అగ్గిపుల్ల వేస్తే చాలట… ఇక వేరే ఏం అక్కర్లేదట

నాయ‌కులు క‌ష్టప‌డ్డారు. అస‌లు పార్టీకి డిపాజిట్లు అయినా వ‌స్తాయా? రావా? అని అనుకున్న జిల్లాలో ఉవ్వె త్తున ఎగిసి ప‌డేలా విజ‌య ప్రభంజ‌నం మోగించారు. అయితే, ఆరు [more]

Update: 2020-03-09 15:30 GMT

నాయ‌కులు క‌ష్టప‌డ్డారు. అస‌లు పార్టీకి డిపాజిట్లు అయినా వ‌స్తాయా? రావా? అని అనుకున్న జిల్లాలో ఉవ్వె త్తున ఎగిసి ప‌డేలా విజ‌య ప్రభంజ‌నం మోగించారు. అయితే, ఆరు నెల‌లు గ‌డిచేస‌రికి నాయ‌కులు ఎవ‌రికి వారే య‌మునా తీరే అన్నచందంగా మారిపోయారు. దీంతో అస‌లు పార్టీ ప‌రిస్థితే ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారిపోయింది. మ‌రి ఇంతగా మారిపోయిన ప‌రిస్థితి ఎక్కడ ఉంది? ఏం జ‌రిగింది? చూద్దాం.. ప‌దండి.. శ్రీకాకుళం జిల్లా.. ఏపీకి బోర్డర్‌లో ఉన్న జిల్లా. ఇక్కడ టీడీపీకి కంచుకోట‌లు చాలానే ఉన్నాయి. దీంతో ఆ పార్టీ ఎప్పుడు ఎన్నిక‌లు వ‌చ్చినా ధీమాగా గెలుపు గుర్రం ఎక్కేది. ఏపీ టీడీపీ అధ్యక్షుడు క‌ళా వెంక‌ట్రావు, మాజీ మంత్రి అచ్చెన్నాయుడు, రామ్మోహ‌న్‌ నాయుడు, గౌతు ఫ్యామిలీ, కూన ర‌వికుమార్‌, క‌ల‌మ‌ట వెంక‌ట‌ర‌మ‌ణ లాంటి కీల‌క నేత‌లు ఈ జిల్లాలోనే ఉన్నారు. పైగా గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో టీడీపీ మ‌రిన్ని ఆశ‌లు పెట్టుకుంది.

తిత్లీని అడ్డం పెట్టి…..

తిత్లీ తుఫాను ఎఫెక్ట్‌తో 2018 చివ‌రాఖ‌రులో శ్రీకాకుళం అట్టుడికిపోయింది. దీంతో చంద్రబాబు అక్కడే మకాంవేసి ప్రజ‌ల బాగోగులు చూసుకున్నారు. అదే స‌మ‌యంలో ప‌క్క జిల్లాలో పాద‌యాత్ర చేస్తున్న వైసీపీ అధినేత అప్పటి విప‌క్ష నేత జ‌గ‌న్ క‌నీసం బాధితుల‌ను కూడా ప‌రామ‌ర్శించ‌లేదు. దీంతో ఈ ఛాన్స్‌ను మిస్ చేసుకోకూడ‌ద‌ని భావించిన టీడీపీ వెంట‌నే వైసీపీని బోనులో పెట్టేసి ఎన్నిక‌ల్లో ప్రచారాస్త్రం చేసు కుంది. జ‌గ‌న్‌కు శ్రీకాకుళం పేద‌లంటే అలుస‌ని, క‌నీసం బాధ‌ల్లో ఉన్నప్పుడైనా కూడా ఆయ‌న ఇక్కడి ప్రజ‌ల‌ను ప‌రామ‌ర్శించేందుకు రాలేదని పెద్ద ఎత్తున విమ‌ర్శలు మొద‌లు పెట్టింది. దీంతో ఎన్నిక‌ల్లో ఏక‌ప‌క్షంగా టీడీపీ కే ప్రజ‌లు ఓట్లు గుద్దేస్తార‌ని అనుకుంది.

