ఆ ముగ్గురు ఎమ్మెల్యేల‌తో జ‌గ‌న్‌కు ఇంత త‌ల‌నొప్పా ?

తిరుప‌తి ఉప ఎన్నిక ఫ‌లితం ఎలా ఉండ‌బోతోంద‌న్న విష‌యంలో ఎవ్వరికి సందేహం లేదు. అధికార వైసీపీ ఇక్కడ పాగా వేసి త‌న సిట్టింగ్ సీటు నిల‌బెట్టుకుంటుంద‌నే అంద‌రూ [more]

Update: 2021-04-18 12:30 GMT

తిరుప‌తి ఉప ఎన్నిక ఫ‌లితం ఎలా ఉండ‌బోతోంద‌న్న విష‌యంలో ఎవ్వరికి సందేహం లేదు. అధికార వైసీపీ ఇక్కడ పాగా వేసి త‌న సిట్టింగ్ సీటు నిల‌బెట్టుకుంటుంద‌నే అంద‌రూ చెపుతున్నారు. ప‌రిణామాలు కూడా అలాగే ఉన్నాయి. అయితే ఆ పార్టీ నిర్దేశించుకున్నట్టుగా 3 ల‌క్ష‌ల మెజార్టీ వ‌స్తుందా ? రాదా ? ఈ మెజార్టీని విప‌క్ష పార్టీలు ఎంత వ‌ర‌కు త‌గ్గిస్తాయ‌న్న సందేహం ఒక్కటి మాత్రమే మిగిలి ఉంది. వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎంత ఫుల్ స్వింగ్‌లో ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

ఇద్దరు ఎమ్మెల్యేలు…..

ప్రత్యేకించి ఏడు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే ఉన్నా.. ఇద్దరు ఎమ్మెల్యేలు పార్టీ యాక్టివిటీస్ లో అంత చురుకుగా ఉన్నారా? అనే ప్రశ్న త‌లెత్తుతోంది. వారిలో వెంక‌ట‌గిరి అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే ఆనం రామ‌నారాయ‌ణ రెడ్డి, గూడురు ఎమ్మెల్యే వ‌ర‌ప్రసాద్ ల విష‌యంలో చ‌ర్చ జ‌రుగుతూ ఉంది. వీరిద్దరిలో రామ‌నారాయ‌ణ రెడ్డి అస‌లు నియోజ‌క‌వ‌ర్గంలో కేడ‌ర్‌కే అందుబాటులో ఉండ‌డం లేద‌ని పార్టీ నేత‌లే చెపుతున్నారు. ఉంటే ఆయ‌న హైద‌రాబాద్‌లో ఉండ‌డం లేదా నెల్లూరులో ఉండ‌డ‌మో చేస్తున్నార‌ట‌.

ఆనంను పట్టించుకోకుండా….

కాంగ్రెస్‌లో ఓ వెలుగు వెలిగిన ఆయ‌న రాజ‌శేఖ‌ర్‌రెడ్డి మ‌ర‌ణాంత‌రం కూడా కిర‌ణ్‌కుమార్ రెడ్డి మ‌నిషిగా జిల్లా రాజ‌కీయాలు శాసించారు. ఆ త‌ర్వాత జ‌గ‌న్‌ను తీవ్రంగా విబేధించి టీడీపీలో చేరారు. అక్కడా ప్రయార్టీ లేక‌పోవ‌డంతో గ‌త ఎన్నిక‌ల‌కు ముందు వైసీపీలో చేరి వెంక‌ట‌గిరి ఎమ్మెల్యే అయ్యారు. సీనియార్టీకి త‌గిన ప్రాధాన్యం ఇవ్వడం లేద‌ని అధిష్టానంపై ఆగ్రహంతో ఆయ‌న పార్టీ కార్యక్రమాల‌కు దూరంగా ఉంటున్నారు. ఇక జ‌గ‌న్‌ను సైతం ఆయ‌న విమ‌ర్శిస్తున్నారు. ఈ ఉప ఎన్నిక‌ను కూడా ఆయ‌న ప‌ట్టించుకోక‌పోవ‌డంతో పార్టీ అధిష్టానం వెంక‌ట‌గిరి బాధ్యత‌లు ఇద్దరు మంత్రుల‌కు అప్పగించింది. అస‌లు అధిష్టానం సైతం ఆయ‌న్ను ప‌ట్టించుకోకుండా వెంక‌ట‌గిరిలో ప్రచారం చేస్తోంది.

గ్రూపు రాజకీయాలకు….

ఇక ఇక గుడూరు ఎమ్మెల్యే వ‌ర‌ప్రసాద్ కూడా గ‌తంలో అంత యాక్టివ్ గా లేరు. పార్టీ ప్రతిప‌క్షంలో ఉన్నప్పుడు తిరుప‌తి ఎంపీగా ఎంతో క్రియాశీల‌క పాత్ర పోషించిన ఆయ‌న ఇప్పుడు ఎమ్మెల్యే అయ్యాక గూడూరులో గ్రూపు రాజ‌కీయాల‌కు కేంద్ర బిందువు అయ్యారు. రెడ్డి సామాజిక వ‌ర్గంతో పాటు పార్టీలో సీనియ‌ర్ నేత‌ల‌ను ఆయ‌న ప‌ట్టించుకోవ‌డం లేదు. దీంతో ఆయ‌న‌పై సొంత పార్టీ కేడ‌ర్లోనే తీవ్రమైన వ్యతిరేక‌త ఉంది. వైసీపీ అధిష్టానం ఆయ‌న్ను కూడా ప‌ట్టించుకోకుండా త‌న డైరెక్షన్‌లోనే గూడూరులో ప్రచారం చేస్తోంది.

కాకాణి కూడా….?

ఇక స‌ర్వేప‌ల్లి ఎమ్మెల్యే కాకాణి గోవ‌ర్థన్ రెడ్డి కూడా పైకి చెప్పుకోక‌పోయినా లోలోన ర‌గులుతున్నారు. ఈ ఉప ఎన్నిక‌ల ప్రచారాన్ని ఆయ‌న లైట్ తీస్కున్నార‌నే అంటున్నారు. గ‌తంలో జ‌డ్పీ చైర్మన్‌గా, జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉండ‌డంతో పాటు సోమిరెడ్డి లాంటి నేత‌ను రెండు సార్లు ఓడించి… పార్టీ ప్రతిప‌క్షంలో ఉన్నప్పుడు నిల‌బెట్టినా త‌న‌కు క‌నీసం ప్రయార్టీ ఇవ్వలేద‌ని ఆయ‌న కొద్ది రోజులుగా అంటీముట్టన‌ట్టుగా ఉంటున్నారు. దీనికి తోడు కోటంరెడ్డితో పాటు మంత్రి అనిల్‌తో ఉన్న గ్యాప్ నేప‌థ్యంలో కాకాణ అస‌మ్మతి నివురు గ‌ప్పిన నిప్పులా ఉంది. ఇక పైకి చెప్పుకోక‌పోయినా తిరుప‌తిలో భూమ‌న‌కు ఇటీవ‌ల కార్పోరేష‌న్ ఎన్నిక‌ల్లో ప్రయార్టీ ఇవ్వలేద‌ని ఆయ‌న కూడా ర‌గులుతున్నారు. మ‌రి వీరి అస‌మ్మతి ఎన్నిక‌ల్లో పార్టీ అభ్యర్థి గెలుపు / మెజార్టీపై ఎంత వ‌ర‌కు ప్రభావం చూపిస్తుందో ? చూడాలి.

Tags:    

Similar News