రయ‌త్నించినా ఫ‌లించ‌లేదు. త‌న వ‌ర్గానికి పది సీట్లు కావాల‌ని అడిగినా కూడా కోల‌గట్ల మాత్రం నా నియోజ‌క‌వ‌ర్గంలో మీ జోక్యం అవ‌స‌రం లేద‌ని చెప్పేశార‌ట‌. ఈ విష‌యంలో బొత్స విజ‌యసాయిరెడ్డితో రిక‌మెండ్ చేసేందుకు ప్రయ‌త్నాలు చేసినా కూడా కోల‌గ‌ట్ల విన‌లేద‌ని స‌మాచారం. దీంతో ఇప్పుడు ఈ ఇద్దరి మ‌రోసారి అగ్గి రాజుకుంది. కోల‌గ‌ట్లను రాజ‌కీయంగా అణిచి వేసేందుకు బొత్స మ‌రిన్ని ప్రయ‌త్నాలు చేస్తున్నార‌న్న టాక్ ఇప్పుడు విజ‌య‌న‌గ‌రం రాజ‌కీయాల్లో జోరుగా వినిపిస్తోంది.

Tags:    

Similar News