బెజవాడలో జగన్ చేసిన అతి పెద్ద తప్పు అదేనట

బెజ‌వాడ వైసీపీలో లుక‌లుక‌లు వినిపిస్తున్నాయి. వాస్తవానికి బెజ‌వాడ రాజ‌కీయం అన‌గానే టీడీపీ గురించి ఎక్కువ‌గా ప్రస్తావిస్తున్నారు. ఆ పార్టీ నేత‌లు ఎక్కువ‌గా ఉండ‌డం, గ‌త ఎన్నిక‌ల‌లో వైసీపీ [more]

Update: 2021-01-02 15:30 GMT

బెజ‌వాడ వైసీపీలో లుక‌లుక‌లు వినిపిస్తున్నాయి. వాస్తవానికి బెజ‌వాడ రాజ‌కీయం అన‌గానే టీడీపీ గురించి ఎక్కువ‌గా ప్రస్తావిస్తున్నారు. ఆ పార్టీ నేత‌లు ఎక్కువ‌గా ఉండ‌డం, గ‌త ఎన్నిక‌ల‌లో వైసీపీ దూకుడు పెంచినా.. బెజ‌వాడ‌లో మాత్రం టీడీపీ హ‌వా సాగ‌డం.. ఎంపీ, ఓ ఎమ్మెల్యే స్థానాలు సైకిల్ ఖాతాలో ప‌డ‌డంతో టీడీపీ ఇక్కడ సంస్థాగ‌తంగా బ‌లంగా ఉంద‌న్నది అంగీక‌రించా ల్సిందే. పైగా టీడీపీ నాయ‌కులు ఎక్కువుగా ఉండ‌డంతో ఆ పార్టీ నేత‌లే నిత్యం ప్రజ‌ల‌తో ట‌చ్‌లో ఉంటోన్నారు. అయితే దీనిని తుడిచి పెట్టి వైసీపీ జెండా ఎగ‌రేయాల‌నే ఏకైక లక్ష్యంతో ఆ పార్టీ అధినేత జ‌గ‌న్ పార్టీ ఓడిన తూర్పు నియోజ‌క‌వ‌ర్గంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. గ‌త ఎన్నిక‌ల్లో తూర్పులో ఓడిన బొప్పన భ‌వ‌కుమార్‌కు పార్టీని బలోపేతం చేయడానికి న‌గ‌ర పార్టీ బాధ్యత‌లు అప్పగించారు.

నాడి తెలిసిన నేతగా…..

న‌గ‌రం నాడి తెలిసిన నాయ‌కుడిగా, గ‌తంలో కార్పొరేట‌ర్‌గా చేసిన అనుభ‌వంతో పాటు ఎమ్మెల్యేగా పోటీ చేసిన అనుభ‌వం కూడా ఉండ‌డంతో బొప్పన దూకుడుగా ముందుకు సాగుతార‌ని, పార్టీని బ‌లోపేతం చేస్తార‌ని కూడా భావించారు. కానీ, ఏడాది గ‌డిచినప్పటికీ (బెజ‌వాడ పార్టీ ప‌గ్గాలు చేప‌ట్టి) భ‌వ కుమార్ మాత్రం దూకుడు చూపించ‌లేక పోతున్నారు. ముఖ్యంగా ఎన్నిక‌ల‌కు ముందు పార్టీలో ఉన్న జోష్‌ను కూడా ఆయ‌న కొన‌సాగించ‌లేక పోతున్నార‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. ఎన్నిక‌ల‌కు ముందు న‌గ‌రంలో మూడు నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ ప‌లువురు నాయ‌కులు ఎలాంటి ఆశ‌లు లేకుండా వైసీపీకి మ‌ద్దతు ప‌లికారు. ఇప్పుడు మాత్రం సైలెంట్‌గా ఉంటున్నారు. దీనికి కార‌ణాలు ఏవైనా.. వారితో ములాఖ‌త్ అయి.. వారి స‌మ‌స్యల‌ను ప‌రిష్కరించేందుకు, మ‌ద్దతు కూడ‌గ‌ట్టేందుకు ప్రయ‌త్నించాల్సిన అవ‌స‌రం ఉంది.

గ్రూపు రాజకీయాలు…..

ముఖ్యంగా తూర్పు నియోజ‌క‌వ‌ర్గంలో మాజీ ఎమ్మెల్యే ర‌వి య‌ల‌మంచిలిని కూడ‌గ‌ట్టుకుని పార్టీని బ‌లోపేతం చేయ‌డంలోనూ బొప్పన భవకుమార్ విఫ‌ల‌మ‌వుతున్నారు. ఇక ప్రస్తుత ఇన్‌చార్జ్ అవినాష్‌తోనూ స‌రైన సంబంధాలు లేవు. ఇక‌, ప‌శ్చిమ‌లో పార్టీని బ‌లోపేతం చేయాల‌న్న స్పృహే లేకుండా పోయింద‌ని అంటున్నారు. అయితే.. అటు సెంట్రల్ నియోజ‌క‌వ‌ర్గంలో ఎమ్మెల్యే విష్ణు, ఇటు ప‌శ్చిమ‌లో మంత్రి వెలంప‌ల్లి దూకుడుగా ఉన్నారు. దీంతో త‌మ త‌మ నియోజ‌క‌వ‌ర్గాల్లో జోక్యం చేసుకోవ‌ద్దని వారు బ‌హిరంగంగానే బొప్పన‌ భవకుమార్ కు సూచిస్తున్నారు. దీంతో ఆయ‌న కేవ‌లం తూర్పుకే ప‌రిమిత‌మై కాళ్లు, వేళ్లు పెడుతుండ‌డంతో గ్రూపు రాజ‌కీయాలు ఎక్కువ అవుతున్నాయి.

పేరుకు పార్టీ అధ్యక్షుడిగా….

దీంతో తూర్పు నియోజ‌క‌వ‌ర్గంలో యువ నాయ‌కుడు, ఇంచార్జ్ దేవినేని అవినాష్ వైపు కార్యక‌ర్తలు మొగ్గు చూపుతున్నారు. వారి స‌మ‌స్యల‌ను ఆయ‌న‌కే నివేదిస్తున్నారు. ఏదైనా ఉంటే.. వారితోనే చ‌ర్చిస్తున్నారు. పేరుకు న‌గ‌ర పార్టీ అధ్యక్షుడిగా ఉన్నా బొప్పన భ‌వ‌కుమార్‌కు అటు కేడ‌రూ లేదు… ఇటు పార్టీపై గ్రిప్ లేకుండా పోయింది. మొత్తంగా ఈ ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. బొప్పన పాలిటిక్స్ బోరు కొడుతున్నాయ‌నే టాక్ బెజ‌వాడ‌లో బ‌లంగా వినిపిస్తోంది.

Tags:    

Similar News