అంతర్గత కుమ్ములాటలు…..

అయితే, అలా అనుకున్నప్పటికీ ప్రజ‌లు మాత్రం వైసీపీకే మ‌ద్దతు ప‌లికారు. క‌ట్ చేస్తే చాలా మంది నాయ‌కులు వైసీపీ త‌ర‌ఫున ఇక్కడ విజ‌యం సాధించారు. ఇంత వ‌ర‌కు బాగానే ఉన్నా.. ఇప్పుడు అదే నేత‌లు ఒక‌రిలో ఒక‌రు త‌న్ను కుంటున్నారు. ఈ జిల్లా నుంచి ఒక మంత్రి, ఒక స్పీక‌ర్ ప్రాతినిథ్యం వ‌హిస్తున్నారు. ధ‌ర్మాన కృష్ణదాస్, త‌మ్మినేని సీతారాంలు జ‌గ‌న్‌కు స‌న్నిహితులు కూడా. అయితే, మిగిలిన నాయ‌కుల‌ను క‌లుపుకొని పోక‌పోగా వీరిలో వీరే త‌న్నుకుంటున్నారు. దీంతో ఇప్పుడు పార్టీ ప‌రిస్థితి అగ‌మ్యంగా మారింది. ధ‌ర్మాన సోద‌రులు కృష్ణదాస్‌, ప్రసాద‌రావుల‌కు మ‌ధ్య ప‌చ్చగ‌డ్డి వేస్తే భ‌గ్గుమంటోంది.

ఆధిపత్య పేరుతో…..

త‌న‌కు రావాల్సిన మంత్రి ప‌ద‌వి అన్న త‌న్నుకు పోయాడ‌న్న వేద‌న ధ‌ర్మానను బాగా కుంగ‌దీస్తోంది. అదే స‌మ‌యంలో ధ‌ర్మాన‌కు తమ్మినేనికి మ‌ధ్య కూడా తీవ్రమైన విబేధాలు ఉన్నాయి. ఇక మాజీ మంత్రి అచ్చెన్న ప్రాతినిథ్యం వ‌హిస్తోన్న టెక్కలి నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీలో మూడు ముక్కలాట న‌డుస్తోంది. నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌న్వయ‌క‌ర్త పేరాడ తిల‌క్‌కు, శ్రీకాకుళం పార్లమెంట‌రీ జిల్లా పార్టీ అధ్యక్షుడు దువ్వాడ శ్రీనివాస‌రావుకి మ‌ధ్య తీవ్ర వార్ న‌డుస్తోంది. ఇదిలావుంటే, కిల్లి కృపారాణికి, జ‌గ‌న్ ఎక్కడ ప‌దవి ఇచ్చేస్తారో.. తామెక్కడ డౌన్ అవుతామోన‌ని భావించిన పేరాడ‌, దువ్వాడ‌లు మ‌ళ్లీ క‌లిసిపోయి కిల్లిపై పోరుచేస్తున్నారు. ఇక రాజాంలో కంబాల జోగులుకు ఎస్సీ కోటాలో మంత్రి ప‌ద‌వి వ‌స్తుంద‌ని ఆయ‌న్ను జిల్లాలో కొంద‌రు ఇబ్బంది పెడుతున్నారు. పాల‌కొండ‌లో రెండోసారి గెలిచిన క‌ళావ‌తిని కూడా కొందరు టార్గెట్ చేస్తున్నారు. దీంతో పార్టీ క‌న్నా కూడా జిల్లాలో ఆధిప‌త్యం పెంచుకునేందుకు నాయ‌కులు కొట్టుకుంటున్న తీరుతో కేడ‌ర్ క‌కావిక‌ల‌మ‌వుతోంది. మ‌రి జ‌గ‌న్ ఇక్కడ పార్టీకి కాయ‌క‌ల్ప చికిత్స చేస్తారేమో ? చూడాలి.

Tags:    

Similar News