మైదుకూరు లో గాలి మళ్లిందా?

రాష్ట్ర మంతటా ఫ్యాన్ గాలి బలంగా వీచింది. కానీ మైదుకూరు, తాడిపత్రిలో మాత్రం టీడీపీ విజయం సాధించింది. తాడిపత్రిలో అంటే జేసీ బ్రదర్స్ స్ట్రాంగ్ గా ఉన్నారు. [more]

Update: 2021-03-15 08:00 GMT

రాష్ట్ర మంతటా ఫ్యాన్ గాలి బలంగా వీచింది. కానీ మైదుకూరు, తాడిపత్రిలో మాత్రం టీడీపీ విజయం సాధించింది. తాడిపత్రిలో అంటే జేసీ బ్రదర్స్ స్ట్రాంగ్ గా ఉన్నారు. వారిపై పెట్టిన కేసులు వల్ల కూడా వారిపట్ల కొంత సానుభూతి పెరిగింది. కానీ మైదుకూరుకు ఏమైంది? ఇక్కడ ఎమ్మెల్యేపై వ్యతిరేకతా? పార్టీలో గ్రూపుల గోలా? అన్నది ఇప్పుడు చర్చనీయాంశమైంది. జగన్ తన సొంత జిల్లా మైదుకూరులో ఓటమి పాలు కావడంతో ఒకింత సీరియస్ అయినట్లు తెలుస్తోంది.

రెండుసార్లు ఎమ్మెల్యేగా…..

మైదుకూరు ఎమ్మెల్యేగా శెట్టిపల్లి రఘురామిరెడ్డి ఉన్నారు. ఆయన 2014, 2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ పైన విజయం సాధించారు. వరస గెలుపులతో ఉన్న శెట్టిపల్లి రఘురామిరెడ్డికి మైదుకూరులో సొంత పార్టీలోనే అసంతృప్తి ఉన్నట్లు తెలుస్తోంది. క్యాడర్ ను పట్టించుకోక పోవడం, కేవలం కొందరితోనే సన్నిహితంగా మెలగడం వంటివి మైదుకూరు నియోజకవర్గంలో ఆయనపై అసంతృప్తిని పెంచాయంటున్నారు.

సంక్షేమ పథకాలు అమలవుతున్నా….

మైదుకూరు మున్సిపాలిటీలో మొత్తం 24 వార్డులున్నాయి. ఇందులో 12 వార్డుల్లో టీడీపీ విజయం సాధించింది. 11 వార్డుల్లో వైసీపీ గెలిచింది. ఒక స్థానంలో జనసేన గెలిచింది. ఇక్కడ అధికారంలోకి వచ్చేది ఎవరన్న ప్రశ్న పక్కన పెడితే మైదుకూరులో పార్టీ ఇంత డ్యామేజీ కావడానికి కారణాలేంటన్న దానిపై పార్టీ నాయకత్వం ఆరా తీసిందంట. జగన్ సంక్షేమ పథకాలు నియోజకవర్గంలో అమలవుతున్నా ప్రజలు మాత్రం టీడీపీకే పట్టం కట్టారు.

డీఎల్ వర్గం…..

ఇక మైదుకూరు నియోజకవర్గం నుంచి సీనియర్ నేత డీఎల్ రవీంద్రారెడ్డిని వేరు చేసి చూడలేం. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన వైసీపీకి మద్దతిచ్చారు. అయితే ఈ మున్సిపల్ ఎన్నికల్లో డీఎల్ వర్గం దూరంగా ఉందంటున్నారు. పరోక్షంగా టీడీపీకి అండగా నిలిచిందంటున్నారు. జగన్ అధికారంకి వచ్చినా తనను పట్టించుకోక పోవడంతోనే డీఎల్ వర్గం మైదుకూరులో వైసీపీకి వ్యతిరేకంగా పనిచేసిందంటున్నారు. మొత్తం మీద వైసీపీలో తాడిపత్రి కంటే మైదుకూరు హాట్ టాపిక్ గా మారింది.

Tags:    

Similar News