జగన్ బలానికి అదే లిట్మస్ టెస్ట్…?

రాజకీయాల్లో ఉన్న వారికి కొన్ని లెక్కలు పక్కాగా ఉంటాయి. వాటిని వారు కచ్చితంగా ఫాలో అవుతారు. తమ లెక్కలకు భిన్నంగా ఏదైనా జరుగుతుంది అనుకున్నపుడే యాగీ చేస్తారు. [more]

Update: 2021-01-23 06:30 GMT

రాజకీయాల్లో ఉన్న వారికి కొన్ని లెక్కలు పక్కాగా ఉంటాయి. వాటిని వారు కచ్చితంగా ఫాలో అవుతారు. తమ లెక్కలకు భిన్నంగా ఏదైనా జరుగుతుంది అనుకున్నపుడే యాగీ చేస్తారు. ఏపీలో జగన్ సర్కార్ 151 సీట్లతో బంపర్ మెజారిటీని సాధించి అధికారంలోకి వచ్చిన సంగతి విదితమే. పూనకం వచ్చినట్లుగా జనం ఓటేశారు అని టీడీపీ అధినేత చంద్రబాబు అంటున్నారు. ఒక్క ఛాన్స్ మాత్రమే అని జగన్ బతిమాలుకుంటే మాత్రమే జనం ఇచ్చారని కూడా తమ్ముళ్ళు ఇప్పటికి వందసార్లు అంటూ వచ్చారు. జగన్ గెలుపు గాలివాటం అని కూడా ఎద్దేవా చేస్తున్నారు.

వాపా…. బలమా…?

ఒకే ఒక్క ఎన్నికతో జగన్ ఏపీ రాజకీయాల్లో అత్యంత శక్తిమంతుడు అయ్యాడు. ఆ మాట అంటే విపక్షం అసలు నమ్మదు. జగన్ బలానికి మరిన్ని లిట్మస్ టెస్టులు చేయాల్సిందే అంటుంది. జగన్ మాయ మాటలకు నాడు జనం మోసపోయారని ఇపుడు ఎన్నికలు పెడితే జగన్ పార్టీ ఓడడం ఖాయమని టీడీపీ అధినాయకత్వం కడు నమ్మకంగా చెబుతోంది. మరి ఆ లిట్మస్ టెస్టులు కూడా రెడీగా ఉన్నాయి. ఒకటి తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల రూపంలో ఉంటే మరొకటి స్థానిక ఎన్నికల రూపంలో వేచి ఉన్నాయి. మరి ఈ రెండింటిలో ఏది ముందు ఏది వెనక అన్నదే ఇపుడు పెద్ద చర్చ.

తిరుపతి నుంచే…?

ఇక వైసీపీ విషయానికి వస్తే తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల్లో గెలుపు కి నో డౌట్. దాదాపుగా రెండున్నర లక్షల ఓట్ల తేడాతో రెండేళ్ళ క్రితం గెలిచిన వైసీపీకి అక్కడ మంచి బేస్ ఉంది. దాంతో గెలుపు విషయంలో చూసుకోనక్కరలేదు. ఆ విధంగా చూస్తే తిరుపతి ఉప ఎన్నికతో బోణీ కొట్టి ఆ మీదట స్థానిక ఎన్నికలను ఎదుర్కోవాలని వైసీపీ గట్టిగా భావిస్తోందిట. ఎందుకంటే ఈ విజయం అందించే రీ సౌండ్ అలాంటిది మరి. దీంతో ఏపీలో జగన్ కి ఎదురులేదని చాటి మరీ లోకల్ ఫైట్ కి దిగాలని చూస్తోందిట.

వర్కౌట్ అవుతుందా..?

ఇక తెలుగుదేశం విషయానికి వస్తే ముందు లోకల్ ఫైట్ అంటోంది. స్థానిక ఎన్నికలు అంటే కచ్చితంగా క్షేత్ర స్థాయిలో బలం బలగం ప్రధాన పాత్ర పోషిస్తాయి. దాంతో సంస్థాగతంగా బలంగా ఉన్న టీడీపీకి లోకల్ ఫైట్ బాగా హెల్ప్ అవుతుందని నమ్మకం ఉందిట. అక్కడ గెలిచిన తరువాత తిరుపతి ఉప‌ ఎన్నికల్లో తొడగొడితే రిజల్ట్ లో ఏమైనా తేడా ఉంటుందన్న ఆశ టీడీపీది. లోకల్ ఫైట్ ని వైసీపీ వ్యూహాత్మకంగా ఆపుతోంది. టెక్నికల్ రీజన్స్ చూపించి మరీ అడ్డుకుంటోంది. కానీ ఏమైనా అనూహ్యమైన ఘటనలు జరిగి లోకల్ ఫైట్ ముందే వస్తే అసలైన లిట్మస్ టెస్ట్ కి వైసీపీ దొరికిపోతుందని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.

Tags:    

Similar News