వైసీపీ వర్సెస్ వైసీపీ.. 2019కు ముందు… తర్వాత అట

ఇది ఊహించిందేమీ కాదు. అనుకున్నదే. ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలతో ఇప్పుడు అధికార పార్టీ వైసీపీకి తలనొప్పిగా మారింది. ప్రధానంగా పంచాయతీ ఎన్నికల విషయంలో ఈ [more]

Update: 2021-02-01 00:30 GMT

ఇది ఊహించిందేమీ కాదు. అనుకున్నదే. ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలతో ఇప్పుడు అధికార పార్టీ వైసీపీకి తలనొప్పిగా మారింది. ప్రధానంగా పంచాయతీ ఎన్నికల విషయంలో ఈ విషయం స్పష్టంగా కన్పిస్తుంది. ఇప్పుడు వైసీపీలో 2019కు ముందు .. తర్వాత అనే ఇంటర్నల్ వార్ జరుగుతుందన్నది మాత్రం వాస్తవం. పంచాయతీ ఎన్నికల సందర్భంగా అధికార వైసీపీ పార్టీ నేతలకు కిందిస్థాయి క్యాడర్ ను బుజ్జగించడం కత్తిమీద సాముగా మారింది.

నామినేషన్లు పడటంతో….

రాష్ట్రంలోని అనేక నియోజకవర్గాల్లో నామినేషన్లను ఎక్కువగా వైసీపీ వర్గాల నుంచే దాఖలయినట్లు సమాచారం. ప్రతి నియజకవర్గంలో వైసీపీ రెండు గ్రూపులుగా ఉండటమే ఇందుకు కారణం. ప్రస్తుత ఎమ్మెల్యేతో పాటు గతంలో పార్టీకి పనిచేసిన ఆ నియోజకవర్గ నేతల మధ్య సఖ్యత కుదరడం లేదు. ఏకగ్రీవం చేసుకుందామనుకున్న వైసీపీ నేతల ఆశలు పార్టీలో పోటీ కారణంగా అడుగంటి పోతున్నాయి.

గన్నవరం నియోజకవర్గంలో….

ఇక ఇతర పార్టీల నుంచి వచ్చిన వారితో కూడా తలనొప్పిగా మారింది. ప్రధానంగా చీరాల, గన్నవరం నియోజకవర్గాల్లో ఈ సీన్ స్పష్టంగా కన్పిస్తుంది. గన్నవరం నియోజకవర్గంలో వల్లభనేని వంశీ, యార్లగడ్డ వెంకట్రావు వర్గాల మధ్య ఇప్పటికీ సయోధ్య కుదరలేదు. జగన్ స్వయంగా కల్పించుకున్నా ఫలితం లేదు. పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఇక్కడ టీడీపీ సైలెంట్ గా ఉన్నా ఇక్కడ నామినేషన్లు వేయడానికి రెండు వర్గాలు పోటీ పడ్డాయి. ఇది అధికార వైసీపీకి ఇబ్బందికరంగా మారింది.

చీరాల నియోజకవర్గంలో….

ఇక ప్రకాశం జిల్లా చీరాల నియోజకవర్గంలో కూడా ఇదే పరిస్థిితి. కరణం బలరాం చేరికతో ఇక్కడ ఆమంచి కృష్ణమోహన్ వర్సెస్ కరణంగా మారింది. చీరాల నియోజకవర్గం పరిధిలో రామన్న పేట పంచాయతీకి ఎన్నికలు జరుగుతున్నాయి. సర్పంచ్ స్థానంతో పాటు 14 వార్డులకు ఎన్నికలు జరుగుతుండటంతో అన్ని స్థానాల్లోనూ రెండు వర్గాలు పోటీ పడి మరీ నామినేషన్లు వేశారు. దీంతో ఇక్కడ ఏకగ్రీవం అనే ఊసేలేదు. వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి జగన్ ఏకగ్రీవాలను ప్రోత్సహించాలని ఒక వైపు చెబుతుంటే, క్షేత్రస్థాయిలో నేతలు మాత్రం పార్టీలో గ్రూపులుగా విడిపోయి నామినేషన్లు వేసేస్తున్నారు. మరి చివరి నిమిషంలో ఎంతమంది ఉపసంహరించుకుంటారో చూడాలి.

Tags:    

Similar News