Ycp : పెరుగుతున్న అలకలు… రాజీనామాల దిశగా?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు పరిషత్ ఎన్నికలు తలనొప్పిగా మారాయి. ఎంపీపీ పదవి కోసం డిమాండ్లు ఎక్కువగా విన్పిస్తున్నాయి. ఎంపీపీ ఎన్నిక రేపు జరగాల్సి ఉండగా అనేక [more]

Update: 2021-09-23 06:30 GMT

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు పరిషత్ ఎన్నికలు తలనొప్పిగా మారాయి. ఎంపీపీ పదవి కోసం డిమాండ్లు ఎక్కువగా విన్పిస్తున్నాయి. ఎంపీపీ ఎన్నిక రేపు జరగాల్సి ఉండగా అనేక జిల్లాల్లో అసంతృప్తులు బయటపడుతున్నాయి. తమకు పదవి ఇవ్వాలంటూ కొన్ని చోట్ల ఆందోళనకు దిగాయి. కొందరు రాజీనామాలు చేస్తున్నట్లు హెచ్చరికలు కూడా పంపుతున్నారు. ఎమ్మెల్యేలు మాట తప్పారంటూ శాపనార్థాలు పెడుతున్నారు.

తన వర్గానికి….

కదిరి నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే సిద్ధారెడ్డికి ఎంపీపీ పదవి ఎంపిక తలనొప్పిగా మారింది. వైసీపీ గుర్తుమీద గెలిచిన రామలక్షమ్మ తన పదవికి రాజీనామా చేశారు. ఎమ్మెల్యే సిద్దారెడ్డి తనకు ఎంపీపీ పదవి ఇస్తామని మోసం చేశారని ఆమె ఆరోపిస్తున్నారు. కదిరి మండలంలో వడ్డెర సామాజికవర్గం ఎక్కువగా ఉన్నా, తనకు ఇవ్వకుండా ఎమ్మెల్యే తన సామాజికవర్గానికి ఎంపీపీ పదవి ఇస్తున్నారని ఆమె ఆరోపించారు. ఎంపీటీసీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

మాట ఇచ్చి తప్పారంటూ….

ఇక శ్రీకాకుళం జిల్లాలో మంత్రి ధర్మాన కృష్ణదాస్ కు పరిషత్ ఎన్నికల సెగ తగిలింది. పొలాకి ఎంపీపీ పదవి కోసం పార్టీలో రెండు వర్గాల మధ్య పోటీ పెరిగింది. ధర్మాన కృష్ణదాస్ చీడివలస నుంచి గెలిచిన వైసీపీ ఎంపీటీసీ దమయంతిని ఎంపిక చేశారన్న వార్తలతో తనకు పదవి రాలేదని మరో ఎంపీటీసీ శారద ఆందోళనకు దిగారు. ధర్మాన తనకు మాట ఇచ్చి తప్పారని, తనకు న్యాయం చేయాలని ఆమె ఆందోళనకు దిగారు. తమ్మినేని శారద వర్గీయులు ధర్మానకు వ్యతిరేకంగా సుసరాంలో ధర్నాకు దిగారు.

శక్తికి మించి ఖర్చుచేశామని…..

కర్నూలు జిల్లా గూడూరులోనూ వైసీపీ ఎంపీటీసీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం ఎదుట ఆందోళనకు దిగారు. కె. నాగులాపురం ఎంపీపీ పదవిని తనకు ఇవ్వకుండా ఎమ్మెల్యే సుధాకర్ ఇతరులకు కట్టబెడుతున్నారని ఎంపీటీసీ రాజమ్మ వర్గీయులు ఆందోళన చేస్తున్నారు. తమకు మాట ఇవ్వడంతో శక్తికి మించి ఖర్చు చేశామని వైసీపీ ఎంపీటీసీ వాపోతున్నారు. హైకమాండ్ నుంచి స్పష్టమైన హామీ లభించేంత వరకూ ఆందోళన విరమించేది లేదని హెచ్చరిస్తున్నారు. మొత్తం మీద ఎంపీపీ పదవుల ఎంపిక వైసీపీ ఎమ్మెల్యేలకు, తలనొప్పిగా మారింది.

Tags:    

Similar News