అప్పటి వరకూ ఆగాల్సిందేనా?

వైసీపీకి శాసనమండలిలో కొత్త బలం చేరింది. తాజాగా ఎమ్మెల్యే కోటా కింద ముగ్గురు ఎమ్మెల్సీలు ఏకగ్రీవంగా ఎన్నిక కావడంతో ఆరు నుంచి తొమ్మిదికి వైసీపీ బలం పెరిగినట్లైంది. [more]

Update: 2019-08-23 08:00 GMT

వైసీపీకి శాసనమండలిలో కొత్త బలం చేరింది. తాజాగా ఎమ్మెల్యే కోటా కింద ముగ్గురు ఎమ్మెల్సీలు ఏకగ్రీవంగా ఎన్నిక కావడంతో ఆరు నుంచి తొమ్మిదికి వైసీపీ బలం పెరిగినట్లైంది. శాసనమండలిలో మొత్తం సభ్యులు 58 మంది ఉంటే అందులో ఒక్క తెలుగుదేశానికే 38 మంది ఉన్నారు. ఓ విధంగా చెప్పాలంటే అసెంబ్లీలో ఆ పార్టీకి 23 మంది ఉంటే అంతకు మించి పెద్దల సభలో ఉన్నారన్నమాట. దాంతో అక్కడ వైసీపీ మాట చెల్లడంలేదు. ఈ విషయం గమనించి జగన్ కూడా నోరున్న మంత్రులను మండలికి పంపిస్తున్నారు. సీనియర్ మంత్రులు బొత్స సత్యనారాయణ, అనిల్ కుమార్ యాదవ్, కురసాల కన్నబాబు వంటి వారు మండలిలో గట్టిగానే నోరు చేసుకుంటున్నారు. అయితే మందబలం బాగా ఉన్న టీడీపీ ముంది వైసీపీ పెద్దగా జోరు చూపించలేకపోతోంది. ఈ పరిస్థితి మారాలంటే 2023 రావాల్సిందే. అప్పటికి టీడీపీ నుంచి చాలా మంది రిటైర్ అవుతారు.

ఆ కోటాలలో వాటాలు….

ఇక శాసనమండలిలో గవర్నర్ కోటా కింద రెండు ఎమ్మెల్సీలు వచ్చే ఏడాది మార్చికి ఖాళీ అవుతాయి. అవి కచ్చితంగా ప్రభుత్వంలో ఉన్న వైసీపీకే దక్కుతాయి. దాంతో బలం పదకొండుకు చేరుకునే అవకాశాలు ఉంటాయి. ఇక స్థానిక సంస్థల కోటాలో కూడా ఎమ్మెల్సీ సీట్లు వైసీపీకి లభిస్తాయి. అయితే ప్రస్తుతం లోకల్ బాడీలకు ఎన్నికలు జరిపించాల్సివుంది. ఈ ఏడాది డిసెంబర్ నాటికల్లా వాటిని పూర్తి చేసే పనిలో వైసీపీ ఉంది. దాంతో ఆ కోటా ద్వారా కూడా వైసీపీ ఎక్కువ సీట్లను గెలుచుకోవచ్చు. అధికారంలో ఉంది కాబట్టి దాదాపుగా అన్ని సీట్లను గెలుచుకున్నా ఆశ్చర్యం లేదు. ఇదిలా ఉంటే 2021 నాటికి మరో విడత మండలికి ఎమ్మెల్సీలు రిటైర్ అవుతారు. అపుడు కూడా వైసీపీ వాటిని కైవసం చేసుకునే అవకాశం ఉంది.

చినబాబుకు రిటైర్మెంట్……

ఇక పెద్దల సభకు 2017లో ఎన్నికైన లోకేష్ పదవీకాలం 2023తో ముగుస్తుంది. అంటే అప్పటికి ఇంకా వైసీపీ సర్కార్ అధికారంలో ఉంటుంది. దాంతో లోకేష్ సైతం తిరిగి మండలిలో అడుగుపెట్టేంత ఎమ్మెల్యేల బలం టీడీపీకి లేనందున ఆయన సార్వత్రిక ఎన్నికలకు ఏడాదికి ముందే చట్ట సభల నుంచి ప్రాతినిధ్యం లేకుండా వైదొలగాల్సివస్తుంది. దాంతో టీడీపీ బలం కూడా గణనీయంగా తగ్గిపోయి మండలిలో వైసీపీ ఆధిపత్యం కూడా బాగా పెరుగుతుంది. మొత్తం మీద చూసుకుంటే అసెంబ్లీలో బలం బాగా ఉన్నా శాసనమండలిలో మాత్రం వైసీపీకి ఇపుడిపుడే అడుగులు పడుతున్నాయి. మరో వైపు ఖాళీ అయిన ప్రతీ సీటు వైసీపీకి దక్కే అవకాశం ఉండగా వైసీపీలో ఆశావహులు, జగన్ హామీ ఇచ్చిన వారు పెద్ద మనుషులు అవుదామని బాగానే ఆశలు పెట్టుకున్నారు.

Tags:    

Similar News